యువీ బృందానికి సవాల్
బెంగళూరు: వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో మూడు వన్డేల అనధికార సిరీస్‌లో అనూహ్య పరాజయం అనంతరం భారత్ ‘ఎ’ జట్టు నేడు జరిగే ఏకైక టి20 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. తొలి వన్డేలో భారీ విజయం సాధించినప్పటికీ అనంతరం రెండు వన్డేల్లోనూ యువరాజ్ బృందం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ టి20 మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ యువరాజ్ మరోసారి జట్టుకు కీలకం కానున్నాడు.
వన్డే సిరీస్‌లో ఓ సెంచరీతో పాటు 40, 61 పరుగులు సాధించిన యువీ మంచి ఊపుమీదున్నాడు. ఇదే జోరును పొట్టి ఫార్మాట్‌లోనూ చూపించి జాతీయ జట్టులో చోటును సుస్థిరం చేసుకోవాలనే ఆశతో ఉన్నాడు. భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉన్నా బౌలర్లు తమ శక్తిమేరా రాణించలేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. అటు విండీస్ వన్డే సిరీస్ విజయంతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన కరీబియన్ ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లోనూ జయకేతనం ఎగురవేయాలనే ఆలోచనలో ఉన్నారు. బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లూ పూర్తి స్థాయి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.