ప్రి ఫైనల్‌ టీమ్‌ ఇదే! | India vs Australia: Rahul Returns, Karthik Dropped from ODI Squad | Sakshi
Sakshi News home page

ప్రి ఫైనల్‌ టీమ్‌ ఇదే!

Published Sat, Feb 16 2019 12:57 AM | Last Updated on Sat, Feb 16 2019 5:27 AM

India vs Australia: Rahul Returns, Karthik Dropped from ODI Squad - Sakshi

ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు జరగబోతున్న ఆఖరి సిరీస్‌... ఇక్కడ ఎంపికైతే దాదాపుగా ఇంగ్లండ్‌ టికెట్‌ ఖరారైనట్లే... దాంతో ఆస్ట్రేలియాతో తలపడే భారత వన్డే జట్టుపై అందరి దృష్టీ నెలకొంది. అటు క్రికెట్‌ విశ్లేషకులు, ఇటు అభిమానుల అంచనాలకు అనుగుణంగానే ఎలాంటి సంచలనాలు లేకుండా టీమ్‌ను సెలక్టర్లు ప్రకటించారు. రెండో వికెట్‌ కీపర్‌గా అనుభవజ్ఞుడైన దినేశ్‌ కార్తీక్‌కంటే దూకుడైన రిషభ్‌ పంత్‌కే ఓటు వేయడం ఒక్కటే కొంత ఆశ్చర్యకర నిర్ణయం కాగా... లోకేశ్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ సమర్థతపై కూడా సెలక్షన్‌ కమిటీ నమ్మకముంచింది. ఈ ఎంపిక ద్వారా లెఫ్టార్మ్‌ పేసర్, రెగ్యులర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అవసరం లేదని తేల్చేయగా... ఏదో ఒక మూల ఆశలు పెంచుకున్న రహానేను పట్టించుకోలేదు. ప్రపంచ కప్‌కు ఇదే తుది జట్టు కాదంటూ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట వరసకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా... గాయాల సమస్య లేకపోతే ఇక మార్పులు ఉండకపోవచ్చు.

ముంబై: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన అనంతరం 2017 నుంచి దినేశ్‌ కార్తీక్‌ 20 మ్యాచ్‌లు ఆడి ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చాడు. ఎక్కువ సందర్భాల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం రాకపోయినా... జట్టు అవసరాలకు అనుగుణంగా అతను కీలక సమయాల్లో వేర్వేరు స్థానాల్లో రాణించాడు. 2018లో కార్తీక్‌ వరుసగా 21, 33, 31 నాటౌట్, 1, 44, 37, 12, 25 నాటౌట్, 38 నాటౌట్, 0 పరుగులు చేశాడు. ఫినిషర్‌గా తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే ఇది వరల్డ్‌ కప్‌ జట్టులోకి ఎంపికయ్యేందుకు సరిపోదని సెలక్టర్లు భావించినట్లున్నారు. కేవలం 3 వన్డేల అనుభవమే ఉన్నా... దూకుడులో ఈతరం ప్రతినిధిగా కనిపిస్తున్న రిషభ్‌ పంత్‌పైనే వారు దృష్టి పెట్టారు. మిడిలార్డర్‌లో ఒక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్‌ బాగుంటుందని భావించడం కూడా అతనికి అదనపు బలంగా మారింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడే ఐదు వన్డేల సిరీస్‌ కోసం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. ఇందులో పంత్‌కు స్థానం లభించగా... ఇటీవల ఆసీస్, కివీస్‌ పర్యటనల్లో ఉన్న కార్తీక్‌పై వేటు పడింది. ఇదొక్కటే కాస్త చర్చనీయాంశంగా మారిన ఎంపిక. విశ్రాంతి అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ముందుగా అనుకున్నట్లుగా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మాత్రం విశ్రాంతి ఇవ్వలేదు. రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఎంపికైన టీమ్‌లో పంజాబ్‌ లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే ఒక్కడే కొత్త ఆటగాడు. కుల్దీప్‌ యాదవ్‌కు విశ్రాంతినిస్తూ మార్కండేకు అవకాశం కల్పించారు.  

రాహుల్‌కు పిలుపు... 
ప్రధాన ఓపెనర్లు కాకుండా రిజర్వ్‌ ఓపెనర్‌గా లోకేశ్‌ రాహుల్‌పై సెలక్టర్లు నమ్మకముుంచారు. గత పది వన్డేల్లో రాహుల్‌ ఒకే ఒక అర్ధసెంచరీ చేసినా... అతని బ్యాటింగ్‌ శైలి, ఏ స్థానంలోనైనా ఆడగలిగే సత్తా కూడా ఎంపికకు కారణమైంది. టీవీ షో వివాదం తర్వాత మైదానంలో తిరిగి అడుగు పెట్టిన అనంతరం ఇంగ్లండ్‌ లయన్స్‌తో మ్యాచ్‌లలో రాహుల్‌ రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు కూడా అదృష్టం కలిసొచ్చింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా అసలు సీన్‌లోనే లేని అతను ఇటీవలి పరిమిత ప్రదర్శనతోనే సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.  

ఖలీల్‌పై వేటు... 
వరల్డ్‌ కప్‌లో వైవిధ్యం కోసం ఒక లెఫ్టార్మ్‌ పేసర్‌ ఉంటే బాగుంటుందని భావించిన సెలక్టర్లు ఇటీవల ఖలీల్‌ అహ్మద్‌కు రెండు ఫార్మాట్‌లలోనూ వరుసగా అవకాశాలు ఇచ్చారు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో అతను భారీగా పరుగులు ఇచ్చి అంచనాలు నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో అతడిని తప్పించగా... ప్రత్యామ్నాయంగా కనిపించిన జైదేవ్‌ ఉనాద్కట్‌ పేరును కూడా పరిశీలించలేదు. ఆస్ట్రేలియాతో వన్డేలు ఆడిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. టి20 సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో వన్డేలకు మాత్రం సిద్ధార్థ్‌ కౌల్‌ను ఎంపిక చేశారు.  

ఐపీఎల్‌తో గుర్తింపు... 
పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల మయాంక్‌ మార్కండేకు తొలిసారి భారత జట్టు పిలుపు లభించింది. దేశవాళీ జట్టు పంజాబే అయినా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడటంతోనే ఈ లెగ్‌ స్పిన్నర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. 2018 ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అతను 8.36 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల భారత్‌ ‘ఎ’ తరఫున లయన్స్‌పై ఆడిన రెండు వన్డేల్లో 5 వికెట్లు తీసిన అతను... టీమిండియాకు ఎంపికైన రోజే 5 వికెట్లతో లయన్స్‌పై రెండో అనధికారిక టెస్టులో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.   

దినేశ్‌ కార్తీక్‌కు దారులు మూసుకుపోలేదు. దీనికి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో అతడిని ఆడించాం. ఆ సమయంలో పంత్‌కు విశ్రాంతినిచ్చాం. ఆ తర్వాత ఇంగ్లండ్‌ లయన్స్‌పై పంత్‌ బాగా ఆడాడు. అందుకే టి20 సిరీస్‌కు పంపించాం. వరల్డ్‌ కప్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు పంత్‌ను అందుకే కొన్ని వన్డేలు ఆడించాలని భావిస్తున్నాం. ఇటీవల కివీస్‌తో విజయ్‌ శంకర్‌ బాగా ఆడటంతో మా కూర్పు మార్చుకోవాల్సి వచ్చింది. అతను ఎంతో ప్రభావవంతమైన ఆటగాడు. తర్వాతి మ్యాచ్‌లు ఎలా ఆడతాడో చూస్తాం. మెగా టోర్నీకి ముందు అందరినీ పరీక్షించాలనేదే మా ప్రయత్నం. మరోవైపు వరల్డ్‌ కప్‌ కోసం 18 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశాం. వీరికి తగినంత విశ్రాంతినిస్తూ మ్యాచ్‌లు ఆడించే అంశంపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో చర్చించబోతున్నాం. 
– ఎమ్మెస్కే ప్రసాద్,సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ 


ఆస్ట్రేలియాతో టి20లకు భారత జట్టు
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), ధావన్, రాహుల్, పంత్, దినేశ్‌ కార్తీక్, ధోని, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, విజయ్‌ శంకర్, చహల్, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్, సిద్ధార్థ్‌ కౌల్, మయాంక్‌ మార్కండే.

ఆస్ట్రేలియాతో వన్డేలకు భారత జట్టు
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, అంబటి రాయుడు, లోకేశ్‌ రాహుల్, ధోని, కేదార్‌ జాదవ్, హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్, రిషభ్‌ పంత్, షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, సిద్ధార్థ్‌ కౌల్‌ (తొలి 2 వన్డేలకు), భువనేశ్వర్‌  (చివరి 3 వన్డేలకు).  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement