పాక్ నుంచి లాగేసుకుందాం!
న్యూజిలాండ్‌తో సిరీస్ జరుగుతుంటే... పాక్ నుంచి లాక్కోవడం ఏమిటి? అనుకుంటున్నారా..! ఆశ్చర్యపోకండి. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్‌లోనూ ఓ ఘనత సాధించడం ద్వారా భారతదేశాన్ని సంతోషంలో నింపే అవకాశం కోహ్లి సేనకు దక్కింది. న్యూజిలాండ్‌తో నేటి నుంచి జరిగే రెండో టెస్టులో గెలిస్తే భారత్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ర్యాంక్ పాకిస్తాన్ దగ్గర ఉంది. గత నెలలో వెస్టిండీస్ పర్యటనలో ఉన్నప్పుడు భారత్ నంబర్‌వన్‌గా అవతరించింది. అయితే కరీబియన్ పర్యటనలో ఆఖరి టెస్టు రద్దుకావడం... అటు పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకోవడంతో... హోదా వాళ్లకు వెళ్లి మిస్బా ‘గద’ అందుకున్నాడు.
పాక్ చరిత్రలో తొలిసారి నంబర్‌వన్ కాగానే ఆ దేశ అభిమానులు భారత్‌ను కవ్వించేలా సోషల్ మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు న్యూజిలాండ్‌పై గెలిచి ఆ ర్యాంక్‌ను లాగేసుకుంటే ఓ పనైపోతుంది. తొలి టెస్టులో అద్భుత విజయం తర్వాత భారత్ ఆత్మవిశ్వాసం ఆకాశంలో ఉండగా... సిరీస్‌లో కోలుకునే ప్రయత్నంలో న్యూజిలాండ్ మరో పోరాటానికి సిద్ధమవుతోంది. భారత క్రికెట్ మక్కాగా ఖ్యాతిగాంచిన ఈడెన్ గార్డెన్‌స మైదానంలో జరిగే ఈ టెస్టు మన జట్టుకు మరో మైలురాయిగా చరిత్రలో నిలిచిపోనుంది. సొంతగడ్డపై మన జట్టుకు ఇది 250వ టెస్టు కావడం విశేషం. మరి ఈ మ్యాచ్‌లోనూ ‘టాప్’ లేపే ప్రదర్శనతో విజయ ‘గంట’ మోగిస్తుందా చూడాలి.
నంబర్‌వన్‌పై భారత్ గురి
నేటి నుంచి న్యూజిలాండ్‌తో రెండో టెస్టు
గెలిస్తే అగ్రస్థానానికి కోహ్లిసేన
రాహుల్ స్థానంలో ధావన్!
కోల్‌కతా: భారత గడ్డపై తొలి టెస్టులో ఓడిన తర్వాత సిరీస్‌లో ప్రత్యర్థి జట్లు కోలుకోవడం చాలా అరుదు. స్వదేశంలో శుభారంభం చేస్తే ఆ పట్టును సిరీస్ మొత్తం నిలబెట్టుకోవడంలో మన జట్టుకు మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ సిరీస్‌లో కూడా కోహ్లి సేన అదే ఆశిస్తోంది. తొలి టెస్టు విజయానంతరం ఇప్పుడు అదే జోరులో రెండో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. పనిలో పనిగా నంబర్‌వన్ ర్యాంక్ కూడా చెంతకు చేరుతుంది. ఈ నేపథ్యంలో నేటినుంచి ఇక్కడి ఈడెన్ గార్డెన్‌సలో న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు భారత్ సన్నద్ధమైంది. మరో వైపు గత మ్యాచ్‌లో పోరాడిన స్ఫూర్తితో ఈ సారైనా ఓటమి నుంచి తప్పించుకోవాలని కివీస్ భావిస్తోంది.
ధావన్‌కే అవకాశం!
గాయపడిన రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేయడంతో అతని పునరాగమనంపై ఆసక్తి రేగింది. అరుుతే మ్యాచ్‌లో గంభీర్‌తో పోలిస్తే శిఖర్ ధావన్‌కే తుది జట్టులో చోటు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మ్యాచ్‌కు ముందు రోజు గంభీర్‌తో పోలిస్తే ధావన్ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. ఇటీవల ధావన్ ప్రదర్శనలో నిలకడ లేకపోయినా మరీ ఘోరంగా ఏమీ విఫలం కాలేదు కాబట్టి అతనిని పక్కన పెట్టకపోవచ్చు. అశ్విన్ వేలి గాయంతో బాధపడుతున్నా మ్యాచ్ సమయానికి ఫిట్ కాగలడని సమాచారం. అతను గురువారం ప్రాక్టీస్ చేయకపోయినా అది పెద్ద విషయం కాదని కోహ్లి కొట్టి పారేశాడు. కాన్పూర్ టెస్టుతో పోలిస్తే ఈ సారి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది.
అదే జరిగితే రోహిత్‌ను తప్పించి కొత్త బౌలర్ జయంత్ యాదవ్‌ను ఎంపిక చేస్తారు. కివీస్ జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ ఉండటంతో మరో ఆఫ్ స్పిన్నర్ అవసరాన్ని కెప్టెన్ గుర్తు చేశాడు. ఇతర ఆటగాళ్ల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే స్వదేశంలో ఆడుతూ కూడా గత టెస్టు తొలి ఇన్నింగ్‌స మన జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. సరిగ్గా చెప్పాలంటే మనోళ్లు కూడా స్పిన్‌ను తగిన విధంగా ఎదుర్కోలేకపోయారు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ బలహీనతలపై దాడి చేసి భారీ స్కోరు సాధిస్తే ఈ టెస్టులోనూ జట్టుకు తిరుగుండదు.
విలియమ్సన్‌కు అనారోగ్యం
ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయిన న్యూజిలాండ్‌కు రెండో టెస్టుకు ముందు మరో సమస్య వచ్చి పడింది. టీమ్ కెప్టెన్, టాప్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్ గురువారం అనారోగ్యానికి గురయ్యాడు. అతను నిజంగా మ్యాచ్‌కు దూరమైతే కివీస్ కుప్పకూలిపోతుంది. అయితే తగిన విశ్రాంతితో కెప్టెన్ మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వాసంతో ఉంది. విలియమ్సన్ ఆడకపోతే నికోల్స్‌కు అవకాశం లభిస్తుంది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైనా... ఇతర ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో గప్టిల్‌కు మరో అవకాశం లభించనుంది.
క్రెయిగ్ స్థానంలో జట్టుతో చేరిన జీతన్ పటేల్ కూడా మూడేళ్ల తర్వాత మ్యాచ్ ఆడటం ఖాయమైంది. గత మ్యాచ్‌లో ఆ జట్టు కొంత పోరాట పటిమ కనబర్చింది. కానీ కీలక క్షణాల్లో ఆధిక్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆ అనుభవంతో ఈ సారి స్పిన్‌ను మరింత సమర్థంగా ఎదుర్కోవాలని, మెరుగ్గా ఆడాలని జట్టు పట్టుదలగా ఉంది. సీనియర్ రాస్ టేలర్ కూడా రాణించడం ఎంతో అవసరం. మిషెల్ సాన్‌ట్నర్, రోంచీ గత ప్రదర్శనను ఇక్కడా కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం వారికి అంత సులువు కాదు. గతంలో ఈడెన్‌లో ఆడిన రెండు టెస్టులనూ కివీస్ డ్రాగా ముగించగలిగింది.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, రోహిత్/జయంత్, అశ్విన్, సాహా, జడేజా, షమీ, ఉమేశ్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్)/నికోల్స్, గప్టిల్, లాథమ్, టేలర్, సాన్‌ట్నర్, రోంచీ, వాట్లింగ్, జీతన్, వాగ్నర్, సోధి, బౌల్ట్
ఉ.గం.
9.30 నుంచి
స్టార్ స్పోర్‌ట్స 1లో
ప్రత్యక్ష ప్రసారం
పిచ్, వాతావరణం
ఈడెన్‌గార్డెన్‌సలో ఇటీవల తయారు చేసిన కొత్త పిచ్‌పై తొలిసారి జరుగుతున్న మ్యాచ్ ఇది. ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించి మూడో రోజునుంచి స్పిన్‌కు సహకరించే అవకాశం ఉంది. టాస్‌తో పాటు తొలి ఇన్నింగ్‌సలో చేసే పరుగులు కీలకం కానున్నాయి. కోల్‌కతాలో సెప్టెంబర్ నెలలో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. టెస్టుకు కూడా ఏదో ఒక దశలో వాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
‘నంబర్‌వన్, రికార్డుల గురించి నేను పట్టించుకోను. రెండేళ్ల క్రితంతో పోలిస్తే మేం ఎంత బాగా ఆడుతున్నామో చూస్తున్నారు. నాకు అదే ముఖ్యం. మేం అన్ని రకాలుగా సిద్ధమయ్యాం కాబట్టి పిచ్ గురించి అసలు ఆలోచనే లేదు. అయితే బ్యాటింగ్‌కు మాత్రం అనుకూలంగా కనిపిస్తోంది. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం ముఖ్యం. నా ఫామ్ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. ప్రతీ సారి పరుగులు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. డీఆర్‌ఎస్ వాడకుండా అంపైర్లు తప్పులు చేస్తున్నారని విమర్శించడం సరి కాదు. భవిష్యత్తులో డీఆర్‌ఎస్ అవసరం ఉంటుందనే.. నా అభిప్రాయం. అయితే ఇప్పుడే దీనిపై నిర్ణయం తీసుకోలేం’.
- విరాట్ కోహ్లి
‘మొదటి టెస్టులో కూడా మేం బాగా ఆడాం. ఒకట్రెండు సార్లు వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయాం. ఈ సారి ఆరంభం బాగుండటంతో పాటు సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలవడమే ముఖ్యం. అప్పుడు మాకూ ఈ టెస్టులో మంచి అవకాశం ఉంటుంది. విలియమ్సన్‌కు కాస్త నలతగా ఉండి ప్రాక్టీస్ చేయలేదు. అంతే తప్ప పెద్ద సమస్య కాదు. విశ్రాంతి తర్వాత మ్యాచ్ కు సిద్ధంగా ఉంటాడు’. - టామ్ లాథమ్, కివీస్ బ్యాట్స్‌మన్
కోల్‌కతా కబుర్లు కివీస్‌కు గంగూలీ ‘క్లాస్’
ఈడెన్ గార్డెన్‌సలో ప్రాక్టీస్ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ న్యూజిలాండ్ ఆటగాళ్లతో ముచ్చటించారు. కివీస్ బ్యాటింగ్ కోచ్ మెక్‌మిలన్, ఇతర సభ్యులకు ఈ సందర్భంగా ఆటకు సంబంధించి గంగూలీ పలు సూచనలు చేశారు. స్పిన్‌ను ఎదుర్కోవడం, ఇక్కడి పిచ్‌లపై బంతిని డ్రైవ్ చేయడం తదితర అంశాలపై బ్యాట్‌తో ఆడి చూపించి కొన్ని కిటుకులు చెప్పారు. న్యూజిలాండ్ ఆటగాళ్లంతా ఆయన సూచనలను శ్రద్ధగా విన్నారు. దాదా టిప్స్ కివీస్‌కు ఏమైనా ఉపయోగపడతాయా చూడాలి. మరో వైపు తన సొంత మైదానంలోనే ’క్యాబ్’ అధ్యక్షుడు గంగూలీకి చేదు అనుభవం ఎదురైంది. తన కార్యాలయానికి వెళ్లబోయి ఆయన లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. చివరకు దానిని తెరిచి స్టూల్ సహాయంతో గంగూలీని బయటికి తీసుకు రావాల్సి వచ్చింది. 2011లో స్టేడియంను ఆధునీకరించినా 29 ఏళ్లుగా ఉన్న ఈ లిఫ్ట్‌ను మాత్రం ఇప్పటి వరకు మార్చలేదు.
చల్ మేరే భాయ్...
దేశవాళీ క్రికెట్‌లో ఒకే జట్టుకు, భారత జట్టుకు, చివరకు ఉద్యోగం చేసే సంస్థ తరఫున కూడా కలిసి ఆడిన కోహ్లి, గంభీర్‌లకు చాలా కాలంగా పడదనే విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఐపీఎల్‌లో దాదాపు కొట్టుకున్నంత పని చేసిన తర్వాత మరో రెండు సార్లు కూడా వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు దానిని దూరంగా పెట్టాలని వారు భావించినట్లున్నారు. గంభీర్ కూడా ప్రస్తుత కెప్టెన్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని అనుకున్నట్లున్నాడు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా వీరిద్దరు సుదీర్ఘ సమయం పాటు ముచ్చటించుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకోవడం కూడా అందరినీ ఆకర్షించింది.
గంట మోగిస్తారు...
లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ ఒకరు అక్కడి పెద్ద గంటను మోగించడం ఆనవాయితీ. తాను కెప్టెన్‌గా ఉన్ననాటినుంచి ఇది సౌరవ్ గంగూలీని ఆకర్షించింది. అతను తొలి టెస్టు ఆడింది కూడా అక్కడే కావడం విశేషం. అప్పటినుంచి అతను ఆ మైదానంతో పాటు ఆ బెల్‌పై కూడా ఆకర్షణ పెంచుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ‘క్యాబ్’ అధ్యక్షుడిగా తమ స్టేడియంలో దానిని ఏర్పాటు చేయాలని గంగూలీ భావించాడు. ఫలితంగా ఇప్పుడు అదే తరహాలో పెద్ద గంట ఇక్కడ రెడీ అయింది. భారత్‌లో మరే మైదానంలోనూ ఇలాంటిది లేదు. చండీగఢ్‌లో తయారు చేసిన ఈ భారీ గంటకు వెండి తాపడం చేయించారు. మైదానంలోని బీసీ రాయ్ క్లబ్ హౌస్ ఎండ్ వైపు సైట్ స్క్రీన్ పైన ఉంచారు. శుక్రవారం రెండో టెస్టుకు ముందు భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ దీనిని మోగిస్తారు.