చేయి  చేయి  కలిపి...  | Virat Kohli's Team India have proved they can beat anyone | Sakshi
Sakshi News home page

చేయి  చేయి  కలిపి... 

Published Thu, Feb 15 2018 1:12 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

Virat Kohli's Team India have proved they can beat anyone - Sakshi

విరాట్‌ కోహ్లి,చహల్, కుల్దీప్‌, శిఖర్‌ ధావన్

గత ఆరు పర్యటనలలో ఐదే విజయాలు. 
నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలో గెలిచింది కేవలం నాలుగింటిలోనే... 
రెండు ముక్కోణపు వన్డే టోర్నీల్లోని 8 మ్యాచ్‌ల్లో ఒక్క గెలుపుతో సరి... 
కానీ ఈసారి ఒక్క సిరీస్‌లోనే నాలుగు విజయాలు! 
అన్నీ అద్వితీయమైనవే. సంపూర్ణ ఆధిపత్యంతో సాధించినవే! 
చివరి ఆరు మ్యాచ్‌ల్లో (టెస్టు సహా) ఒక్కటే ఓటమి! 
అది కూడా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో! 

సాక్షి క్రీడావిభాగం:  సఫారీ గడ్డపై వన్డేల్లో టీమిండియా జోరును వర్ణించేందుకు ఇంతకుమించిన గణాంకాలు ఇంకేమీ ఉండవు. అంతకుముందు రెండు టెస్టులు ఓడి, మూడో టెస్టులో పోరాడి గెలిచినా... వన్డేలకు వచ్చేసరికి మన జట్టుపై పెద్దగా ఆశల్లేవు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఓడించడం అంత తేలికేం కాదనేది అభిమానుల అంచనా. సిరీస్‌ గెలవడం కాదు కాని, భారీ తేడాతో ఓడిపోకుంటే చాలని భావించారు. కానీ అంతా తారుమారైంది. భారత్‌ దూసుకెళ్తుంటే... ప్రొటీస్‌ ‘ఒక్క గెలుపు’ కోసమే కిందామీద పడింది. తొలుత బౌలింగ్‌కు దిగితే ప్రత్యర్థిని కట్టడి చేసి... లక్ష్యాన్ని అవలీలగా ఛేదించడం, అదే బ్యాటింగ్‌ చేస్తే భారీ స్కోరు సాధించి, ఆనక ప్రత్యర్థిని చుట్టేయడం... ఇలా కోహ్లి సేన జైత్రయాత్ర ఓ పద్ధతిగా సాగిపోతోంది. చూసేందుకు జట్టుగా 11 మంది కనిపిస్తున్నా.. ఈ విజయాల్లో నలుగురు ఆటగాళ్లే నాలుగు మూల స్తంభాలుగా నిలిచారు. వారే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌. 

బ్యాట్‌తో వారు... 
34, 93, 140, 158... ఇవీ తొలి నాలుగు వన్డేల్లో రెండో వికెట్‌కు ధావన్, కోహ్లి భాగస్వామ్యాలు. సాధికారికంగా ఆడుతూ మ్యాచ్‌ మ్యాచ్‌కు ఈ జంట పాతుకుపోగా వారు జత చేస్తున్న పరుగులు అలాగే పెరుగుతూ వెళ్లాయి. మరో ఓపెనర్, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ త్వరగా అవుటవుతుండటంతో తమపై పడిన భారాన్ని వీరిద్దరూ సమర్థంగా మోశారు. అయిదు మ్యాచ్‌ల్లో జట్టు మొత్తం పరుగుల్లో వీరివే 58 శాతం కావడమే దీనికి నిదర్శనం. కోహ్లి నిలకడ ఎప్పుడూ ఉండేదే. అయితే... ఈ సిరీస్‌లో ధావన్‌ ఆట కెప్టెన్‌కు దీటుగా సాగుతోంది. చక్కటి ఆత్మవిశ్వాసంతో షాట్లు కొడుతూ మొదటి మ్యాచ్‌ నుంచి మంచి టచ్‌లో కనిపిస్తున్న అతడు 76.25 సగటుతో ఇప్పటివరకు 305 పరుగులు చేశాడు. నాలుగో వన్డేలో అతడి శతకమైతే పాత ధావన్‌ను గుర్తుచేసింది. వైఫల్యమన్నదే లేకుండా సాగుతోన్న విరాట్‌ కోహ్లి 143 సగటుతో 429 పరుగులు చేశాడు. జట్టు మొత్తం పరుగుల్లో ఇతడివి 34 శాతం ఉండటం విశేషం. 

బంతితో వీరు... 
వర్షం కారణంగా ఓవర్లు కుదించిన నాలుగో వన్డేలో తడబడటాన్ని మినహాయిస్తే చహల్‌ (14 వికెట్లు), కుల్దీప్‌ (16 వికెట్లు) ప్రదర్శన అత్యున్నత స్థాయిలో సాగుతోంది. బుమ్రా... తొలి వికెట్‌ తీసి బ్రేక్‌ ఇస్తుండగా మిగతావారి సంగతిని స్పిన్నర్లు చూసుకుంటున్నారు. గత మ్యాచ్‌ చేదు అనుభవాన్ని చెరిపేస్తూ పోర్ట్‌ ఎలిజబెత్‌లో చహల్‌ మళ్లీ గాడిన పడ్డాడు. గంటకు 85 కి.మీ. వేగం దాటని స్లో స్పిన్‌తో ఈ ద్వయం తమ ఓవర్ల కోటాను పూర్తి చేస్తుండటంతో ప్రొటీస్‌కు అదనపు పరుగుల లబ్ధి కూడా దక్కడం లేదు. ప్రత్యర్థికి కొరకరాని కొయ్యలుగా మారిన వీరు అయిదు వన్డేల్లో 30 వికెట్లు నేలకూల్చారు. అసలే గాయాలతో కీలక బ్యాట్స్‌మెన్‌ దూరమైన సఫారీలకు ఈ ఇద్దరిని ఎదుర్కోవడం తలకుమించిన భారమే అవుతోంది. ఈ సిరీస్‌లో మన జట్టు బౌలింగ్‌లో మరో సానుకూలాంశం అదనపు పరుగుల కట్టడి. తొలి వన్డేలో 17 ఎక్స్‌ట్రాలు ఇచ్చిన బౌలర్లు తర్వాతి మ్యాచ్‌ల్లో 1, 4, 11, 8 పరుగులు మాత్రమే ఇచ్చి క్రమశిక్షణ చాటుకున్నారు. 

విలువ చాటిన రోహిత్‌... ఉనికి నిలబెట్టుకున్న పాండ్యా 
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆటతో కాకుండా తుది జట్టులో చోటు, వైఫల్యాలతో ఎక్కువగా విమర్శలపాలయ్యాడు రోహిత్‌శర్మ. వైస్‌ కెప్టెన్‌ పూర్తిగా నిరాశపరిచాడు. వన్డేల్లో ఇక్కడ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించని అతడు... అయిదో వన్డేలో ఏకంగా శతకం బాది సిరీస్‌ విజయాన్ని అందించాడు. తడబడుతూనే అయినా కఠిన పరీక్షలాంటి సమయంలో చేసిన ఈ సెంచరీ రోహిత్‌లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక పోర్ట్‌ ఎలిజబెత్‌లో కీలక దశలో డుమిని, డివిలియర్స్‌ వంటి ప్రమాదకర ఆటగాళ్లను త్వరగా అవుట్‌ చేసి బంతితో, బ్యాట్‌తో తన సత్తాపై రేకెత్తుతున్న అనుమానాలను పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పటాపంచలు చేశాడు. అంతేగాక... విజయానికి అడ్డుగోడలా మారిన ఆమ్లాను రనౌట్‌ చేసి ఆటనే మలుపుతిప్పాడు. 

మిగతా వారి సహాయ పాత్ర 
ధోని, రహానే, అయ్యర్, భువనేశ్వర్‌... జట్టు గెలుపులో పూర్తిస్థాయిలో భాగస్వాములు కానిది వీరే. రెండు, మూడు అవకాశాలే వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయ్యర్‌ను కొత్తవాడని వదిలేసినా... ధోని, రహానే ఒక్క మంచి ఇన్నింగ్స్‌కే పరిమితమయ్యారు. మోస్తరుగా ఆడుతున్న భువీ పరుగులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వీరు కూడా రాణిస్తే ఆరో వన్డేలోనూ భారత్‌ జయభేరి మోగించడం ఖాయం. తద్వారా విదేశాల్లో 5–1 తేడాతో వన్డే సిరీస్‌ గెల్చుకున్న జట్టుగానూ చరిత్రకెక్కుతుంది. 

అక్కడ సర్దుకుంటే... 
ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇవ్వనున్న 2019 ప్రపంచకప్‌నకు ఏడాదిన్నర సమయం కూడా లేదు. కోహ్లి అంచనా ప్రకారం దాదాపు ఇదే జట్టు ప్రపంచకప్‌ బరిలో దిగుతుంది. పేస్, స్పిన్‌ విభాగంలో ఎవరెవరు ఉంటారో తేలిపోయింది. బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌పైనే ఆందోళనంతా. అందుకని మనీశ్‌ పాండే, రహానే, జాదవ్, అయ్యర్‌లలో 4, 5 స్థానాలకు సమర్థులెవరో ఇప్పుడే తేల్చుకోవాలి. వారికి మరిన్ని అవకాశాలిచ్చి కుదురుకునేలా చూడాలి. దీంతో జట్టు దుర్బేధ్యంగా మారుతుంది.                 

37   సారథిగా మొదటి 48 వన్డేల్లో కోహ్లి సాధించిన విజయాలు. క్లైవ్‌ లాయిడ్, హాన్సీ క్రానే, రికీ పాంటింగ్‌ల రికార్డును కోహ్లి సమం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement