సెంచూరియన్‌లో ఇంకా సెంచరీ మోత మోగలేదు కానీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అంతకంటే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు...వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగి ముందుండి జట్టును నడిపించాడు... తుదికంటా నిలిచి రెండో టెస్టులో మన ఆశలు నిలబెట్టాడు...మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించినా, కోహ్లి అడ్డుగోడ రెండో రోజును పూర్తిగా వారిది కాకుండా చేసింది. మొత్తంగా చూస్తే సఫారీలను తొందరగా ఆలౌట్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో కుప్పకూలని భారత్... కొన్ని అదనపు పరుగులు జోడించడంతో పాటు ఐదు ప్రధాన వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా ఆదివారం ఆటను చెరి సగం పంచుకున్నాయి. బౌలింగ్‌కు పెద్దగా అనుకూలించని పిచ్‌పై మూడో రోజు పాండ్యా, అశ్విన్ అండతో కోహ్లి చెలరేగితే భారత్‌కు మంచి ఆధిక్యం దక్కవచ్చు.
సెంచూరియన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు అనేక మలుపుల తర్వాత రెండో రోజు దాదాపు సమాన స్థితిలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లి (130 బంతుల్లో 85 బ్యాటింగ్; 8 ఫోర్లు) సెంచరీకి చేరువ కాగా, హార్దిక్ పాండ్యా (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. టీమిండియా ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (142 బంతుల్లో 63; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...అశ్విన్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి.
23.5 ఓవర్లలో...
ఓవర్‌నైట్ స్కోరు 269/6తో ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ ముందుండి నడిపించాడు. 27 పరుగుల వద్ద డు ప్లెసిస్ ఎల్బీ అవుట్ కోసం అప్పీల్ చేసి భారత్ రివ్యూ కోల్పోయింది. ఎట్టకేలకు మహరాజ్ (18)ను షమీ అవుట్ చేయడంతో 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇది షమీకి 100వ వికెట్ కావడం విశేషం. అయితే ఆ తర్వాత భారత్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా సఫారీలకు కలిసొచ్చింది. అశ్విన్ బౌలింగ్‌లో 1 పరుగు వద్ద వరుస బంతుల్లో రబడ ఇచ్చిన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు. ముందుగా స్లిప్‌లో కోహ్లి పొరపాటు చేయగా, షమీతో సమన్వయ లోపంతో పాండ్యా చేతుల్లో పడిన బంతిని వదిలేశాడు. 54 వద్ద డుప్లెసిస్ క్యాచ్‌ను కూడా పార్థివ్ నేలపాలు చేశాడు. కెప్టెన్‌కు అండగా నిలిచిన రబడ (11)ను ఇషాంత్ అవుట్ చేయడంతో 42 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత డు ప్లెసిస్‌ను కూడా ఇషాంతే పెవిలియన్ పంపించగా...తర్వాతి ఓవర్లో మోర్కెల్ (6) వికెట్‌తో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు ఆ జట్టు మొత్తం 66 పరుగులు జోడించింది.
వరుస బంతుల్లో...
భారత జట్టుకు మరోసారి పేలవమైన ఆరంభం లభించింది. ధావన్ స్థానంలో చోటు దక్కించుకున్న రాహుల్ (10) తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చలేకపోయాడు. మోర్కెల్ బౌలింగ్‌లో పేలవ షాట్‌తో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి బంతికే భారత్‌కు మరో షాక్ తగిలింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే పుజారా (0) లేని సింగిల్ కోసం ప్రయత్నించి ఇన్‌గిడి త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, విజయ్ (126 బంతుల్లో 46; 6 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కోహ్లి ఆరంభంనుంచే ధాటిని ప్రదర్శించగా, విజయ్ తనదైన శైలిలో నెమ్మదిగా ఆడాడు. పిచ్ మరీ ఇబ్బందికరంగా లేకపోవడంతో పాటు దక్షిణాఫ్రికా బౌలింగ్ కూడా అసాధారణంగా ఏమీ లేకపోవడంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. మధ్యలో కొన్ని మంచి బంతులు పడ్డా...పెద్ద ఇబ్బంది లేకపోవడంతో భాగస్వామ్యం 50 పరుగులు దాటింది.
కోహ్లి నిలకడ...
టీ విరామం తర్వాత కోహ్లి 68 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మహరాజ్ బౌలింగ్‌లో పదే పదే బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించిన విజయ్ చివరకు అదే బంతికి అవుట్ కాగా, రోహిత్ శర్మ (10) టెస్టుల్లో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. ఈ దశలో పార్థివ్ (19) కొద్ది సేపు కోహ్లికి అండగా నిలిచినా, అతని ఆట కూడా ఎక్కువ సేపు సాగలేదు. ఇన్‌గిడి తొలి వికెట్‌గా అతను వెనుదిరిగాడు. ఈ దశలో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా...భారత బ్యాట్స్‌మెన్ మరో ప్రమాదం లేకుండా బయట పడ్డారు. కోహ్లి, పాండ్యా మరో 7.2 ఓవర్లు జాగ్రత్తగా ఆడటంతో దక్షిణాఫ్రికా మరో వికెట్ తీయడంలో విఫలమైంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే భావనతో దక్షిణాఫ్రికా ఈ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను కేశవ్ మహరాజ్‌తో వేయించింది. ఎప్పుడో 1912లో దక్షిణాఫ్రికా ఇలా స్పిన్నర్ (ఆబ్రీ ఫాల్క్‌నర్)తో తొలి ఇన్నింగ్స్ బౌలింగ్ ప్రారంభించిన తర్వాత 106 ఏళ్లకు ఇలా చేయడం విశేషం.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 31; మార్క్‌రమ్ (సి) పార్థివ్ పటేల్ (బి) అశ్విన్ 94; ఆమ్లా (రనౌట్) 82; డివిలియర్స్ (బి) ఇషాంత్ శర్మ 20; డు ప్లెసిస్ (బి) ఇషాంత్ శర్మ 63; డికాక్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 0; ఫిలాండర్ (రనౌట్) 0; కేశవ్ మహారాజ్ (సి) పార్థివ్ పటేల్ (బి) షమీ 18; రబడ (సి) పాండ్యా (బి) ఇషాంత్ శర్మ 11; మోర్కెల్ (సి) విజయ్ (బి) అశ్విన్ 6; ఇన్‌గిడి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (113.5 ఓవర్లలో) 335 ఆలౌట్.
వికెట్ల పతనం: 1–85, 2–148, 3–199, 4–246, 5–250, 6–251, 7–282, 8–324, 9–333, 10–335.
బౌలింగ్: బుమ్రా 22–6–60–0, షమీ 15–2–58–1, ఇషాంత్ శర్మ 22–4–46–3, పాండ్యా 16–4–50–0, అశ్విన్ 38.5–10–113–4.
భారత్ ఇన్నింగ్స్: విజయ్ (సి) డికాక్ (బి) మహారాజ్ 46; రాహుల్ (సి అండ్ బి) మోర్కెల్ 10; పుజారా (రనౌట్) 0; కోహ్లి బ్యాటింగ్ 85; రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ (బి) రబడ 10; పార్థివ్ పటేల్ (సి) డికాక్ (బి) ఇన్‌గిడి 19; పాండ్యా బ్యాటింగ్ 11; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (61 ఓవర్లలో 5 వికెట్లకు) 183.
వికెట్ల పతనం: 1–28, 2–28, 3–107, 4–132, 5–164.
బౌలింగ్: కేశవ్ మహారాజ్ 16–1–53–1, మోర్కెల్ 15–3–47–1, ఫిలాండర్ 9–3–23–0, రబడ 12–0–33–1, ఇన్‌గిడి 9–2–26–1.
7 షమీ టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. భారత్‌నుంచి ఈ మైలురాయి చేరిన ఏడో ఫాస్ట్ బౌలర్ అతను. 29 టెస్టుల్లో ఈ ఘనత సాధించిన అతను కపిల్ (25), ఇర్ఫాన్ పఠాన్ (28) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment