హోరాహోరీగా కొలంబో టెస్టు
కొలంబో: భారత్, శ్రీలంకల మధ్య కీలక మూడో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. 386 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లంకేయులు పోరాటపటిమ ప్రదర్శిస్తున్నారు. 67/3 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు మంగళవారం బరిలో దిగిన లంక టీ విరామానికి 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ విజయానికి 4 వికెట్లు అవసరం కాగా, లంక ఇంకా 137 పరుగులు చేయాలి. భారత్ విజయం ఖాయమనుకున్న ఈ మ్యాచ్లో లంక పోరాటంతో ఆసక్తికరంగా మారింది.
ఐదో రోజు భారత బౌలర్లు వికెట్ల కోసం చెమటోడుస్తుండగా, లంక బ్యాట్స్మెన్ అనూహ్యంగా పుంజుకున్నారు. మాథ్యూస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మాథ్యూస్కు కౌశల్ పెరీరా (70) అండగా నిలిచి హాఫ్ సెంచరీ చేశాడు. తొలి సెషన్లో లంక రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. లంచ్ విరామానికి లంక 134/5 స్కోరు చేసింది. రెండో సెషన్లో భారత బౌలర్లు వికెట్ మాత్రమే తీయగలిగారు. ప్రమాదంగా పరిణమించిన మాథ్యూస్, పెరీరా జోడీని అశ్విన్ విడదీశాడు. అశ్విన్ బౌలింగ్లో పెరీరా.. రోహిత్కు దొరికిపోయాడు. మాథ్యూస్, హెరాత్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు ఇషాంత్, ఉమేష్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 312, లంక 201 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 274 పరుగులు సాధించింది.