శ్రీలంక, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టును వరుణుడు మరో సారి అడ్డుకున్నాడు. వర్షం కారణంగా రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. ఓపెనర్ చటేశ్వర్ పుజారా సెంచరీ చేయగా, స్పిన్నర్ అమిత్ మిశ్రా అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చటేశ్వర్ పుజారా 135, ఇషాంత్ శర్మ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. శ్రీలంక పేసర్ ప్రసాద్ నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా టాపార్డర్ 4 వికెట్లు కూల్చాడు. ప్రదీప్, మాధ్యూస్, కౌశల్, హెరాత్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దు కావడంతో 50 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్ తీవ్రంగా నిరాశపరిచారు. మిడిలార్డర్ లో రోహిత్ శర్మ, నమన్ ఓజా కాసేపు ఊరించినా.. భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. 170 పరుగులకు ఏడువికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ ను ఆఫ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆదుకున్నాడు. టైమ్లీ అర్థసెంచరీతో పుజారాకు సహకరించాడు. 87 బంతుల్లో ఏడు బౌండరీలతో 59 రన్స్ చేసిన ఆమిత్ హెరాత్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పుజారాతో కలిసి ఎనిమిదో వికెట్ కు 104 రన్స్ భాగస్వమ్యం నెలకొల్సాడు.
సెంచరీతో ఆదుకున్న పుజారా
టాపార్డర్ బ్యాట్స్ మెన్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూకట్టినా.. ఓపెనర్ చటేశ్వర్ పుజారా మాత్రం మరో ఎండ్ లో పాతుకు పోయాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 214 బంతులు ఎదుర్కొన్న పుజారా తొమ్మిది బౌండరీలతో సెంచరీ పూర్తి చేసి.. తర్వాత మరింత సమర్దంగా ఇన్నింగ్స్ ను నడిపించాడు. పుజారా, మిశ్రా రాణించడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది.