కదంతొక్కిన శుభ్‌మాన్, పృథ్వీ షా
ముంబై: తొలుత బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఆ తర్వాత బౌలర్లు విజృంభించారు. వెరసి ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై భారత అండర్–19 జట్టు 230 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. తాజా విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3–1తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోరును చేసింది.
ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (120 బంతుల్లో 160; 23 ఫోర్లు, ఒక సిక్స్), పృథ్వీ షా (89 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 231 పరుగులు జోడించారు. 383 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు కమలేశ్ నాగర్‌కోటి (4/31), వివేకానంద్ తివారి (3/20), శివమ్ (2/18) దెబ్బతీశారు. దాంతో ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది.