ట్రినిడాడ్ అండ్ టొబాగో : వెస్టిండీస్ ‘ఎ’తో తొలి రెండు అనధికారిక టెస్టులు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని మాత్రం చేజార్చుకుంది. మూడో టెస్టులో చివరి రోజు విండీస్ బ్యాట్స్‌మెన్ చక్కటి పోరాటపటిమ కనబర్చడంతో ఆ జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. 373 పరుగుల విజయలక్ష్యంతో ఆడుతూ విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరకు 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాబాజ్ నదీమ్ (5/103) మరోసారి రాణించినా... ఇతర బౌలర్ల వైఫల్యంతో భారత్ తమ ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. శుక్రవారం మొత్తం 94 ఓవర్లు ఆడిన విండీస్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. జెరెమీ సొలొజానో (250 బంతుల్లో 92; 8 ఫోర్లు), బ్రెండన్ కింగ్ (83 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సునీల్ ఆంబ్రిస్ (142 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో జట్టును ఓటమి నుంచి రక్షించారు. భారత్ ‘ఎ’ కెప్టెన్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నదీమ్ ఈ సిరీస్ నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున మొత్తం 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ పర్యటనలో 4–1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’, టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment