sachin birth day
-
అన్నా... నీ కాళ్లు మొక్కుతా!
సరదాగా... సచిన్ టెండూల్కర్ అంటే అభిమానం లేనిది ఎవరికి. సాధారణ ఫ్యాన్స్ సంగతి సరే... సహచర క్రికెటర్లు, ఆటపై తమదైన ముద్ర వేసిన స్టార్లు కూడా సచిన్‌పై ప్రేమకు దాసులే. వేర్వేరు సందర్భాల్లో వారంతా తమ అభిమానాన్ని తమకు తోచిన రీతిలో ప్రదర్శిస్తుంటారు. మరి యువరాజ్ సింగ్ అయితే ఏం చేస్తాడు? సచిన్ కనబడగానే కాళ్ల మీద పడిపోతాడేమో. గురువారం ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలో మరోసారి ఇదే దృశ్యం కనిపించింది. సచిన్ మైదానంలో ఉండగా వెనుకనుంచి వచ్చి యువీ మాస్టర్ కాలు పట్టేసుకున్నాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామం సచిన్‌కు ముందుగా అర్థం కాలేదు. అయితే ఆ వెంటనే యువరాజ్‌ను చూసిన అతను, నవ్వుతూ పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు. శుక్రవారం ‘మాస్టర్’ బర్త్‌డే సందర్భంగా తన శుభాకాంక్షలు తెలుపుతూ కూడా యువీ ట్విట్టర్లో ఇదే ఫొటో పోస్ట్ చేశాడు. క్రికెట్ దేవుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ‘పేరి పెహ్నా పాజీ’ అంటూ పంజాబీలో ‘అన్నా నీ కాళ్లకు దండం’ అంటూ వ్యాఖ్య జోడించాడు. అన్నట్లు... దాదాపు ఏడాది క్రితం లార్డ్స్‌లో ఎంసీసీ మ్యాచ్ సందర్భంగా కూడా యువరాజ్ ఇలాగే సచిన్ కాళ్లకు మొక్కాడు. -
‘ఓటు’ తో పుట్టిన రోజు
ఘనంగా సచిన్ జన్మదిన వేడుకలు ప్రముఖుల శుభాకాంక్షలు ముంబై: మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన 41వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని స్వగృహంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన వేడుకలకు అతని సన్నిహిత మిత్రులు కొంత మంది హాజరయ్యారు. రిటైర్మెంట్ తర్వాత సచిన్‌కు ఇదే తొలి పుట్టిన రోజు కావడం విశేషం. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్‌థాకరే స్వయంగా సచిన్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాస్టర్ స్నేహితులు, ముంబై మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. సచిన్ బర్త్‌డే సందర్భంగా పలువురు భారత క్రికెటర్లు ట్వీట్స్ ద్వారా తమ అభినందనలు తెలియజేసారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, గంభీర్, మైకేల్ వాన్, రసెల్ ఆర్నాల్డ్, రాజీవ్‌శుక్లా తదితరులు శుభాకాంక్షలతో సచిన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మీరు ఓటేశారా... ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న సచిన్, ప్రత్యేకంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముంబై వచ్చాడు. తన భార్య అంజలితో కలిసి అతను ఓటు వేశాడు. ఓటు వేసిన అనంతరం ఈ రాజ్యసభ సభ్యుడు తన ఫోటోకు వ్యాఖ్యను జోడించి ట్విట్టర్లో పెట్టాడు. ‘నేను ఓటు వేశాను. మీరు వేశారా...నా పుట్టినరోజును చక్కటి పనితో మొదలు పెట్టాను. ఇంత గొప్ప దేశపు జాతీయుడిగా నా బాధ్యత నెరవేర్చాను’ అని మాస్టర్ ట్వీట్ చేశాడు. -
హ్యాపీ బర్త్‌డే సచిన్
న్యూఢిల్లీ: సచిన్ గురువారం 41వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత సచిన్‌కు ఇదే మొదటి పుట్టినరోజు. గత ఆరేళ్లు ఐపీఎల్ సమయంలో సచిన్ పుట్టినరోజు రావడం వల్ల ముంబై ఇండియన్స్ సహచరులతో కలిసి వేడుక చేసుకునేవాడు. ఈసారి కూడా ముంబై జట్టుతోనే ఉండాల్సింది. కానీ ఓటు వేయడం కోసం మాస్టర్ ముంబై వచ్చాడు. దీంతో ఈసారి కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకునే అవకాశం లభించింది. ఓటు హక్కు వినియోగించుకోండి: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగే ఆరో విడత పోలింగ్‌లో సచిన్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నాడు. ముంబైలో నేడు సచిన్ ఓటు వేయనున్నాడు. అంతేకాదు ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నాడు. ‘ఓటు శక్తిని ఎవరూ తక్కువగా చూడకండి. క్రికెట్లో ప్రతీ పరుగు ఎంత అమూల్యమో.. ఎన్నికల్లో ప్రతీ ఓటు అంతే. నేను ముంబైలో నా ఓటు హక్కును వినియోగించుకుంటా. మీరూ ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించండి. దయచేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి’ అని అబుదాబి నుంచి ఓటు వేయడం కోసం వచ్చిన ‘భారతరత్న’ ప్రజలకు సందేశం ఇచ్చాడు. బ్రాడ్‌మన్ కంటే గొప్ప ఫోరెన్సిక్ ఆధారాలను చూపెడుతున్న ఓ రచయిత ఏ తరంలో అయినా సచిన్ అత్యుత్తమ క్రికెటర్ అని చెబుతున్నారు... చెన్నైకి చెందిన రూడాల్ఫ్ లాంబెర్ట్ ఫెర్నాండేజ్ అనే రచయిత. అనేక గణాంకాలతో తన దగ్గర ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయని... ఇందులో బ్రాడ్‌మన్ కంటే సచినే గొప్పని తేలిందని అంటున్నారు. తను చేసిన అధ్యయనాలతో ఓ పుస్తకం తయారు చేసి మాస్టర్ కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు.