కుర్రాళ్లు హిట్ పెద్దోళ్లు ఫట్ | India vs SL: Team Dhoni begins its preparation for World T20 at Pune | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లు హిట్ పెద్దోళ్లు ఫట్

Published Wed, Feb 10 2016 12:04 AM | Last Updated on Fri, Nov 9 2018 6:35 PM

కుర్రాళ్లు హిట్ పెద్దోళ్లు ఫట్ - Sakshi

కుర్రాళ్లు హిట్ పెద్దోళ్లు ఫట్

అనూహ్య ఫలితాలు... కష్టపడతారనుకున్న భారత కుర్రాళ్లు శ్రీలంకను చిత్తు చేసి అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరితే... సులభంగా గెలుస్తారనుకున్న ధోనిసేన అదే శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడింది. అటు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో, ఇటు పుణేలో రెండు చోట్లా బ్యాట్స్‌మెన్‌కు గడ్డుకాలం ఎదురైనా... కుర్రాళ్లు తడబాటు లేకుండా పని పూర్తి చేస్తే... అనుభవజ్ఞులు మాత్రం చేతులెత్తేశారు.
 
* అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
* సెమీస్‌లో శ్రీలంకపై విజయం


మిర్‌పూర్: నాలుగో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు యువ భారత్ అడుగు దూరంలో నిలిచింది. అండర్-19 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న కుర్రాళ్లు అదే ఊపులో సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టారు. అన్‌మోల్ ప్రీత్ సింగ్ (92 బంతుల్లో 72; 6 ఫోర్లు; 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (71 బంతుల్లో 59; 6 ఫోర్లు; 1 సిక్స్) సముచిత ఆటతీరుతో మంగళవారం షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం జరిగే సెమీస్ విజేతతో... 14న భారత్ టైటిల్ కోసం పోరాడనుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులు సాధించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ (14) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా కెప్టెన్ ఇషాన్ (7) మళ్లీ నిరుత్సాహపరిచాడు. దీంతో 27 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించకపోవడంతో అన్‌మోల్, సర్ఫరాజ్ జోడి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారు.స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారీ సిక్స్‌తో సర్ఫరాజ్ ఈ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే కొద్దిసేపటికే పేలవ పుల్ షాట్‌కు అవుట్ అయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అన్‌మోల్ కూడా అర్ధ సెంచరీ సాధించి వాషింగ్టన్ సుందర్ (45 బంతుల్లో 43; 3 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచాడు. అర్మాన్ జాఫర్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు. ఫెర్నాండోకు నాలుగు.. కుమార, నిమేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
 
అనంతరం శ్రీలంక 42.4 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. అయితే భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో విఫలమైనా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో రాణించడంతో ఫలితం అనుకూలంగా వచ్చింది. తొలి ఓవర్‌లోనే అవేశ్ (2/41) వికెట్ తీసి లంకను దెబ్బతీశాడు. ఆ తర్వాత దాగర్ (3/21) పొదుపుగా బౌలింగ్ చేసి మిగతా పనికానిచ్చాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన లంక తరఫున మెండిస్ (67 బంతుల్లో 39; 4 ఫోర్లు), అషన్ (49 బంతుల్లో 38; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
 
స్కోరు వివరాలు:-

భారత్ అండర్-19 ఇన్నింగ్స్:
రిషబ్ (సి) డి సిల్వ (బి) ఫెర్నాండో 14; ఇషాన్ (సి) డి సిల్వ (బి) కుమార 7; అన్‌మోల్ ప్రీత్ (సి) డి సిల్వ (బి) నిమేష్ 72; సర్ఫరాజ్ (సి) ఆషన్ (బి) ఫెర్నాండో 59; సుందర్ (సి) డి సిల్వ (బి) నిమేష్ 43; అర్మాన్ (సి) అసలంక (బి) ఫెర్నాండో 29; లొమ్రోర్ (సి) కుమార (బి) ఫెర్నాండో 11; దాగర్ (సి) డి సిల్వ (బి) కుమార 17; బాథమ్ (రనౌట్) 1; అవేశ్ నాటౌట్ 1; ఖలీల్ అహ్మద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 267.
వికెట్ల పతనం: 1-23, 2-27, 3-123, 4-193, 5-218, 6-241, 7-254, 8-260, 9-264.
బౌలింగ్: ఫెర్నాండో 10-0-43-4; కుమార 10-0-50-2; నిమేష్ 10-0-50-2; డి సిల్వ 4-0-20-0; సిల్వ 7-0-31-0; మెండిస్ 1-0-10-0; అసలంక 8-0-59-0.

శ్రీలంక అండర్-19 ఇన్నింగ్స్: బండార (రనౌట్) 2; ఫెర్నాండో ఎల్బీడబ్ల్యు (బి) అవేశ్ 4; మెండిస్ (సి) సుందర్ (బి) దాగర్ 39; అసలంక (సి) లొమ్రోర్ (బి) బాథమ్ 6; ఆషన్ (రనౌట్) 38; డి సిల్వ (సి) రిషబ్ (బి) అవేశ్ 28; సిల్వ (బి) సుందర్ 24; హసరంగ డి సిల్వ (సి) అవేశ్ (బి) అహ్మద్ 8; నిమేశ్ (సి) సర్ఫరాజ్ (బి) దాగర్ 7; కుమార నాటౌట్ 0; ఫెర్నాండో (సి) అన్‌మోల్ (బి) దాగర్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 170.
వికెట్ల పతనం: 1-5, 2-13, 3-42, 4-91, 5-108, 6-133, 7-149, 8-170, 9-170, 10-170.
బౌలింగ్: అవేశ్ 9-0-41-2; ఖలీల్ అహ్మద్ 8-1-34-1; బాథమ్ 6.5-1-19-1; సుందర్ 7-0-27-1; సర్ఫరాజ్ 4.4-0-16-0; దాగర్ 5.4-0-21-3; లొమ్రోర్ 0.3-0-1-0; అన్‌మోల్ 1-0-6-0.
 
నేలకు దిగారు!

ఆస్ట్రేలియాలో అద్భుతం చేసి వచ్చిన భారత జట్టు సొంత మైదానంలో చతికిల పడింది. పరుగుల వరద పారిస్తారనుకున్న స్టార్ క్రికెటర్లంతా చేతులెత్తేశారు. ప్రత్యర్థి జట్టులో ఉంది కుర్రాళ్లే కదా అని ‘లైట్’ తీసుకున్నారేమో... ఘోరంగా భంగపడ్డారు. ఫలితంగా... తొలి టి20లో ధోనిసేన పరాభవాన్ని మూటగట్టుకుంది.
 
* తొలి టి20లో భారత్ ఓటమి  
* ఐదు వికెట్లతో లంక విజయం  
* రాణించిన రజిత, షనక  
* రెండో మ్యాచ్ శుక్రవారం

పుణే: అనుభవం లేకపోయినా... పరిస్థితులకు తగ్గట్టుగా చక్కటి ప్రణాళికతో ఆడిన శ్రీలంక జట్టు... ధోనిసేనను నేలకు దించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ (24 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రజిత (3/29), షనక (3/16)  భారత్‌ను దెబ్బ తీశారు. అనంతరం శ్రీలంక 18 ఓవర్లలో 5 వికెట్లకు 105 పరుగులు చేసింది. కెప్టెన్ చండీమల్ (35 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. అశ్విన్, నెహ్రా చెరో 2 వికెట్లు తీశారు. ఈ ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది.
 
టపటపా వికెట్లు
కెరీర్ తొలి మ్యాచ్‌ను లంక పేసర్ రజిత సంచలన రీతిలో ప్రారంభించాడు. ఇన్నింగ్స్ రెండో, ఆరో బంతులకు అతను రోహిత్ (0), రహానే (4)లను పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే రెండో ఓవర్‌ను తిసార మెయిడిన్‌గా వేయగా, రజిత వేసిన మరుసటి ఓవర్లో సున్నా వద్ద గుణతిలకే సునాయాస క్యాచ్ వదిలేయడంతో రైనా బతికిపోయాడు. కొద్ది సేపటికి రజిత బౌలింగ్‌లోనే మళ్లీ తప్పు చేయని గుణతిలక థర్డ్‌మ్యాన్‌లో క్యాచ్ పట్టడంతో ధావన్ (9) కూడా వెనుదిరిగాడు.

పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 3 వికెట్లకు 40 పరుగులకు చేరింది. ఏ మాత్రం అనుభవం లేని లంక కుర్ర బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించాడు. చక్కటి బంతులతో ఒక వైపు వికెట్లు తీస్తూ మరో వైపు పరుగులు కూడా ఇవ్వకుండా నిరోధించారు. షనక ఒకే ఓవర్లో రైనా (20 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), ధోని (2)లను అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లో యువరాజ్ (10) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

తొలి సారి బ్యాటింగ్ అవకాశం దక్కిన పాండ్యా (2) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఒక దశలో 35 బంతుల పాటు భారత్ బౌండరీ కొట్టలేకపోయింది!  చివర్లో నెహ్రా (6) సహాయంతో అశ్విన్ తొమ్మిదో వికెట్‌కు 28 పరుగులు జోడించడంతో స్కోరు 100 పరుగులు దాటినా ఏడు బంతుల ముందే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఐదో ఓవర్లో 13 పరుగులు మినహా భారత్ ఇన్నింగ్స్‌లో మరే ఓవర్‌లోనూ కనీసం పది పరుగులు రాలేదు.
 చండీమల్ దూకుడు
నెహ్రా ధాటికి శ్రీలంక కూడా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. డిక్‌వెలా (4), గుణతిలక (9) వెనుదిరగ్గా...పవర్‌ప్లేలో లంక 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే చండీమల్, కపుగెదెర (26 బంతుల్లో 25; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 42 బంతుల్లో 39 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. జడేజా ఓవర్లో 12 పరుగులు రాబట్టి దూకుడు పెంచిన లంక వేగంగా విజయం దిశగా దూసుకుపోయింది. తక్కువ వ్యవధిలో ఆ జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠను ఎదుర్కొన్నా...లక్ష్యం చిన్నది కావడంతో  ఇబ్బంది ఎదురు కాలేదు. సిరివర్దన (14 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు.
 
‘గత నెల రోజులుగా మేం ఆడుతున్న పిచ్‌లతో పోలిస్తే ఈ పిచ్ పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడి పేస్, బౌన్స్ చూస్తే భారత్‌లో కంటే ఇంగ్లండ్ తరహా వికెట్‌లాగా కనిపించింది. ఇలాంటి పిచ్‌పై  మేం తప్పుడు షాట్లు ఆడాం. ఆరంభంలో బౌలర్లకు అనుకూలించినప్పుడు మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సింది. తర్వాతి మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుంటాం’
- ధోని

రైనా కెరీర్‌లో ఇది 50వ టి20 అంతర్జాతీయ మ్యాచ్. ధోని (56) తర్వాత ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్ రైనా.
 
0 అంతర్జాతీయ టి20ల్లో 50 ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కనీసం ఒక్క అర్ధ సెంచరీ లేని ఏకైక బ్యాట్స్‌మన్ ధోని
 
ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడింది. లంక టాప్‌లోకి వచ్చింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిస్తే మళ్లీ భారత్ నంబర్‌వన్‌గా నిలుస్తుంది.
 
స్కోరు వివరాలు:-

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) చమీరా (బి) రజిత 0; ధావన్ (సి) గుణతిలక (బి) రజిత 9; రహానే (సి) చండీమల్ (బి) రజిత 4; రైనా (బి) షనక 20; యువరాజ్ (సి) అండ్ (బి) చమీరా 10; ధోని (సి) డిక్‌వెలా (బి) షనక 2; పాండ్యా (ఎల్బీ) (బి) షనక 2; జడేజా (ఎల్బీ) (బి) సేననాయకే 6; అశ్విన్ (నాటౌట్) 31; నెహ్రా (సి) సిరివర్దన (బి) చమీరా 6; బుమ్రా (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 101.
వికెట్ల పతనం: 1-0; 2-5; 3-32; 4-49; 5-51; 6-53; 7-58; 8-72; 9-100; 10-101.   
బౌలింగ్: రజిత 4-0-29-3; తిసార 3-1-10-0; సేనానాయకే 3-0-18-1; చమీరా 3.5-0-14-2; షనక 3-0-16-3; ప్రసన్న 2-0-11-0.  
 
శ్రీలంక ఇన్నింగ్స్: డిక్‌వెలా (సి) ధావన్ (బి) నెహ్రా 4; గుణతిలక (సి) ధావన్ (బి) నెహ్రా 9; చండీమల్ (ఎల్బీ) (బి) రైనా 35; కపుగెదెర (ఎల్బీ) (బి) అశ్విన్ 25; సిరివర్దన (నాటౌట్) 21; షనక (సి) రైనా (బి) అశ్విన్ 3; ప్రసన్న (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 105.
వికెట్ల పతనం: 1-4; 2-23; 3-62; 4-84; 5-91.
బౌలింగ్: నెహ్రా 3-0-21-2; బుమ్రా 4-1-19-0; జడేజా 3-0-18-0; పాండ్యా 3-0-18-0; అశ్విన్ 3-0-13-2; రైనా 2-0-13-1.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement