‘సెట్’ అయింది..! | india team set for world cup | Sakshi
Sakshi News home page

‘సెట్’ అయింది..!

Published Mon, Feb 1 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

‘సెట్’ అయింది..!

‘సెట్’ అయింది..!

‘సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌కు కావాల్సిన భారత జట్టు ఇదే’... నేను వర్తమానంలోనే జీవిస్తాను తప్ప భవిష్యత్తు గురించి మాట్లాడను అని తరచుగా చెప్పే కెప్టెన్ ధోని నోటినుంచి వచ్చిన మాట ఇది. ఇందులో ఆస్ట్రేలియాపై సాధించిన విజయగర్వంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా మెండుగా కనిపిస్తోంది. ఆసీస్ సిరీస్ ఇంతగా కెప్టెన్, జట్టు ఆలోచనలను మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అసలు వన్డేల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు టి20ల్లో ఇంత బాగా ఆడుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ టీమిండియా అనూహ్యంగా అద్భుతాన్ని చేసి చూపించింది.

సిరీస్ గెలవడమే కాదు జట్టులో ప్రతీ ఆటగాడు తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చడంతో ఒక రకంగా టీమ్‌లో ప్రస్తుతం ఎలాంటి లోపం లేదన్నట్లుగా కనిపిస్తోంది.  11 మంది జట్టును మార్చకుండా సిరీస్ మొత్తం ఆడించడం చూస్తే జట్టు బలమేంటో అర్థమవుతుంది. ఇదే ఆటతీరు, సొంత మైదానాలు కలగలిస్తే భారత్‌కు వరల్డ్‌కప్‌లో తిరుగుండకపోవచ్చు.     - సాక్షి క్రీడావిభాగం

 
* ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్ధం
* నమ్మకం పెంచిన సీనియర్లు
* ఆకట్టుకున్న కుర్రాళ్లు
* ఆసీస్ టూర్ సూపర్ సక్సెస్


వరల్డ్ కప్‌కు ముందు సన్నాహకంగా భారత్‌కు అందుబాటులో ఉన్న కనీస టి20 మ్యాచ్‌ల సంఖ్య పది. గతంలో జరిగిన ఐదు టి20 ప్రపంచకప్‌ల కోసం కూడా ధోని సేన ఇంతగా ఎప్పుడూ సిద్ధం కాలేదు. ఈ కౌంట్‌డౌన్‌లో మొదటి మూడు విజయవంతంగా పూర్తయ్యాయి.

ఇక శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఆసియా కప్‌లో కనీసం ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. ఫైనల్‌కు చేరితే మరో మ్యాచ్ కూడా దక్కుతుంది. 2007లో తొలిసారి ఎవరూ ఊహించని విధంగా తొలి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... ఆ తర్వాత పొట్టి క్రికెట్‌లో ఎందుకో తమదైన ముద్ర వేయలేకపోయింది. అపారమైన ఐపీఎల్ అనుభవం వరుసగా మూడు టోర్నీలలో అక్కరకు రాకపోవడంతో కనీసం సెమీస్‌కు కూడా చేరలేని భారత్, గత టోర్నీలో మాత్రం ఫైనల్లో ఓడింది. ఈ కసితోనే కావచ్చు ఆటగాళ్లు, బీసీసీఐ కూడా ఈసారి టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
 
టాప్ లేపుతున్నారు
బ్యాటింగ్‌లో భారత టాపార్డర్ తిరుగులేనిదిగా కనిపిస్తోంది. 20 ఓవర్ల ఆటకు మొదటి ముగ్గురు చాలు, తర్వాతి బ్యాట్స్‌మెన్ అవసరం లేదన్నట్లుగా వీరి జోరు సాగుతోంది. కోహ్లి టి20ల్లో 50 సగటును అధిగమించి ఈ ఫార్మాట్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లలోనే అతను 199 పరుగులు చేయడం అసాధారణం. రోహిత్ శర్మ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ధావన్ ప్రభావమేమిటో చివరి టి20లో కనిపించింది.

ఈ ముగ్గురి దూకుడు భారత్‌కు భారీ స్కోరు అందించగలదు. వీరి ధాటితోనే ఛేదన కూడా సులువవుతోంది. ఇక టి20ల్లో రైనా తన సామర్థ్యాన్ని సిడ్నీ మ్యాచ్‌లో చూపించాడు. ‘ఐపీఎల్‌లో అందరికంటే బెస్ట్ అయిన రైనానుంచి ప్రపంచకప్‌లో చాలా  ఆశిస్తున్నాం’ అని ధోని వ్యాఖ్యానించడం అతను ఎంత కీలకం కానున్నాడో సూచిస్తుంది. ఇక అవసరమున్నప్పుడు ధోని మెరుపు బ్యాటింగ్ ముందుకు వస్తుంది.

యువరాజ్ బ్యాటింగ్ ఫామ్‌పై ఇంకా స్పష్టత లేకపోయినా, అతని బౌలింగ్‌పై కెప్టెన్ నమ్మకముంచడం జట్టులో స్థానాన్ని దాదాపు ఖాయం చేసింది. అదే బ్యాటింగ్‌లోనూ చెలరేగితే తిరుగుండదు. గాయంతో ఈ సిరీస్ ఆడని రహానే అదనపు బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఎలాగూ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా రూపంలో మీడియం పేస్ ఆల్‌రౌండర్ దక్కడం ధోనికి కూడా సంతోషాన్ని కలిగిం చింది.
 
సీనియర్లు లేకున్నా...
సీనియర్ బౌలర్లు పదే పదే అదే తప్పులు చేయడంతో కొత్తగా ప్రయత్నించానని చెప్పిన ధోని అందుకు తగిన ఫలితాన్ని రాబట్టాడు. సాధారణంగా ఎవరినీ కెరీర్ ఆరంభంలోనే పెద్దగా ప్రశంసించని ధోని...నాక్కావలసింది ఇలాంటి బౌలరే అంటూ బుమ్రాను పదే పదే అభినందించాడు. ముఖ్యంగా కీలక సమయంలో తన యార్కర్లతో బుమ్రా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. నమ్మకం నిలబెట్టిన  వెటరన్ నెహ్రా కూడా ఐపీఎల్ అనుభవంతో భారత గడ్డపై కీలకం కావచ్చు. పాండ్యా బౌలింగ్‌తో కూడా జట్టు సంతృప్తిగా ఉంది.

ఇషాంత్, ఉమేశ్ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని కెప్టెన్ చూచాయగా చెప్పడం కూడా పేస్ లైనప్ ఇదే అని అర్థమవుతోంది. ఇక ఆస్ట్రేలియాలో అంత ప్రభావం చూపలేకపోయినా... అశ్విన్, జడేజాలు భారత్‌లో ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. హర్భజన్ స్థానం గురించి ధోని ఎలాంటి హామీ ఇవ్వలేదు. పరిస్థితులను బట్టి అప్పటి జట్టును ఎంపిక చేస్తామని, అవసరమైతే ఒకటి రెండు మా ర్పులు మాత్రమే ఉంటాయని సూచించడంతో జట్టు కూర్పు పై టీమ్ మేనేజ్‌మెంట్‌కు స్పష్టత వచ్చినట్లే. వరల్డ్ కప్ తరహా పరిస్థితులే ఉండే శ్రీలంక సిరీస్, ఆసియా కప్‌లలో ఇక ఇదే జట్టుకు ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడమే మిగిలింది.
 
ధోని ‘స్ఫూర్తి సందేశం
ఆసీస్‌పై సిరీస్ విజయం భారత జట్టులో కొత్త ఉత్సాహం నింపిందనడంలో సందేహం లేదు. సిరీస్ విజయం తర్వాత ధోనికి కూ డా మంచి ఊపొచ్చింది. అందుకే జట్టులో స్ఫూర్తి పెంచేందుకు ‘ఇక్కడినుంచి పడిపోవద్దు’ అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక పేద్ద సందేశం ఇచ్చేశాడు. ‘అదో అద్భుతమైన ప్రసంగం. ఈ సిరీస్ విజయం ప్రాధాన్యతపై 20 నిమిషాల పాటు ధోని మాట్లాడాడు.

ఆస్ట్రేలియా గడ్డపై మన జట్టు గతంలో ఇంత బాగా ఆడలేదని, తొలిసారి భారీ విజయం రుచి చూసిన కుర్రాళ్లు దీని విలువను తెలుసుకోవాలని, ఆత్మవిశ్వాసంతో వచ్చే మ్యా చ్‌లలోనూ ఇదే జోరును కొనసాగించాలని కెప్టెన్ చెప్పాడు’ అని టీమ్ మేనేజ్‌మెంట్‌లోని ఒక కీలక వ్యక్తి వెల్లడించాడు. ఇదే సమావేశంలో డెరైక్టర్ రవిశాస్త్రి... భారత ఆటగాళ్లు పులుల్లా ఆడారని, దిగ్గజాలు ఉన్న సమయంలోనూ మనం విదేశాల్లో ఇంత బాగా ఆడలేదని ప్రశంసించారు.
 
కోహ్లికి టాప్ ర్యాంక్
ఆసీస్‌తో సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన విరాట్ కోహ్లి ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాం కింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. నంబర్‌వన్‌గా ఉన్న ఆరోన్ ఫించ్ రెండో స్థానానికి దిగజారాడు. మొత్తం 892 రేటింగ్ పాయింట్లతో కోహ్లి ముందంజలో ఉండగా, ఫించ్ ఖాతాలో 868 పాయింట్లు ఉన్నాయి. రైనా 13, రోహిత్ 16వ స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement