అన్నా... నీ కాళ్లు మొక్కుతా!
సరదాగా...
సచిన్ టెండూల్కర్ అంటే అభిమానం లేనిది ఎవరికి. సాధారణ ఫ్యాన్స్ సంగతి సరే... సహచర క్రికెటర్లు, ఆటపై తమదైన ముద్ర వేసిన స్టార్లు కూడా సచిన్‌పై ప్రేమకు దాసులే. వేర్వేరు సందర్భాల్లో వారంతా తమ అభిమానాన్ని తమకు తోచిన రీతిలో ప్రదర్శిస్తుంటారు. మరి యువరాజ్ సింగ్ అయితే ఏం చేస్తాడు? సచిన్ కనబడగానే కాళ్ల మీద పడిపోతాడేమో. గురువారం ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలో మరోసారి ఇదే దృశ్యం కనిపించింది. సచిన్ మైదానంలో ఉండగా వెనుకనుంచి వచ్చి యువీ మాస్టర్ కాలు పట్టేసుకున్నాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామం సచిన్‌కు ముందుగా అర్థం కాలేదు.
అయితే ఆ వెంటనే యువరాజ్‌ను చూసిన అతను, నవ్వుతూ పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు. శుక్రవారం ‘మాస్టర్’ బర్త్‌డే సందర్భంగా తన శుభాకాంక్షలు తెలుపుతూ కూడా యువీ ట్విట్టర్‌లో ఇదే ఫొటో పోస్ట్ చేశాడు. క్రికెట్ దేవుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ‘పేరి పెహ్‌నా పాజీ’ అంటూ పంజాబీలో ‘అన్నా నీ కాళ్లకు దండం’ అంటూ వ్యాఖ్య జోడించాడు. అన్నట్లు... దాదాపు ఏడాది క్రితం లార్డ్స్‌లో ఎంసీసీ మ్యాచ్ సందర్భంగా కూడా యువరాజ్ ఇలాగే సచిన్ కాళ్లకు మొక్కాడు.