భారత జట్టు
‘విరాట్’ అనే పేరులోని విశిష్టతను నిలిపేందుకే విరాట్ కోహ్లి పుట్టినట్లున్నాడు. అతడు బ్యాట్‌తో రికార్డులు మాత్రమే సృష్టించడం లేదు. రోజురోజుకూ భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ... అంతకుముందెన్నడూ లేని ఘనతలను సాధించి పెడుతున్నాడు. గతంలో ఎందరో గొప్ప ఆటగాళ్లున్నప్పటికీ మన జట్లు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలుచుకోలేక పోయాయి. ఆత్మవిశ్వాసం, సామర్థ్యానికి లోటు లేకున్నా వారికి ఒక్క ‘నాకౌట్ పంచ్’ కొరవడింది. అలాంటి పంచ్ ఈసారి కోహ్లికి తన బౌలర్ల ద్వారా లభించింది. అద్భుతంగా రాణించి సఫారీ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలు చేశారు. మూడు టెస్టుల్లో 60 వికెట్లు పడగొట్టారు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి రావడం, ప్రొటీస్ బౌలింగ్‌ను సరిగా అంచనా వేయలేకపోవడం, కోహ్లి త్వరగా అవుటవడమే తొలి రెండు టెస్టుల పరాజయానికి కారణం. కొత్త బంతి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా... స్పిన్నర్ల ప్రదర్శన ముచ్చటేసింది. భువీ, బుమ్రా, షమీల బౌన్సర్లను కాచుకునేందుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ కిందకు వంగాల్సి వచ్చింది. విదేశాల్లో ఇలాంటి పరిస్థితిని గతంలో భారత బ్యాట్స్‌మెన్ ఎదుర్కొనేవారు.
ఇప్పుడిక ఆధునిక ఫార్మాట్ క్రికెట్ సమరం వచ్చేసింది. ఇందులో అనుభవజ్ఙుడైన జేపీ డుమిని సారథ్యంలో దక్షిణాఫ్రికా బరిలో దిగనుంది. వన్డే పరాభవాల నుంచి ఆ జట్టు బయటపడాలని భావిస్తోంది. టి20ల్లో కొన్ని బంతుల వ్యవధిలో ఫలితం మారిపోతుంటుంది. నరాలు తెగే ఒత్తిడిని జయించిన జట్టే ఇక్కడ విజేతగా నిలుస్తుంది. భారత జట్టు ఆటతీరు గర్వించే విధంగా సాగుతోంది. వారీ జైత్రయాత్రను చివరి వరకు కొనసాగిస్తారని ఆశిద్దాం. సుదీర్ఘ పర్యటన ముగింపునకు వచ్చినందున భారత ఆటగాళ్ల మనసు ఇంటివైపు లాగి ఏకాగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. అయితే... కోహ్లి సారథ్యంలో అందుకు అవకాశం తక్కువ.
Comments
Please login to add a commentAdd a comment