west indies A
-
భారత్ ‘ఎ’కు చేజారిన విజయం
ట్రినిడాడ్ అండ్ టొబాగో : వెస్టిండీస్ ‘ఎ’తో తొలి రెండు అనధికారిక టెస్టులు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని మాత్రం చేజార్చుకుంది. మూడో టెస్టులో చివరి రోజు విండీస్ బ్యాట్స్‌మెన్ చక్కటి పోరాటపటిమ కనబర్చడంతో ఆ జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. 373 పరుగుల విజయలక్ష్యంతో ఆడుతూ విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరకు 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాబాజ్ నదీమ్ (5/103) మరోసారి రాణించినా... ఇతర బౌలర్ల వైఫల్యంతో భారత్ తమ ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. శుక్రవారం మొత్తం 94 ఓవర్లు ఆడిన విండీస్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. జెరెమీ సొలొజానో (250 బంతుల్లో 92; 8 ఫోర్లు), బ్రెండన్ కింగ్ (83 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సునీల్ ఆంబ్రిస్ (142 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో జట్టును ఓటమి నుంచి రక్షించారు. భారత్ ‘ఎ’ కెప్టెన్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నదీమ్ ఈ సిరీస్ నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున మొత్తం 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ పర్యటనలో 4–1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’, టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. -
శుబ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు!
ట్రినిడాడ్ : టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న రికార్డును యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ బద్దలు కొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతిపిన్న వయస్సులో డబుల్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. వెస్టిండీస్-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శుబ్‌మన్ ఈ రికార్డు నెలకొల్పాడు. కాగా 2002లో జింబాబ్వేతో జరిగిన బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ టెస్టులో గంభీర్ ద్విశతకం సాధించాడు. అప్పుడు అతడి వయస్సు 20 ఏళ్ల 124 రోజులు. ఇక ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో జరగిన మూడో టెస్టులో శుబ్‌మన్ 19 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల 334 రోజుల వయస్సులో టెస్టుల్లో ద్విశతకం(204) సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక గురువారం నాటి మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ కుప్పకూలినప్పటికీ శుబ్‌మన్ నిలకడగా ఆడాడు. కెప్టెన్ హనుమ విహారీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది 315 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన శుభ్‌మన్.. రెండో ఇన్నింగ్స్‌లో సమయోచితంగా ఆడాడు. దీంతో భారత్ ప్రత్యర్థి జట్టుకు 373 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. కాగా మూడోరోజు ఆట ముగిసే నాటికి విండీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 37 పరుగులు చేసింది. కాగా వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన శుభ్‌మన్ గిల్ జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కుతుందని ఆశించి భంగపడిన సంగతి తెలిసిందే. విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కుతుందని ఆశించానని, అయితే అది జరగకపోవడంతో నిరాశకు గురైనట్లు పేర్కొన్నాడు. మరోవైపు భారత్-వెస్టిండీస్ మధ్య జరగాల్సిన తొలి వన్డే వరణుడి కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. -
మెరిసిన శ్రేయస్ అయ్యర్, ఖలీల్
అంటిగ్వా: బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (107 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్ (3/16) మెరిపించడంతో... వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ‘ఎ’ 48.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ ‘ఎ’ 22 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అయ్యర్, ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (63 బంతుల్లో 34; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. విండీస్ ‘ఎ’ బౌలర్లలో అకీమ్ జోర్డాన్ (4/43), రోస్టన్ ఛేజ్ (4/19) రాణించారు. అనంతరం విండీస్ ‘ఎ’ భారత బౌలర్ల ధాటికి 35.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. విండీస్ జట్టులో జొనాథన్ కార్టర్ (41 నాటౌట్), రావ్మన్ పావెల్ (40 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పియరీ (12) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు దాటలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, రాహుల్ చహర్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీశారు. -
రాణించిన జహీర్
హుబ్లి: భారత పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఎట్టకేలకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. చివరి రోజు జహీర్ (4/59) చెలరేగడంతో మూడో అనధికారిక టెస్టులో వెస్టిండీస్ ‘ఎ’పై భారత్ ‘ఎ’ జట్టు ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జహీర్‌తో పాటు అభిషేక్ నాయర్ (2/45) కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ నాలుగో రోజు శనివారం 116/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన వెస్టిండీస్ 73.5 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌నారాయణ్ (180 బంతుల్లో 99; 13 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, ఫుదాదిన్ (101 బంతుల్లో 49; 5 ఫోర్లు) కొద్ది సేపు అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఆఖరి రోజు 38.5 ఓవర్లలో 103 పరుగులు మాత్రమే జోడించి విండీస్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. జహీర్‌ఖాన్ రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లతో విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఎనిమిది పరుగుల వ్యవధిలో విండీస్ చివరి 4 వికెట్లు కోల్పోగా, హామిల్టన్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాకపోవడంతో జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. తాజా ఫలితంతో మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి టెస్టులో విండీస్ నెగ్గగా, రెండో టెస్టు డ్రా అయింది. ఈ మ్యాచ్‌తో జహీర్ ఖాన్, గంభీర్ కొంత వరకు తమ ఫామ్‌ను అంది పుచ్చుకోగా, సెహ్వాగ్ మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. -
భారత్-ఎ రెండో అనధికార టెస్టు డ్రా
వెస్టిండీస్-ఎతో భారత్-ఎ రెండో అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి, నాలుగో రోజు శనివారం 28/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్లు.. బ్రాత్ వైట్ (104) మరోసారి విజృంభించి అజేయ సెంచరీ చేయడంతో మూడు వికెట్లకు 223 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. డియోనరైన్ (93) సెంచరీకి ఏడు దూరంలో అవుటయ్యాడు. భారత బౌలర్ భార్గవ్ భట్ రెండు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 406 పరుగులు చేయగా, భారత్-ఎ 359 స్కోరు నమోదు చేసింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 1-0తో ముందంజలో ఉంది. తొలి మ్యాచ్‌లో కరీబియన్లే గెలుపొందారు. -
వెస్టిండీస్ ‘ఎ’కు ఆధిక్యం
షిమోగా: భారత్ ‘ఎ’తో టెస్టు సిరీస్‌లో తన ఆధిపత్యాన్ని వెస్టిండీస్ ‘ఎ’ మరోసారి నిరూపించుకుంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన కరీబియన్ జట్టు... రెండో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. తొలుత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులు చేయగా... భారత్ ‘ఎ’ 131.1 ఓవర్లలో 359 పరుగులకు ఆలౌటయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ జగదీశ్ (86), నాయర్ (89) ఎక్కువసేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. భారత్ జట్టు 245 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో... వికెట్ కీపర్ ఉదయ్ కౌల్ (172 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) చివరి వరుస ఆటగాళ్లతో కలిసి పోరాడి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. విండీస్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 47 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టుకు మొత్తం 75 పరుగుల ఆధిక్యం ఉంది. శనివారం ఆటకు చివరి రోజు కాబట్టి అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయం. -
సెహ్వాగ్, గంభీర్‌లపైనే దృష్టి
షిమోగా: బ్యాటింగ్ వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన భారత్ ‘ఎ’ జట్టు రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. నేటి నుంచి వెస్టిండీస్ ‘ఎ’తో జరగనున్న అనధికార టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి వారిపైనే నెలకొంది. మేటి ఆటగాళ్లు ఉన్న జట్టును చతేశ్వర్ పుజారా ఎలా నడిపిస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికరం. గత 30 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయని వీరూ ఈ మ్యాచ్‌తోనైనా గాడిలో పడాలని భావిస్తుండగా... గంభీర్ కూడా సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీలో ఈ ఇద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో వీరిద్దరి భవిష్యత్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన జహీర్ కూడా సరైన ఫామ్‌లో లేడు. 2011 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఏడు టెస్టులు ఆడిన అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఈ ముగ్గురిపై ఒత్తిడి నెలకొంది. అయితే అంతర్జాతీయ వేదికలపై విశేష అనుభవం ఉన్న ఈ ముగ్గురు ఆకట్టుకుంటే రాబోయే విండీస్ సిరీస్‌కు జట్టు ఎంపిక చేయడం సెలక్టర్లకు కత్తిమీద సామే. మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా సెహ్వాగ్ వేలికి గాయమైంది. అయితే వీరూ అందుబాటులో ఉండేదీ లేనిదీ మ్యాచ్‌కు ముందే తెలుస్తుందని కెప్టెన్ పుజారా చెప్పాడు. షెల్డన్ జాక్సన్, నాయర్, డోగ్రా, ఉదయ్ కౌల్, కైఫ్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తే భారీ స్కోరు ఖాయం. తొలి టెస్టులో పుజారాతో పాటు బౌలింగ్‌లో ఈశ్వర్ పాండే, మహ్మద్ షమీలు విఫలం కావడం మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. మరోవైపు తొలి మ్యాచ్ విజయంతో విండీస్ జట్టులో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లను ఎదుర్కోవడంపైనే ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ కిర్క్ ఎడ్వర్డ్స్, బ్రాత్‌వైట్, పుదాదిన్లతో పాటు పావెల్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. భారత పరిస్థితుల్లో విండీస్ స్సిన్నర్లు తమ మ్యాజిక్‌ను ప్రదర్శిస్తున్నారు. మిల్లర్, పెరుమాల్ల నిలకడ వాళ్లకు లాభిస్తోంది. -
పట్టుబిగించిన విండీస్ ‘ఎ’
మైసూర్: భారత్ ‘ఎ’తో జరుగుతున్న అనధికార తొలి టెస్టులో వెస్టిండీస్ ‘ఎ’ పట్టు బిగించింది. పావెల్ (68) అర్ధసెంచరీ చేయడంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఎడ్వర్డ్స్ (9) క్రీజులో ఉన్నారు. బ్రాత్‌వైట్ (34) ఫర్వాలేదనిపించగా... డియోనరైన్ (9) నిరాశపర్చాడు. రసూల్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం విండీస్ ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. శనివారం ఆటకు ఆఖరి రోజు. అంతకుముందు 124/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 95.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో విండీస్‌కు 184 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మన్‌ప్రీత్ జునేజా (84) ఒంటరిపోరాటం చేయగా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఖడివాలే (27), మోత్వాని (28 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడారు. విండీస్ స్పిన్నర్లు పెరుమాల్ (5/85) ఐదు వికెట్లు తీయడంతో భారత్ కోలుకోలేకపోయింది. మిల్లర్‌కు 4, కమిన్స్‌కు ఒక్క వికెట్ దక్కింది. -
వెస్టిండీస్ ‘ఎ’ 264/5
మైసూర్: వెస్టిండీస్ ‘ఎ’ తో బుధవారం ప్రారంభమైన అనధికార తొలి టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు తడబడి పుంజుకుంది. తొలి రోజు ఆట ముగిసేసరికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఫుదాదిన్ (4 నాటౌట్), వాల్టన్ (26 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బ్రాత్‌వైట్ (92), కిర్క్ ఎడ్వర్డ్స్ (91) చెలరేగారు. ఓ దశలో 211/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్‌ను భారత బౌలర్లు దెబ్బతీశారు. 26 పరుగుల తేడాతో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రసూల్ 2, షమీ, పాండే, పలివాల్ తలా ఓ వికెట్ తీశారు. -
యువీ బృందానికి సవాల్
బెంగళూరు: వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో మూడు వన్డేల అనధికార సిరీస్‌లో అనూహ్య పరాజయం అనంతరం భారత్ ‘ఎ’ జట్టు నేడు జరిగే ఏకైక టి20 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. తొలి వన్డేలో భారీ విజయం సాధించినప్పటికీ అనంతరం రెండు వన్డేల్లోనూ యువరాజ్ బృందం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ టి20 మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ యువరాజ్ మరోసారి జట్టుకు కీలకం కానున్నాడు. వన్డే సిరీస్‌లో ఓ సెంచరీతో పాటు 40, 61 పరుగులు సాధించిన యువీ మంచి ఊపుమీదున్నాడు. ఇదే జోరును పొట్టి ఫార్మాట్లోనూ చూపించి జాతీయ జట్టులో చోటును సుస్థిరం చేసుకోవాలనే ఆశతో ఉన్నాడు. భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉన్నా బౌలర్లు తమ శక్తిమేరా రాణించలేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. అటు విండీస్ వన్డే సిరీస్ విజయంతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన కరీబియన్ ఆటగాళ్లు ఈ ఫార్మాట్లోనూ జయకేతనం ఎగురవేయాలనే ఆలోచనలో ఉన్నారు. బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లూ పూర్తి స్థాయి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. -
విండీస్ ‘ఎ’దే సిరీస్
బెంగళూరు: వెస్టిండీస్ ‘ఎ’తో తొలి వన్డేలో కనబర్చిన జోరును భారత ‘ఎ’ కొనసాగించలేకపోయింది. ఫలితంగా ఆరంభంలో ఆధిక్యం కనబరిచి కూడా సిరీస్ కోల్పోయింది. గురువారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 45 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. రెండో వన్డేలోనూ నెగ్గిన వెస్టిండీస్ ఈ అనధికారిక వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్, కిర్క్ ఎడ్వర్డ్స్ (104 బంతుల్లో 104; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సహాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. జాన్సన్ (42 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఎడ్వర్డ్స్ నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ (5/55) రాణించాడు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబా అపరాజిత్ (96 బంతుల్లో 78; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, యువరాజ్ సింగ్ (59 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించినా...ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్ ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో పెర్మాల్కు 3 వికెట్లు దక్కాయి. భారత్ సిరీస్ ఓడినా...మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 224 పరుగులు చేసిన యువరాజ్ సీనియర్ వన్డే జట్టులో స్థానం కోసం తన అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఏకైక టి20 మ్యాచ్ ఇదే మైదానంలో శనివారం జరుగుతుంది.