Trinidad and Tobago
-
కోతి కుప్పిగంతులు వేస్తూ హల్చల్
-
ఆపరేషన్ థియేటర్లో కోతి హల్చల్
వాషింగ్టన్: ఓ ఆసుపత్రిలో పాము సంచరిస్తోందన్న ఊహాగానాలు మొదలవడంతో అందులోని జనాలు భయాందోళనకు గురయ్యారు. తీరా అక్కడ పాము లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాముకు బదులుగా అక్కడి ఆపరేషన్ థియేటర్లో కోతి కుప్పిగంతులు వేస్తూ హల్చల్ చేసింది. ఈ ఘటన ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సుమారు మూడు నెలల లాక్డౌన్ తర్వాత ఆసుపత్రిలో శస్త్రచికిత్స సేవలను ప్రారంభించేందుకు శుక్రవారం సిబ్బంది సిద్ధమయ్యారు. (ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం) ఇంతలో ఓ ఆపరేషన్ గదిలో కోతి కనిపించగా వెంటనే దగ్గరలోని ఎంపరర్ వ్యాలీ జూ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే సదరు సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని కోతిని పట్టుకెళ్లారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. కోతి హంగామా వల్ల ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు ఆలస్యమయ్యాయి. అదే సమయంలో ఆసుపత్రిలో పెద్ద పాము కూడా తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో స్పందించిన యాజమాన్యం వీటిని ఖండించింది. ఆసుపత్రిలో పాము ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. (ఏటీఎమ్ చోరీకి యత్నించిన కోతి) -
భారత్ ‘ఎ’కు చేజారిన విజయం
ట్రినిడాడ్ అండ్ టొబాగో : వెస్టిండీస్ ‘ఎ’తో తొలి రెండు అనధికారిక టెస్టులు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని మాత్రం చేజార్చుకుంది. మూడో టెస్టులో చివరి రోజు విండీస్ బ్యాట్స్‌మెన్ చక్కటి పోరాటపటిమ కనబర్చడంతో ఆ జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. 373 పరుగుల విజయలక్ష్యంతో ఆడుతూ విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరకు 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాబాజ్ నదీమ్ (5/103) మరోసారి రాణించినా... ఇతర బౌలర్ల వైఫల్యంతో భారత్ తమ ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. శుక్రవారం మొత్తం 94 ఓవర్లు ఆడిన విండీస్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. జెరెమీ సొలొజానో (250 బంతుల్లో 92; 8 ఫోర్లు), బ్రెండన్ కింగ్ (83 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సునీల్ ఆంబ్రిస్ (142 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో జట్టును ఓటమి నుంచి రక్షించారు. భారత్ ‘ఎ’ కెప్టెన్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నదీమ్ ఈ సిరీస్ నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున మొత్తం 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ పర్యటనలో 4–1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’, టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. -
సచిన్ కోసం మరోసారి!
చాంపియన్స్ లీగ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న మాస్టర్ బ్లాస్టర్‌ను... మరోసారి కూడా అభిమానులు చూడాలంటే నేడు జరిగే రెండో సెమీఫైనల్లో ట్రినిడాడ్‌పై ముంబై ఇండియన్స్ గెలవాలి. న్యూఢిల్లీ: సమఉజ్జీల సమరం... ట్రినిడాడ్, ముంబైల మ్యాచ్‌ను ఒక్క ముక్కలో ఇలా చెప్పొచ్చు. దూకుడుగా ఆడే, ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మధ్య పోరాటం... రెండు జట్లూ తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో సంచలన విజయాలు సాధించాయి. అదే ఆత్మవిశ్వా సంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాంపియన్స్ లీగ్‌లో శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది. అందరి నోటా ఒకే మాట 2011లో హర్భజన్ సింగ్ సారథ్యంలోని ముంబై జట్టు చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో ఐపీఎల్‌లోనూ విజేతగా నిలిచింది. గతంతో పోలిస్తే ఈసారి ముంబై జట్టు మంచి దూకుడుగా ఆడుతుందని అనుకోవాలి. ఈసారి టోర్నీ ఆరంభం నుంచి ముంబై ఆటగాళ్లంతా ఒకటే మాట అంటున్నారు. ‘టైటిల్ గెలిచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలి’ అని చెబుతున్నారు. సచిన్ రంగు దుస్తుల్లో పోటీ క్రికెట్ ఆడటం ఈ టోర్నీతోనే ఆఖరు. కాబట్టి మాస్టర్ మరో మ్యాచ్ ఆడాలంటే ఇప్పుడు ముంబై గెలవాలి. బ్యాటింగ్‌లో డ్వేన్ స్మిత్, రోహిత్ శర్మ, పొలార్డ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సచిన్, కార్తీక్, రాయుడు ఫామ్‌లో లేకపోయినా మ్యాచ్‌ను ఏ క్షణమైనా మలుపు తిప్పగల సమర్థులు. బౌలింగ్‌లో కౌల్టర్ నైల్, రిషిధావన్, ఓజా, హర్భజన్ కీలకం. గత మ్యాచ్‌లో ఆడిన మ్యాక్స్‌వెల్‌ను కొనసాగిస్తారా లేక జాన్సన్‌ను తుది జట్టులో తెస్తారో చూడాలి. తమ చివరి మ్యాచ్‌లో పెర్త్‌పై సాధించిన అద్భుత విజయంతో ముంబై ఆత్మవిశ్వాసంతో ఉంది. అనూహ్యంగా ముందుకు... ఈసారి లీగ్‌లో ట్రినిడాడ్ బాగా ఆకట్టుకుంది. ‘బి’ గ్రూప్‌లో టాపర్‌గా సెమీస్‌కు చేరడం కాస్త ఆశ్చర్యకర పరిణామం. బ్రిస్బేన్‌పై గెలిచి, సన్‌రైజర్స్ చేతిలో ఓడిన ఈ కరీబియన్ జట్టు... టైటాన్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించడంతో వర్షం పడ్డా డక్‌వర్త్ పద్ధతిలో గట్టెక్కింది. అయినా చివరి మ్యాచ్‌లో గెలవాల్సిన స్థితిలో... పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి ఏకంగా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. మిగిలిన ఫలితాలు ఎలా ఉన్నా... కోట్ల మైదానంలో ధోనిసేనపై సాధించిన విజయం ఈ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. బౌలింగ్‌లో రామ్‌పాల్, నరైన్, బద్రీ ఈ జట్టుకు ప్రధాన బలం. ఆల్‌రౌండర్ లెండిల్ సిమ్మన్స్ ఫామ్‌లో ఉన్నాడు. డారెన్ బ్రేవో, రామ్‌దిన్, స్టీవార్ట్, పూరన్, లూయిస్ నాణ్యమైన బ్యాట్స్‌మెన్. ముంబైని ఓడించి ఫైనల్‌కు చేరగలమనే ధీమా ఈ కరీబియన్ ఆటగాళ్లలో ఉంది. -
ట్రినిడాడ్ ఆశలు సజీవం
అహ్మదాబాద్: ఓపెనర్ ఎవిన్ లెవిస్ (35 బంతుల్లో 70; 7 ఫోర్లు; 5 సిక్స్‌లు), డారెన్ బ్రేవో (44 బంతుల్లో 63; 5 ఫోర్లు; 4 సిక్స్‌లు) మెరుపు ఆటతీరుతో పాటు వరుణుడి అండతో చాంపియన్స్ లీగ్ టి20లో ట్రినిడాడ్ అండ్ టొబాగో విజయం సాధించింది. సోమవారం మొతేరా స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో టైటాన్స్‌తో తలపడిన టీ అండ్ టీ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 6 పరుగులతో నెగ్గింది. దీంతో తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఈ విజయంతో ట్రినిడాడ్ జట్టు టైటాన్స్‌తో సమానంగా ఎనిమిది పాయింట్లతో ఉంది. అయితే బుధవారం చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ట్రినిడాడ్ నెగ్గితే ఇప్పటికే చివరి లీగ్ మ్యాచ్ ఆడిన టైటాన్ కథ ముగిసిపోతుంది. ఓడినా కూడా మెరుగైన రన్‌రేట్ ఆధారంగా టీఅండ్టీకే అవకాశం ఉంటుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రినిడాడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 188 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు లెవిస్, డారెన్ బ్రేవో 68 బంతుల్లో 109 పరుగులు జోడించారు. చివర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినప్పటికీ పటిష్ట స్కోరును సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 17 ఓవర్లలో ఆరు వికెట్లకు 153 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ వర్షం అంతరాయం కలిగించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన టైటాన్స్ తమ విజయానికి ఏడు పరుగుల దూరంలో ఉంది. ఆట కొనసాగే వీలు లేకపోవడంతో ట్రినిడాడ్‌ను గెలిచినట్టుగా ప్రకటించారు. ఓపెనర్లు డేవిడ్స్ (22 బంతుల్లో 42; 6 ఫోర్లు; 2 సిక్స్‌లు), రుడాల్ఫ్ (28 బంతుల్లో 31; 4 ఫోర్లు) శుభారంభాన్ని అందించినా మిడిలార్డర్ విఫలమైంది. స్పిన్నర్ సునీల్ నరైన్, సిమ్మన్స్‌లకు రెండేసి వికెట్లు పడ్డాయి. రెయిన్ లూజర్స్! అహ్మదాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. చాంపియన్స్ లీగ్‌లో నిలబడాలంటే రైజర్స్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ నీటిపాలైంది. బ్రిస్బేన్ హీట్స్‌తో సోమవారం ఇక్కడ జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరో 2 పాయింట్లు కేటాయించారు. ఫలితంగా టోర్నీలో ఒకే మ్యాచ్ గెలిచి, రెండు ఓడిన హైదరాబాద్ మొత్తం 6 పాయింట్లకే పరిమితమైంది. ఇప్పటికే ఈ గ్రూప్‌లో చెన్నై సెమీ ఫైనల్ చేరగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, టైటాన్స్ 8 పాయింట్ల వద్ద నిలిచాయి. దాంతో సన్‌రైజర్స్ లీగ్‌నుంచి నిష్ర్కమించింది. మరో వైపు ట్రినిడాడ్, టైటాన్స్ పాయింట్ల పరంగా సమానంగా ఉన్నా ట్రినిడాడ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. బుధవారం చెన్నైతో చివరి మ్యాచ్ ఆడనున్న ఆ జట్టు గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. లేదంటే రన్‌రేట్‌లో టైటాన్స్‌తో పోటీ పడాల్సి వస్తుంది కాబట్టి...చెన్నై చేతిలో భారీ తేడాతో ఓడకుండా ఉంటే చాలు. చాంపియన్స్ లీగ్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్ x ఒటాగో వోల్ట్స్ రాత్రి గం. 8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం