22 ఏళ్ల తర్వాత మనోళ్లు గెలిచారు
కొలంబో: భారత్ 22 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. శ్రీలంకలో రెండు దశాబ్దాల తర్వాత టెస్టు సిరీస్ విజయం సాధించింది. లంకతో మూడో టెస్టులో టీమిండియా 117 పరుగులతో గెలుపొందింది. దీంతో ఈ మూడు టెస్టుల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. సెంచరీ హీరో చటేశ్వర్ పుజారాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', అశ్విన్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కాయి.
386 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లంకేయులు పోరాటపటిమ కనబరిచినా ఓటమి తప్పలేదు. 67/3 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు మంగళవారం బరిలో దిగిన లంక 268 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మాథ్యూస్ (110) సెంచరీతో పాటు కౌశల్ పెరీరా (70) హాఫ్ సెంచరీతో రాణించి లంక విజయంపై ఆశలు రేకెత్తించినా.. భారత బౌలర్ల జోరును అడ్డుకోలేకపోయారు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్ 4, ఇషాంత్ 3, ఉమేష్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 312, లంక 201 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 274 పరుగులు సాధించింది.
ఐదో రోజు లంక బ్యాట్స్మెన్ అనూహ్యంగా పుంజుకున్నారు. తొలి సెషన్లో లంక రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. లంచ్ విరామానికి లంక 134/5 స్కోరు చేసింది. రెండో సెషన్లో భారత బౌలర్లు వికెట్ మాత్రమే తీయగలిగారు. ప్రమాదంగా పరిణమించిన మాథ్యూస్, పెరీరా జోడీని అశ్విన్ విడదీశాడు. అశ్విన్ బౌలింగ్లో పెరీరా.. రోహిత్కు దొరికిపోయాడు. లంక 249/6 స్కోరుతో టీ బ్రేక్కు వెళ్లింది. విరామానంతరం కెప్టెన్ మాథ్యూస్ను ఇషాంత్ అవుట్ చేయడంతో లంక ఆశలు ఆవిరికాగా.. భారత్ విజయం దాదాపుగా ఖాయమైంది. ఆ తర్వాత లంక ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. అశ్విన్ ఒకే ఓవర్లో హెరాత్, ప్రసాద్ను పెవిలియన్ చేర్చాడు. అమిత్ మిశ్రా.. ప్రదీప్ను అవుట్ చేసి లాంఛనం పూర్తి చేశాడు.