♦ ఉత్కంఠపోరులో ఓడిన భారత్
♦ 5 పరుగులతో ఇంగ్లండ్ విజయం
♦ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
♦ కేదార్ జాదవ్ శ్రమ వృథా
భారత్ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు కావాలి. అప్పటికే అలవోకగా బౌండరీలు బాది జట్టును విజయానికి చేరువ చేసిన కేదార్ జాదవ్ క్రీజ్‌లో ఉండగా, తన అంతకుముందు ఓవర్లో 16 పరుగులు ఇచ్చిన వోక్స్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి రెండు బంతులను జాదవ్ అవలీలగా 6, 4 బాదేయడంతో రెండు బంతులకే 10 పరుగులు వచ్చాయి. విజయం ఖాయమనిపించిన ఈ దశలోనూ అదృష్టం భారత్‌కు ముఖం చాటేసింది. తర్వాతి రెండు బంతులకు పరుగు తీయలేకపోయిన జాదవ్ ఐదో బంతికి క్యాచ్ ఇచ్చాడు. ఆఖరి బంతిని భువనేశ్వర్ ఆడలేకపోవడంతో ఇంగ్లండ్ ఆటగాళ్ల సంబరాలు, అటు డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా సభ్యుల్లో నిరాశ... అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో దోబూచులాడి చివరకు మోర్గాన్ సేన పక్షం వహించింది. సుదీర్ఘ పర్యటనలో ఐదు టెస్టులు, రెండు వన్డేల పాటు గెలుపు రుచి చూడని ఇంగ్లండ్ ఎట్టకేలకు ఒక విజయాన్ని నమోదు చేసుకుంది.
కోల్‌కతా: వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ కూడా అభిమానులకు ఫుల్ వినోదాన్ని పంచింది. గత రెండు వన్డేలలాగే భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ ఒత్తిడిని అధిగమించగలిగింది. ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ (39 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్ స్టో (64 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.
అనంతరం భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 316 పరుగులు చేయగలిగింది. కేదార్ జాదవ్ (75 బంతుల్లో 90; 12 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత ప్రదర్శన కనబర్చగా, పాండ్యా (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (63 బంతుల్లో 55; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. ఛేదనలో జాదవ్, పాండ్యా ఆరో వికెట్‌కు 7.51 రన్‌రేట్‌తో 104 పరుగులు జోడించినా గెలుపు మాత్రం దక్కలేదు. కొన్నాళ్ల క్రితం ఇదే మైదానంలో చేదు అనుభవాన్ని రుచి చూసిన స్టోక్స్, ఈసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం విశేషం. ఓవరాల్‌గా 232 పరుగులు చేసిన జాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–1తో గెలుచుకుంది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఈ నెల 26న ప్రారంభమవుతుంది.
మూడు భాగస్వామ్యాలు...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఫామ్‌లో లేని ధావన్ స్థానంలో రహానేకు అవకాశం ఇవ్వగా, ఇంగ్లండ్ జట్టులో కూడా గాయపడిన హేల్స్, రూట్ స్థానాల్లో బిల్లింగ్స్, బెయిర్‌స్టో వచ్చారు. ఆరంభంలో అనుకూలించిన పిచ్‌పై భారత బౌలర్లు భువనేశ్వర్, పాండ్యా పదునైన పేస్, బౌన్స్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లను కట్టడి చేశారు. దాంతో నిలదొక్కుకునేందుకు చాలా సమయం తీసుకున్న రాయ్, బిల్లింగ్స్ (58 బంతుల్లో 35; 5 ఫోర్లు) తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగూ తీయలేకపోయారు. ఆ తర్వాత రాయ్ దూకుడు కనబర్చగా... తాను ఎదుర్కొన్న 11వ బంతికి మొదటి పరుగు తీసిన బిల్లింగ్స్ అనంతరం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఈ క్రమంలో రాయ్ 41 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వీరిద్దరు 98 పరుగులు జోడించిన అనంతరం జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి బిల్లింగ్స్ అవుట్ కావడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. జడేజా తర్వాతి ఓవర్లోనే రాయ్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో, మోర్గాన్ (44 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. బుమ్రా బౌలింగ్‌లో 28 పరుగుల వద్ద బెయిర్‌స్టో క్యాచ్ ఇచ్చినా, అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. మూడో వికెట్‌కు 84 పరుగులు జత చేసిన తర్వాత మోర్గాన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ఇంగ్లండ్ మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో స్టోక్స్, వోక్స్ (19 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. స్టోక్స్ 34 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, బుమ్రా వేసిన ఒక ఓవర్లో వోక్స్ 16 పరుగులు రాబట్టాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించడం విశేషం. చివరి 6 ఓవర్లలో ఇంగ్లండ్ 68 పరుగులు చేసింది.
జాదవ్, పాండ్యా దూకుడు...
అదృష్టవశాత్తూ తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో రహానే (1) విఫలం కాగా, దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన రాహుల్ (11) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో కోహ్లి, యువరాజ్ (57 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కోహ్లి తన సహజ శైలిలో దూకుడుగా ఆడగా, యువీ కొంత సమయం తీసుకున్నాడు. 35 పరుగుల వద్ద బాల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో మరో అవకాశం దక్కించుకున్న కోహ్లి, 54 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. కొద్ది సేపటికే కోహ్లిని అవుట్ చేసిన స్టోక్స్ 65 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర దించగా, ప్లంకెట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి యువరాజ్ అవుటయ్యాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు బ్యాక్‌ఫుట్‌పైనే జాగ్రత్తగా ఆడుతూ వచ్చిన ధోని (36 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కూడా గత మ్యాచ్ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు.
అయితే జాదవ్, పాండ్యా కలిసి భారత్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. మంచు కారణంగా ఇంగ్లండ్ బౌలర్లు ఇబ్బంది పడటంతో దీనిని వీరిద్దరు చక్కగా ఉపయోగించుకున్నారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో స్కోరు వేగం పుంజుకుంది. ముందుగా జాదవ్ 46 బంతుల్లో, ఆ తర్వాత పాండ్యా 38 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నారు. అయితే కీలక సమయంలో పాండ్యా అవుట్ కాగా, జడేజా (10), అశ్విన్ (1) అతడిని అనుసరించారు. చివర్లో జాదవ్ పోరాడినా లాభం లేకపోయింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (బి) జడేజా 65; బిల్లింగ్స్ (సి) బుమ్రా (బి) జడేజా 35; బెయిర్‌స్టో (సి) జడేజా (బి) పాండ్యా 56; మోర్గాన్ (సి) బుమ్రా (బి) పాండ్యా 43; బట్లర్ (సి) రాహుల్ (బి) పాండ్యా 11; స్టోక్స్ (నాటౌట్) 57; అలీ (సి) జడేజా (బి) బుమ్రా 2; వోక్స్ (రనౌట్) 34; ప్లంకెట్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 321.
వికెట్ల పతనం: 1–98; 2–110; 3–194; 4–212; 5–237; 6–246; 7–319; 8–321.
బౌలింగ్: భువనేశ్వర్ 8–0–56–0; పాండ్యా 10–1–49–3; బుమ్రా 10–1–68–1; యువరాజ్ 3–0–17–0; జడేజా 10–0–62–2; అశ్విన్ 9–0–60–0.
భారత్ ఇన్నింగ్స్: రహానే (బి) విల్లీ 1; రాహుల్ (సి) బట్లర్ (బి) బాల్ 11; కోహ్లి (సి) బట్లర్ (బి) స్టోక్స్ 55; యువరాజ్ (సి) బిల్లింగ్స్ (బి) ప్లంకెట్ 45; ధోని (సి) బట్లర్ (బి) బాల్ 25; జాదవ్ (సి) బిల్లింగ్స్ (బి) వోక్స్ 90; పాండ్యా (బి) స్టోక్స్ 56; జడేజా (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్ 10; అశ్విన్ (సి) వోక్స్ (బి) స్టోక్స్ 1; భువనేశ్వర్ (నాటౌట్) 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 316.
వికెట్ల పతనం: 1–13; 2–37; 3–102; 4–133; 5–173; 6–277; 7–291; 8–297; 9–316.
బౌలింగ్: వోక్స్ 10–0–75–2; విల్లీ 2–0–8–1; బాల్ 10–0–56–2; ప్లంకెట్ 10–0–65–1; స్టోక్స్ 10–0–63–3; అలీ 8–0–41–0.
భారత గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి కెప్టెన్‌గా వ్యవహరించిన 20 మ్యాచ్‌లలో కోహ్లికి ఇదే తొలి పరాజయం. ఇంతకు ముందు 19 మ్యాచ్‌లలో 17 విజయాలు, 2 ‘డ్రా’లు ఉన్నాయి.
మూడు వన్డేల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలోనూ 300కు పైగా స్కోరు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా, ఇరు జట్లు 1000కి పైగా పరుగులు చేయడం కూడా ఇదే మొదటిసారి. మూడు మ్యాచ్‌లు కలిపి అత్యధిక పరుగులు (2,090) కూడా ఇదే సిరీస్‌లో నమోదయ్యాయి.