భారత్–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే ఆ ఆసక్తే వేరు. ఇక ఏకంగా ప్రపంచ కప్‌లోనే తలపడితే ఉత్కంఠ ఊపేస్తుంది. ఆ మ్యాచ్ టికెట్ల కోసం ప్రేక్షకులు బారులు తీరతారు. అమ్మకం మొదలైన స్వల్ప వ్యవధిలోనే కౌంటర్లు ఖాళీ అయిపోతాయి. ప్రపంచ కప్‌కే తలమానికమైన అలాంటి సమరం... పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కాస్త సందిగ్ధంలో పడింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సైతం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఆచితూచి స్పందిస్తోంది.
లండన్: పుల్వామా ఉగ్ర దాడి ఘటన అనంతరం బహిష్కరణ డిమాండ్లు వస్తున్నా... ప్రపంచ కప్‌లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ, ప్రపంచ కప్ నిర్వహణ కమిటీ ఆశాభావంతో ఉన్నాయి. టోర్నీకే అత్యంత ఆకర్షణీయ మ్యాచ్ కావడంతో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. మరోవైపు మ్యాచ్‌కు చాలా సమయం ఉండటంతో ఇప్పటివరకు ఇరు దేశాల బోర్డుల ఉన్నతాధికారులు బహిరంగంగా స్పందించకున్నా... వచ్చే వారం దుబాయ్‌లో జరుగనున్న ఐసీసీ త్రైమాసిక సమావేశంలో ఈ విషయం వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయమై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ బోర్డు నుంచి కూడా తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. తాము కూడా ఏ విధమైన వివరాలు కోరలేదని వివరించారు. ప్రపంచ కప్ డైరెక్టర్ స్టీవ్ ఎల్‌వర్తి మాట్లాడుతూ భారత్–పాక్ మ్యాచ్‌ను ఉత్కృష్ట సన్నివేశంగా అభివర్ణించారు. ‘బహుశా క్రీడల్లో ఇది ప్రపంచంలోనే పెద్ద పోటీ. ఆ మ్యాచ్‌పై ఉండే ఆసక్తి, ప్రేక్షకుల మద్దతు, అభిమానుల హాజరు, టిక్కెట్ల కోసం చేసుకున్న దరఖాస్తులే దీనికి నిదర్శనం’ అని ఆయన విశ్లేషించారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్నందున... పాకిస్తాన్‌ను ప్రపంచకప్ నుంచి బహిష్కరిం చాలని కోరుతూ ఐసీసీకి లేఖ రాయాలని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి సీఓఏ వినోద్ రాయ్ సూచించినట్లు సమాచారం. ఈనెల 27న జరిగే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ తరఫున రాహుల్ జోహ్రి హాజరయ్యే అవకాశముంది.
టికెట్లకు మామూలు డిమాండ్ కాదు...
ప్రపంచ కప్ లీగ్ దశలో భాగంగా జూన్ 16న భారత్–పాక్ మాంచెస్టర్ నగరంలోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో తలపడతాయి. ఈ మైదానం సీటింగ్ సామర్థ్యం 25 వేలు. కానీ, టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులు 5 లక్షలు. జూలై 14న ఫైనల్ జరుగనున్న ప్రఖ్యాత లార్డ్స్‌లో టికెట్ కోసం 2.5 లక్షల దరఖాస్తులు కూడా రాలేదు. ఇక చిరకాల ప్రత్యర్థులైన ఆతిథ్య ఇంగ్లండ్–ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వచ్చిన దరఖాస్తులు 2.4 లక్షలే. అందుకనే దాయాదుల మ్యాచ్‌పై ఐసీసీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
పాక్‌తో ఆడకున్నా ఫర్వాలేదు...
పుల్వామా ఉగ్ర దాడి ఘటన అనంతరం పాక్‌తో ప్రపంచ కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రజల నుంచి వచ్చిన స్పందన సరైనదేనని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇదే సమయంలో ఉగ్ర దాడి స్పందనగా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని, వీటిలో ఒకదానిని ఆడకున్నా ఏమీ కాదంటూ పరోక్షంగా పాక్‌తో మ్యాచ్ రద్దును ప్రస్తావించాడు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రెండు దేశాల మధ్య సిరీస్‌కు అవకాశమే లేదని గంగూలీ పేర్కొన్నాడు. సుప్రీం కోర్టు నియమిత కమిటీ పర్యవేక్షణలో ఉన్నందున బీసీసీఐ ప్రభావవంతంగా లేదని, అయినప్పటికీ పాక్‌కు గట్టి సందేశం పంపాలని సూచించాడు. భారత్ లేకుండా ప్రపంచ కప్‌లో ఐసీసీ ముందుకెళ్లలేదని... కానీ ఆ సంస్థను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment