‘ఓటు’ తో పుట్టిన రోజు
ఘనంగా సచిన్ జన్మదిన వేడుకలు
ప్రముఖుల శుభాకాంక్షలు
ముంబై: మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన 41వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని స్వగృహంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన వేడుకలకు అతని సన్నిహిత మిత్రులు కొంత మంది హాజరయ్యారు. రిటైర్మెంట్ తర్వాత సచిన్‌కు ఇదే తొలి పుట్టిన రోజు కావడం విశేషం.
ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్‌థాకరే స్వయంగా సచిన్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాస్టర్ స్నేహితులు, ముంబై మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. సచిన్ బర్త్‌డే సందర్భంగా పలువురు భారత క్రికెటర్లు ట్వీట్స్ ద్వారా తమ అభినందనలు తెలియజేసారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, గంభీర్, మైకేల్ వాన్, రసెల్ ఆర్నాల్డ్, రాజీవ్‌శుక్లా తదితరులు శుభాకాంక్షలతో సచిన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మీరు ఓటేశారా...
ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న సచిన్, ప్రత్యేకంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముంబై వచ్చాడు. తన భార్య అంజలితో కలిసి అతను ఓటు వేశాడు. ఓటు వేసిన అనంతరం ఈ రాజ్యసభ సభ్యుడు తన ఫోటోకు వ్యాఖ్యను జోడించి ట్విట్టర్‌లో పెట్టాడు. ‘నేను ఓటు వేశాను. మీరు వేశారా...నా పుట్టినరోజును చక్కటి పనితో మొదలు పెట్టాను. ఇంత గొప్ప దేశపు జాతీయుడిగా నా బాధ్యత నెరవేర్చాను’ అని మాస్టర్ ట్వీట్ చేశాడు.