
లండన్: భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట వానపాలైంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసినా వరుణుడు అవకాశం ఇవ్వలేదు. ఉదయం నుంచే జల్లులు కురుస్తుండటంతో మైదానం చిత్తడిగా మారిపోయింది. దీంతో కనీసం టాస్ కూడా వేయలేదు. ఇరుజట్లు తుది 11 మంది ఆటగాళ్లనూ ప్రకటించలేదు. లంచ్ సమయానికి ముందు, టీ వేళకు వర్షం ఆగినట్లనిపించింది. వాతావరణమూ కొంత మారింది. అయితే, టీ తర్వాత రెండుసార్లు మైదానంలోకి వచ్చిన అంపైర్లు గ్రౌండ్ స్టాఫ్‌తో చర్చించారు. మ్యాచ్ జరిగే పరిస్థితులు లేవని తేల్చారు. స్థానిక కాలమానం ప్రకారం 4.50 నిమిషాలకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లార్డ్స్‌లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో ఏమాత్రం వీలు చిక్కినా మ్యాచ్ జరిగేందుకు వీలుండేది. దీనిని దృష్టిలో పెట్టుకుని అంతకుముందు లంచ్‌ను అరగంట ముందుకు జరిపి వృథా అయిన సమయాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, విరామం లేని జల్లులతో ఈ ప్రయత్నాలేమీ సఫలం కాలేదు. మిగతా రోజుల్లో సమయాన్ని అరగంట ముందు కు జరిపి... 96 ఓవర్ల చొప్పున నిర్వహించనున్నారు. మరోవైపు లండన్ వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచే వర్షం కురుస్తుండటంతో ఆటగాళ్లు గురువారం ఉదయం ప్రాక్టీస్‌కు కూడా దిగలేదు. 2001 తర్వాత వర్షం కారణంగా లార్డ్స్‌లో ఒక్క బంతి పడకుండా టెస్టు మ్యాచ్ ఒక రోజు ఆట రద్దవడం ఇప్పుడే కావడం గమనార్హం. లండన్‌లో నిన్నటివరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం చాలాసేపు మేఘావృతమై ఉంది. దీంతో కనీసం వారాంతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే లార్డ్స్ టెస్టుకు అవాంతరాలు తప్పేలా లేవు.
లార్డ్స్ గంట మోగలేదు
షెడ్యూల్ ప్రకారం గురువారం మ్యాచ్ ఆరంభానికి ఐదు నిమిషాల ముందు లార్డ్స్ మైదానంలోని గంటను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మోగించాల్సి ఉంది. అయితే ఆట సాధ్యం కాకపోవడంతో గంట కూడా మోగలేదు. మరో వైపు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు కబీర్ ఖాన్‌లతో లార్డ్స్ మైదానంలో సచిన్ కొద్ది సేపు ముచ్చటించాడు. 1983లో ఇదే మైదానంలో కపిల్ నాయకత్వంలో భారత్ వరల్డ్ కప్ గెలవగా... ఈ చారిత్రక ఘటనపై రూపొందిస్తున్న సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరో కాగా, కబీర్ ఖాన్ దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment