ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 ఉధృతి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో పర్యటనను పక్కన పెట్టింది. ఇప్పటికే శ్రీలంకతో సిరీస్‌కు ‘నో’ చెప్పిన భారత్... ఆగస్టులో జరగాల్సిన జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో భారత్ 3 వన్డేలు ఆడాల్సి ఉంది. కరోనా కారణంగా నెలకొని ఉన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆట సాధ్యం కాదని స్పష్టం చేసింది. మరోవైపు భారత జట్టుకు కూడా ఇప్పట్లో శిక్షణా శిబిరం జరిగే అవకాశం కనిపించడం లేదు. ‘మైదానంలో సాధన చేసేందుకు అనుకూలమైన, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయని భావించినప్పుడే బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు శిక్షణా శిబిరం నిర్వహిస్తాం.
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ను మొదలు పెట్టాలని బీసీసీఐకి కూడా ఉంది. అయితే కరోనాను కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం, రాష్ట్రాలు చేపడుతున్న చర్యలకు మేం విఘాతం కల్పించకూడదు. కాబట్టి తొందరపాటుతో ఏ నిర్ణయం కూడా తీసుకోం’ అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. కోవిడ్–19కు సంబంధించి నిపుణులతో మాట్లాడుతూ బీసీసీఐ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం చివరిసారిగా మార్చిలో టీమిండియా మైదానంలోకి దిగింది. ఇందులో వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కాగా... కరోనా కారణంగా మిగతా రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
రాజ్‌పుత్ నిరాశ...
మరోవైపు ఈ పర్యటన రద్దుతో జింబాబ్వే జట్టు హెడ్ కోచ్, భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జింబాబ్వే జట్టు మంచి అవకాశం కోల్పోయిందని ఆయన అన్నారు. ‘జింబాబ్వే క్రికెట్ జట్టుకు ఈ పరిణామం తీవ్ర నిరాశ కలిగించింది. ఎందుకంటే సమీప భవిష్యత్తులో వారికి మళ్లీ భారత్‌తో తలపడే అవకాశం రాకపోవచ్చు. ప్రపంచంలోని ప్రతీ జట్టు భారత్‌లాంటి అత్యుత్తమ టీమ్‌తో ఆడాలని కోరుకుంటుంది. కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ఆటగాళ్లతో తలపడే అవకాశం వారికి చేజారింది’ అని రాజ్‌పుత్ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా జింబాబ్వేకు రాజ్‌పుత్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment