పట్టుబిగించిన విండీస్ ‘ఎ’
మైసూర్: భారత్ ‘ఎ’తో జరుగుతున్న అనధికార తొలి టెస్టులో వెస్టిండీస్ ‘ఎ’ పట్టు బిగించింది. పావెల్ (68) అర్ధసెంచరీ చేయడంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఎడ్వర్డ్స్ (9) క్రీజులో ఉన్నారు. బ్రాత్‌వైట్ (34) ఫర్వాలేదనిపించగా... డియోనరైన్ (9) నిరాశపర్చాడు. రసూల్‌కు 2 వికెట్లు దక్కాయి.
ప్రస్తుతం విండీస్ ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. శనివారం ఆటకు ఆఖరి రోజు. అంతకుముందు 124/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 95.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో విండీస్‌కు 184 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మన్‌ప్రీత్ జునేజా (84) ఒంటరిపోరాటం చేయగా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఖడివాలే (27), మోత్వాని (28 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడారు. విండీస్ స్పిన్నర్లు పెరుమాల్ (5/85) ఐదు వికెట్లు తీయడంతో భారత్ కోలుకోలేకపోయింది. మిల్లర్‌కు 4, కమిన్స్‌కు ఒక్క వికెట్ దక్కింది.