
నార్త్‌సౌండ్ (అంటిగ్వా): కరీబియన్ పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్‌ను ఘన విజయంతో ప్రారంభించింది. బౌలింగ్‌లో ఎలాంటి ప్రతిఘటనా, బ్యాటింగ్‌లో ఒక్క మంచి ప్రదర్శనా కనబర్చలేని వెస్టిండీస్... సొంతగడ్డపై భారత్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకుంది. రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన తొలి టెస్టులో భారత్ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా విండీస్ జట్టుపై భారత్‌కిదే అత్యుత్తమ విజయం. 1988 జనవరిలో చెన్నైలో జరిగిన టెస్టులో విండీస్‌పై 255 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును భారత్ సవరించింది. టెస్టు చరిత్రలోనే రికార్డు లక్ష్యమైన 419 పరుగుల ఛేదనకు దిగిన విండీస్ నాలుగో రోజు 26.5 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు బుమ్రా (5/7), ఇషాంత్ శర్మ (3/31), షమీ (2/13) చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ చేజ్ (29 బంతుల్లో 12; ఫోర్), కీమర్ రోచ్ (31 బంతుల్లో 38; ఫోర్, 5 సిక్స్‌లు), మిగెల్ కమిన్స్ (22 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మినహా మిగతావారు కనీసం రెండంకెల స్కోరు చేయకుండానే వెనుదిరిగారు. రోచ్, కమిన్స్ చివరి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ విజయంతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్టు ఈనెల 30న కింగ్‌స్టన్‌లో మొదలవుతుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 185/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 7 వికెట్లకు 343 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (242 బంతుల్లో 102; 5 ఫోర్లు) రెండేళ్ల సెంచరీ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. అతడికి తోడు ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (128 బంతుల్లో 93; 10 ఫోర్లు, సిక్స్) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రహానే, విహారి సాధికారికంగా ఆడి ఐదో వికెట్‌కు 135 పరుగులు జత చేశారు.