తొలి టెస్టులో భారత్ పరాజయం పాలైనా ఇప్పటికీ సిరీస్ గెలిచే అవకాశం జట్టుకు ఉంది. మూడు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడాక కోలుకోవడం ఎప్పుడైనా కష్టమే. అయితే రెండేళ్ల క్రితం ఇదే భారత జట్టు శ్రీలంకలో దానిని చేసి చూపించింది. ఇప్పుడు దానిని పునరావృతం చేయవచ్చు కూడా. దక్షిణాఫ్రికాపై విజయం సాధించాలనే కల నిజం కావాలంటే జట్టు బ్యాట్స్‌మెన్ అత్యద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యమే దెబ్బ తీసిందని అంగీకరించాల్సిందే. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదనేది వాస్తవమే అయినా మరీ ఆడలేనంత ఘోరంగా కూడా ఏమీ లేదు. మనోళ్ల బాడీ లాంగ్వేజ్ ఎంత ఇబ్బందికరంగా అనిపించిందంటే కనీసం బ్యాటింగ్‌లో కాలు కదిపి కూడా ఆడలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌లలో కూడా స్వింగ్ మాయలో పడిపోవడంతో వికెట్ల పతనం కొనసాగింది. ఇప్పుడైనా వారు తమ నిస్సత్తువను దూరం చేసి ఆత్మవిశ్వాసంతో గట్టిగా నిలబడాల్సి ఉంది.
టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనలేమిటో నాకు తెలీదు కానీ జట్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సింది. ప్రతీసారి మనం విదేశాల్లో సిరీస్ తొలి టెస్టులో ఇబ్బంది పడుతున్నామనే ఒక్క కారణం దానికి చాలు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొంటున్నప్పుడు మనలో కనిపించిన అపరిచిత భావన అంతకుముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడి ఉంటే చాలా వరకు దూరమయ్యేది. నెట్ ప్రాక్టీస్‌లో ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న ఒక బౌలర్‌తో బౌలింగ్ చేయించుకుంటే మోర్నీ మోర్కెల్ బంతులు ఎలా వస్తున్నాయో ఒక అవగాహన వచ్చేది. దురదృష్టవశాత్తూ సన్నాహాలు మరీ నాసిరకంగా ఉన్నాయి. మరోవైపు ఆప్షనల్ ప్రాక్టీస్ అనే విషయాన్నే పూర్తిగా తీసి పడేయాలి. కేవలం కోచ్, కెప్టెన్ మాత్రం ఎవరికి విశ్రాంతి అవసరమో, ఎవరికి అవసరం లేదో నిర్ణయించాలి తప్ప ఆటగాళ్లు తమ ఇష్టానుసారం చేయడం కాదు. మీ ఇష్టం అంటూ వదిలేస్తే చాలా మంది మ్యాచ్‌కు ముందు రోజు, ఆపై మ్యాచ్ తర్వాతి రోజు కూడా ప్రాక్టీస్ చేయకపోవడం మనం చూశాం.
జట్టు పర్యటనలకు వెళ్లినప్పుడు ఆటగాళ్ల వెంట వారి కుటుంబ సభ్యులు ఉండాలనే అంశానికి నేను ఎప్పటి నుంచో మద్దతు పలుకుతున్నా. ఆఫీసుకు వెళ్లేవారు సాయంత్రం కాగానే కుటుంబం చెంతకు చేరుతుంటే క్రికెటర్లకు ఆ అవకాశం ఎందుకు ఉండరాదనేది నా అభిప్రాయం. అయితే ఆఫీసు పనివేళల్లో ఎవరైనా ఆఫీసుకు సంబంధించిన పని చేయాల్సిందే. ఇక్కడ ఆఫీస్ అంటే టెస్టు కోసం ప్రాక్టీస్ చేయడం, ఒక పెద్ద టెస్టుకు ముందు సరైన రీతిలో సిద్ధం కావడం. అయితే ఇది మాత్రం సక్రమంగా జరగడం లేదు. టెస్టు ముగిసిన తర్వాతి రోజు అంటే వాస్తవంగా అది మ్యాచ్ ఐదో రోజు కూడా ఆప్షనల్ ప్రాక్టీస్ అవకాశం ఇవ్వడం నన్ను నిజంగా నిరాశపర్చింది. ఆ రోజు రిజర్వ్ బెంచీలో ఉన్న ఆరుగురిలో నలుగురు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. వర్షం కారణంగా మూడో రోజు అసలు ఆటే జరగని స్థితిలో అలసిపోవడం అనే మాటలకు కూడా తావు లేదు. నిజానికి పేస్ బౌలర్లు మినహా మిగతా వారంతా ప్రాక్టీస్‌కు హాజరు కావాల్సింది. టెస్టు ముగియగానే తాము ఆడిన పిచ్‌పై నీళ్లు చల్లకుండా అలాగే ఉంచమని గ్రౌండ్స్‌మన్‌కు చెప్పాల్సింది. తమను ఇబ్బంది పెట్టిన పిచ్‌పై తిరిగొచ్చి బ్యాట్స్‌మెన్ మళ్లీ సాధన చేయాల్సింది. తర్వాతి రోజు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేసినా, చేయకపోయినా సమస్య లేదు. ఓటమి తర్వాత తప్పులను సరిదిద్దుకునేందుకు కొంత అదనంగా శ్రమించక తప్పదు.
అయితే ఇప్పుడు జరిగిందంతా గతం. గొప్పవాళ్లకు కూడా ఇది సహజమే అన్నట్లు న్యూలాండ్స్‌లో జరిగిన దానిని అరుదైన ఘటనగా నిరూపించాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉంది. దెబ్బతిన్న పులిలా లేచి మళ్లీ వారు విజృంభిస్తారని ఆశిస్తున్నా. ఈ జట్టు ఇప్పటికీ వరల్డ్ నంబర్‌వన్ అని మరచిపోవద్దు. ఇక తప్పులకు ఎలాంటి అవకాశం ఇవ్వవద్దు.
నంబర్‌వన్ స్థాయిలో ఆడాలి
Published Sat, Jan 13 2018 12:57 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment