హ్యాపీ బర్త్‌డే సచిన్
న్యూఢిల్లీ: సచిన్ గురువారం 41వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత సచిన్‌కు ఇదే మొదటి పుట్టినరోజు. గత ఆరేళ్లు ఐపీఎల్ సమయంలో సచిన్ పుట్టినరోజు రావడం వల్ల ముంబై ఇండియన్స్ సహచరులతో కలిసి వేడుక చేసుకునేవాడు. ఈసారి కూడా ముంబై జట్టుతోనే ఉండాల్సింది. కానీ ఓటు వేయడం కోసం మాస్టర్ ముంబై వచ్చాడు. దీంతో ఈసారి కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకునే అవకాశం లభించింది.
ఓటు హక్కు వినియోగించుకోండి: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగే ఆరో విడత పోలింగ్‌లో సచిన్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నాడు. ముంబైలో నేడు సచిన్ ఓటు వేయనున్నాడు. అంతేకాదు ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నాడు. ‘ఓటు శక్తిని ఎవరూ తక్కువగా చూడకండి. క్రికెట్‌లో ప్రతీ పరుగు ఎంత అమూల్యమో.. ఎన్నికల్లో ప్రతీ ఓటు అంతే. నేను ముంబైలో నా ఓటు హక్కును వినియోగించుకుంటా. మీరూ ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించండి. దయచేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి’ అని అబుదాబి నుంచి ఓటు వేయడం కోసం వచ్చిన ‘భారతరత్న’ ప్రజలకు సందేశం ఇచ్చాడు.
బ్రాడ్‌మన్ కంటే గొప్ప
ఫోరెన్సిక్ ఆధారాలను చూపెడుతున్న ఓ రచయిత
ఏ తరంలో అయినా సచిన్ అత్యుత్తమ క్రికెటర్ అని చెబుతున్నారు... చెన్నైకి చెందిన రూడాల్ఫ్ లాంబెర్ట్ ఫెర్నాండేజ్ అనే రచయిత. అనేక గణాంకాలతో తన దగ్గర ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయని... ఇందులో బ్రాడ్‌మన్ కంటే సచినే గొప్పని తేలిందని అంటున్నారు. తను చేసిన అధ్యయనాలతో ఓ పుస్తకం తయారు చేసి మాస్టర్ కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు.