ట్రినిడాడ్ ఆశలు సజీవం | CLT20 2013: Trinidad and Tobago beat Titans by 6 runs courtesy D/L method | Sakshi
Sakshi News home page

ట్రినిడాడ్ ఆశలు సజీవం

Published Tue, Oct 1 2013 1:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM

ట్రినిడాడ్ ఆశలు సజీవం

ట్రినిడాడ్ ఆశలు సజీవం

అహ్మదాబాద్: ఓపెనర్ ఎవిన్ లెవిస్ (35 బంతుల్లో 70; 7 ఫోర్లు; 5 సిక్స్‌లు), డారెన్ బ్రేవో (44 బంతుల్లో 63; 5 ఫోర్లు; 4 సిక్స్‌లు) మెరుపు ఆటతీరుతో పాటు వరుణుడి అండతో చాంపియన్స్ లీగ్ టి20లో ట్రినిడాడ్ అండ్ టొబాగో విజయం సాధించింది. సోమవారం మొతేరా స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో టైటాన్స్‌తో తలపడిన టీ అండ్ టీ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 6 పరుగులతో నెగ్గింది.
 
 దీంతో తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఈ విజయంతో ట్రినిడాడ్ జట్టు టైటాన్స్‌తో సమానంగా ఎనిమిది పాయింట్లతో ఉంది. అయితే బుధవారం చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ట్రినిడాడ్ నెగ్గితే ఇప్పటికే చివరి లీగ్ మ్యాచ్ ఆడిన టైటాన్ కథ ముగిసిపోతుంది. ఓడినా కూడా మెరుగైన రన్‌రేట్ ఆధారంగా టీఅండ్‌టీకే అవకాశం ఉంటుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రినిడాడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 188 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు లెవిస్, డారెన్ బ్రేవో 68 బంతుల్లో 109 పరుగులు జోడించారు. చివర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినప్పటికీ పటిష్ట స్కోరును సాధించింది.
 
 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 17 ఓవర్లలో ఆరు వికెట్లకు 153 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ వర్షం అంతరాయం కలిగించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన టైటాన్స్ తమ విజయానికి ఏడు పరుగుల దూరంలో ఉంది. ఆట కొనసాగే వీలు లేకపోవడంతో ట్రినిడాడ్‌ను గెలిచినట్టుగా ప్రకటించారు. ఓపెనర్లు డేవిడ్స్ (22 బంతుల్లో 42; 6 ఫోర్లు; 2 సిక్స్‌లు), రుడాల్ఫ్ (28 బంతుల్లో 31; 4 ఫోర్లు) శుభారంభాన్ని అందించినా మిడిలార్డర్ విఫలమైంది. స్పిన్నర్ సునీల్ నరైన్, సిమ్మన్స్‌లకు రెండేసి వికెట్లు పడ్డాయి.
 
 రెయిన్ లూజర్స్!
 అహ్మదాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. చాంపియన్స్ లీగ్‌లో నిలబడాలంటే రైజర్స్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ నీటిపాలైంది. బ్రిస్బేన్ హీట్స్‌తో సోమవారం ఇక్కడ జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరో 2 పాయింట్లు కేటాయించారు.
 
  ఫలితంగా టోర్నీలో ఒకే మ్యాచ్ గెలిచి, రెండు ఓడిన హైదరాబాద్ మొత్తం 6 పాయింట్లకే పరిమితమైంది. ఇప్పటికే ఈ గ్రూప్‌లో చెన్నై సెమీ ఫైనల్ చేరగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, టైటాన్స్ 8 పాయింట్ల వద్ద నిలిచాయి. దాంతో సన్‌రైజర్స్ లీగ్‌నుంచి నిష్ర్కమించింది. మరో వైపు ట్రినిడాడ్, టైటాన్స్ పాయింట్ల పరంగా సమానంగా ఉన్నా ట్రినిడాడ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. బుధవారం చెన్నైతో చివరి మ్యాచ్ ఆడనున్న ఆ జట్టు గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది.  లేదంటే రన్‌రేట్‌లో టైటాన్స్‌తో పోటీ పడాల్సి వస్తుంది కాబట్టి...చెన్నై చేతిలో భారీ తేడాతో ఓడకుండా ఉంటే చాలు.
 
 చాంపియన్స్ లీగ్‌లో నేడు
 రాజస్థాన్ రాయల్స్   x  ఒటాగో వోల్ట్స్
 రాత్రి గం. 8.00 నుంచి
 స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement