విండీస్ ‘ఎ’దే సిరీస్
బెంగళూరు: వెస్టిండీస్ ‘ఎ’తో తొలి వన్డేలో కనబర్చిన జోరును భారత ‘ఎ’ కొనసాగించలేకపోయింది. ఫలితంగా ఆరంభంలో ఆధిక్యం కనబరిచి కూడా సిరీస్ కోల్పోయింది. గురువారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 45 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. రెండో వన్డేలోనూ నెగ్గిన వెస్టిండీస్ ఈ అనధికారిక వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్, కిర్క్ ఎడ్వర్డ్స్ (104 బంతుల్లో 104; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సహాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. జాన్సన్ (42 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఎడ్వర్డ్స్ నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ (5/55) రాణించాడు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బాబా అపరాజిత్ (96 బంతుల్లో 78; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, యువరాజ్ సింగ్ (59 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించినా...ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్ ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో పెర్మాల్‌కు 3 వికెట్లు దక్కాయి. భారత్ సిరీస్ ఓడినా...మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 224 పరుగులు చేసిన యువరాజ్ సీనియర్ వన్డే జట్టులో స్థానం కోసం తన అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఏకైక టి20 మ్యాచ్ ఇదే మైదానంలో శనివారం జరుగుతుంది.