బౌలింగ్ మాటెలా ఉన్నా... టీమిండియాకు ఆస్ట్రేలియా గడ్డపై నిండైన బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. సీఏ ఎలెవెన్‌తో సరైన సన్నాహం లభించింది. మురళీ విజయ శతకం, కేఎల్ రాహుల్ అర్ధ శతకాలతో... పనిలో పనిగా ఓపెనింగ్ జోడీ ఎవరనే సందిగ్ధమూ వీడింది. ఇక మిగిలింది... కంగారూలను ఎలాంటి బెరుకు లేకుండా ఎదుర్కొనడమే! పూర్తి ఆత్మవిశ్వాసంతో టెస్టు సిరీస్ బరిలో దిగడమే..!
సిడ్నీ: అనుభవం లేని ప్రత్యర్థిని మన బౌలర్లు నిలువరించలేకపోయినప్పటికీ, బ్యాట్స్‌మెన్ అందరికీ బాగా ఉపయోగపడిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు తమ ఫామ్ చాటుకోవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో... వచ్చిన అవకాశాన్ని ఓపెనర్లు మురళీ విజయ్ (132 బంతుల్లో 129; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు), లోకేశ్ రాహుల్ (98 బంతుల్లో 62; 8 ఫోర్లు, సిక్స్) సద్వినియోగం చేసుకున్నారు. వందకుపైగా పరుగుల భాగస్వామ్యంతో... తొలి టెస్టుకు ముందు టీమిండియాకు ఇన్నింగ్స్‌ను ప్రారంభించేదెవరనే పెద్ద బెంగ తీర్చారు. భారత రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ ఔటయ్యాక స్కోరు 211/2 వద్ద ఉండగా మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 356/6తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సీఏ ఎలెవెన్ 544 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హ్యారీ నీల్సన్ (170 బంతుల్లో 100; 9 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరోన్ హార్డీ (141 బంతుల్లో 86; 10 ఫోర్లు, సిక్స్)తో అతడు ఏడో వికెట్‌కు 179 పరుగులు జోడించాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఫాలిన్స్ (43; 7 ఫోర్లు), రాబిన్స్ (38 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), కోల్‌మన్ (36; 2 ఫోర్లు) భారత బౌలర్లను విసిగించారు. చివరి మూడు వికెట్లకు వీరు 90 పరుగులు జత చేయడం గమనార్హం.దీంతో ఆ జట్టుకు 186 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. శనివారం పేసర్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు దిగారు. భువనేశ్వర్ బౌలింగ్ చేయలేదు. విజయ్ ఐదు ఓవర్లు వేశాడు.మొత్తమ్మీద టీమిండియా తరఫున 10 మంది బౌలింగ్ చేయగా, శతక వీరుడు నీల్సన్‌ను కోహ్లి ఔట్ చేయడం విశేషం.
విజయ్ ధనాధన్...
భారత రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ సంయమనం చూపగా... రాహుల్ దూకుడుగా ఆడాడు. అయితే, అర్ధ శతకం అనంతరం రాహుల్ ఔటయ్యాడు. తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నమోదు కాగా ఇందులో రాహుల్‌వే 62 పరుగులు ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచి విజయ్ విజృంభణ ప్రారంభమైంది. రాహుల్ వెనుదిరిగేటప్పటికి 86 బంతుల్లో 46 పరుగులతో ఉన్న అతడు... తర్వాత విరుచుకుపడ్డాడు.కార్డర్ వేసిన ఓవర్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు సహా 26 పరుగులు రాబట్టాడు. 118 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో యాభైని అతడు 27 బంతుల్లోనే చేరుకున్నా డు.వన్‌డౌన్‌లో వచ్చిన హనుమ విహారి (15 నాటౌట్) పూర్తి సహకారం అందించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 102 పరుగులు జోడించారు. విహారి ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ, సిక్స్ కూ డా లేకపోగా... అదే సమయంలో మరో ఎండ్‌లో ఉన్న విజయ్ 10 ఫోర్లు, 5 సిక్స్‌లు కొట్టడం విశేషం. నాలుగో రోజు రెండు జట్లు కలిపి 399 పరుగులు చేశాయి.
వీరే(నా) ఓపెనర్లు!
రెండో ఇన్నింగ్స్‌లో ఆటతో... విజయ్, రాహుల్‌లకు ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో ఈ నెల 6న ప్రారంభం కానున్న తొలి టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు మెరుగయ్యాయి. వాస్తవానికి శుక్రవారం వరకు వీరిద్దరిలో పృథ్వీ షాకు తోడెవరనే ప్రశ్నలు వచ్చాయి. ఫామ్‌లో లేకున్నా ఎక్కువ మొగ్గు రాహుల్ వైపే ఉంది. గతంలో ఇక్కడ పర్యటించిన అనుభవం ఉన్నా విజయ్‌ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.\ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడిని బ్యాటింగ్‌కు పంపకపోవడమే దీనికి నిదర్శనం. అయితే, ఈలోగా పృథ్వీ గాయపడటంతో రకరకాల ప్రత్యామ్నాయాలు ఆలోచనలోకి వచ్చాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ... శతకం బాదిన విజయ్ తన పునరాగమనానికి మార్గం సుగమం చేసుకున్నాడు. మేనేజ్‌మెంట్ ఇంకేమైనా ప్రయోగాలు చేయాలని భావిస్తే తప్ప అడిలైడ్‌లో విజయ్ బరిలో దిగడం ఖాయం.
సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 358; సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 544 ఆలౌట్ (151.1 ఓవర్లలో) (డార్సీ షార్ట్ 74, బ్రయాంట్ 62, నీల్సన్ 100, హార్డీ 86, అశ్విన్ 2/122); భారత్ రెండో ఇన్నింగ్స్: 211/2 (43.4 ఓవర్లలో) (మురళీ విజయ్ 129, రాహుల్ 62, విహారి 15 నాటౌట్).
Comments
Please login to add a commentAdd a comment