సచిన్ కోసం మరోసారి!
చాంపియన్స్ లీగ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న మాస్టర్ బ్లాస్టర్‌ను... మరోసారి కూడా అభిమానులు చూడాలంటే నేడు జరిగే రెండో సెమీఫైనల్లో ట్రినిడాడ్‌పై ముంబై ఇండియన్స్ గెలవాలి.
న్యూఢిల్లీ: సమఉజ్జీల సమరం... ట్రినిడాడ్, ముంబైల మ్యాచ్‌ను ఒక్క ముక్కలో ఇలా చెప్పొచ్చు. దూకుడుగా ఆడే, ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మధ్య పోరాటం... రెండు జట్లూ తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో సంచలన విజయాలు సాధించాయి. అదే ఆత్మవిశ్వా సంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాంపియన్స్ లీగ్‌లో శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది.
అందరి నోటా ఒకే మాట
2011లో హర్భజన్ సింగ్ సారథ్యంలోని ముంబై జట్టు చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో ఐపీఎల్‌లోనూ విజేతగా నిలిచింది. గతంతో పోలిస్తే ఈసారి ముంబై జట్టు మంచి దూకుడుగా ఆడుతుందని అనుకోవాలి. ఈసారి టోర్నీ ఆరంభం నుంచి ముంబై ఆటగాళ్లంతా ఒకటే మాట అంటున్నారు. ‘టైటిల్ గెలిచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలి’ అని చెబుతున్నారు. సచిన్ రంగు దుస్తుల్లో పోటీ క్రికెట్ ఆడటం ఈ టోర్నీతోనే ఆఖరు.
కాబట్టి మాస్టర్ మరో మ్యాచ్ ఆడాలంటే ఇప్పుడు ముంబై గెలవాలి. బ్యాటింగ్‌లో డ్వేన్ స్మిత్, రోహిత్ శర్మ, పొలార్డ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సచిన్, కార్తీక్, రాయుడు ఫామ్‌లో లేకపోయినా మ్యాచ్‌ను ఏ క్షణమైనా మలుపు తిప్పగల సమర్థులు. బౌలింగ్‌లో కౌల్టర్ నైల్, రిషిధావన్, ఓజా, హర్భజన్ కీలకం. గత మ్యాచ్‌లో ఆడిన మ్యాక్స్‌వెల్‌ను కొనసాగిస్తారా లేక జాన్సన్‌ను తుది జట్టులో తెస్తారో చూడాలి. తమ చివరి మ్యాచ్‌లో పెర్త్‌పై సాధించిన అద్భుత విజయంతో ముంబై ఆత్మవిశ్వాసంతో ఉంది.
అనూహ్యంగా ముందుకు...
ఈసారి లీగ్‌లో ట్రినిడాడ్ బాగా ఆకట్టుకుంది. ‘బి’ గ్రూప్‌లో టాపర్‌గా సెమీస్‌కు చేరడం కాస్త ఆశ్చర్యకర పరిణామం. బ్రిస్బేన్‌పై గెలిచి, సన్‌రైజర్స్ చేతిలో ఓడిన ఈ కరీబియన్ జట్టు... టైటాన్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించడంతో వర్షం పడ్డా డక్‌వర్త్ పద్ధతిలో గట్టెక్కింది. అయినా చివరి మ్యాచ్‌లో గెలవాల్సిన స్థితిలో... పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి ఏకంగా గ్రూప్ టాపర్‌గా నిలిచింది.
మిగిలిన ఫలితాలు ఎలా ఉన్నా... కోట్ల మైదానంలో ధోనిసేనపై సాధించిన విజయం ఈ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. బౌలింగ్‌లో రామ్‌పాల్, నరైన్, బద్రీ ఈ జట్టుకు ప్రధాన బలం. ఆల్‌రౌండర్ లెండిల్ సిమ్మన్స్ ఫామ్‌లో ఉన్నాడు. డారెన్ బ్రేవో, రామ్‌దిన్, స్టీవార్ట్, పూరన్, లూయిస్ నాణ్యమైన బ్యాట్స్‌మెన్. ముంబైని ఓడించి ఫైనల్‌కు చేరగలమనే ధీమా ఈ కరీబియన్ ఆటగాళ్లలో ఉంది.