కోహ్లి కదం తొక్కగా... | India vs Sri Lanka, 2nd Test Day 3: Virat Kohli's 5th Double Century | Sakshi
Sakshi News home page

కోహ్లి కదం తొక్కగా...

Published Mon, Nov 27 2017 1:23 AM | Last Updated on Mon, Nov 27 2017 1:48 AM

India vs Sri Lanka, 2nd Test Day 3: Virat Kohli's 5th Double Century - Sakshi - Sakshi

విరాట్‌ కోహ్లి ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో మళ్లీ పరుగుల వరద పారించాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌ చేయడం ఇంత సులువా అన్నట్లుగా చూడచక్కటి షాట్లతో మురిపించాడు. గత మ్యాచ్‌ సెంచరీ జోరును కొనసాగిస్తూ ఈసారి ‘డబుల్‌’తో అదరగొట్టగా... నేనూ టెస్టు ఆడగలనంటూ మరోవైపు నుంచి రోహిత్‌ శర్మ శతకంతో అండగా నిలిచాడు. మూడో రోజు వీరిద్దరి దెబ్బకు లంక కుదేలైంది. గతి తప్పిన బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, మైదానంలో ఆటగాళ్లలో అలసట, అసహనం... వెరసి శ్రీలంక ఓటమిని ఆహ్వానిస్తోంది. గత మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బ తీసిన ఇద్దరు పేసర్లు ఈ సారి మన బ్యాటింగ్‌ జోరుకు పరుగులు ఇవ్వడంలో సెంచరీ దాటగా... కోహ్లితో పోటీ పడిన దిల్‌రువాన్‌ పెరీరా ఏకంగా డబుల్‌ సెంచరీ చేసేశాడు. 405 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఇప్పటికే మ్యాచ్‌ను గుప్పిట బిగించిన టీమిండియా... నాలుగో రోజే నాగ్‌పూర్‌లో ఆట ముగించే అవకాశం ఉంది.   

నాగ్‌పూర్‌: తొలి టెస్టులో దురదృష్టవశాత్తూ తమ చేజారిన విజయాన్ని ఈసారి భారత్‌ ఒడిసి పట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఇక్కడి జామ్‌తా మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి సేన భారీ గెలుపుపై కన్నేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు వెనుకబడిన శ్రీలంక మ్యాచ్‌ మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కోల్పోయి 21 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 384 పరుగులు వెనుకబడి ఉంది. శ్రీలంక ఫామ్, భారత బౌలర్ల జోరు చూస్తే ఆ జట్టు నాలుగో రోజంతా నిలబడటం కూడా కష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 610 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. విరాట్‌ కోహ్లి (267 బంతుల్లో 213; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో ఐదో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఇది అతని కెరీర్‌లో 19వ శతకం కావడం విశేషం. కోహ్లితో పాటు రోహిత్‌ శర్మ (160 బంతుల్లో 102 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టెస్టుల్లో మూడో సెంచరీ సాధించడంతో భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 173 పరుగులు జోడించడం విశేషం. మొత్తంగా మూడో రోజు 78.1 ఓవర్లు ఆడిన భారత్‌ 298 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో దిల్‌రువాన్‌ పెరీరాకు 3 వికెట్లు దక్కాయి.  

కొనసాగిన జోరు... 
మూడో రోజు ఆరంభంలోనే భారత్‌ ఆట జట్టు ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 312/2తో ఆదివారం బరిలోకి దిగిన భారత్‌ రోజంతా లంకపై తమ ఆధిపత్యం ప్రదర్శించింది. పుజారా తనదైన శైలిలో ఆడుతూ తొలి పరుగు కోసం 23 బంతులు తీసుకోగా... కోహ్లి మాత్రం లక్మల్‌ ఓవర్లో రెండు బౌండరీలు బాది దూకుడుకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే లక్మల్‌ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ దిశగా సింగిల్‌ తీసి విరాట్‌ 130 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే లంచ్‌కు కాస్త ముందు షనక వేసిన యార్కర్‌కు పుజారా (362 బంతుల్లో 143; 14 ఫోర్లు) బౌల్డ్‌ కావడంతో 183 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. 29 ఓవర్ల తొలి సెషన్‌లో భారత్‌ 92 పరుగులు జోడించింది. అయితే విరామం తర్వాత వెంటనే రహానే (2) వికెట్‌ తీయడంలో లంక సఫలమైంది.  

ఇద్దరూ పోటీగా... 
కోహ్లి, రోహిత్‌ జోడి జత కలిసిన తర్వాత భారత్‌ స్కోరు వేగం మరింత పెరిగింది. వీరిద్దరు వన్డే శైలిలో ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించారు. 13 నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగిన రోహిత్‌ తనకు దక్కిన అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. పెరీరా బౌలిం గ్‌లో ముందుకొచ్చి లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ బాదడంతో 193 బంతుల్లోనే కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. మరోవైపు హెరాత్‌ బౌలింగ్‌లో బౌండరీలతో చెలరేగిన రోహిత్‌ 98 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. టీ విరామం ముగిసిన తర్వాత కాసేపటికి పెరీరా బౌలింగ్‌లో సిక్సర్‌తో 195కు చేరిన కోహ్లి, అతని తర్వాతి ఓవర్‌లో లాంగాన్‌ దిశగా సింగిల్‌ తీసి డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరకు పెరీరా బౌలింగ్‌లోనే కోహ్లి అవుట్‌ కాగా...అశ్విన్‌ (5) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అయితే మరో ఎండ్‌లో వేగం పెంచిన రోహిత్‌ షనక బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి సెంచరీని అందుకున్నాడు. దాంతో భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.  

ఇషాంత్‌ దెబ్బకు... 
రెండు రోజుల పాటు ఫీల్డింగ్‌ చేసిన తర్వాత తీవ్రంగా అలసిన లంకకు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఇషాంత్‌ వేసిన రెండో బంతిని ఆడకుండా వదిలేసి సమరవిక్రమ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. అయితే కరుణరత్నే, తిరిమన్నె మిగిలిన 8.4 ఓవర్లను జాగ్రత్తగా ఆడి మరో ప్రమాదం లేకుండా రోజును ముగించారు.  

స్కోరు వివరాలు  
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 205; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) గమగే 7; విజయ్‌ (సి) పెరీరా (బి) హెరాత్‌ 128; పుజారా (బి) షనక 143; కోహ్లి (సి) తిరిమన్నె (బి) పెరీరా 213; రహానే (సి) కరుణరత్నే (బి) పెరీరా 2; రోహిత్‌ (నాటౌట్‌) 102; అశ్విన్‌ (బి) పెరీరా 5; సాహా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (176.1 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్‌) 610. 

వికెట్ల పతనం: 1–7; 2–216; 3–399; 4–410; 5–583; 6–597.
 
బౌలింగ్‌: లక్మల్‌ 29–2–111–0; గమగే 35–8–97–1; హెరాత్‌ 39–11–81–1; షనక 26.1–4–103–1; పెరీరా 45–2–202–3; కరుణరత్నే 2–0–8–0. 

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: సమరవిక్రమ (బి) ఇషాంత్‌ 0; కరుణరత్నే (బ్యాటింగ్‌) 11; తిరిమన్నే (బ్యాటింగ్‌) 9; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (9 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 21.  

వికెట్ల పతనం: 1–0. 

బౌలింగ్‌: ఇషాంత్‌ 4–1–15–1; అశ్విన్‌ 4–3–5–0; జడేజా 1–1–0–0.

3 రోహిత్‌ శర్మ కెరీర్‌లో (22వ టెస్టు) ఇది మూడో సెంచరీ. 2013లో తన తొలి రెండు టెస్టుల్లోనే రెండు శతకాలు బాదిన రోహిత్‌... నాలుగేళ్ల తర్వాత ఈ సెంచరీ చేయడానికి ముందు మిగిలిన 19 టెస్టుల్లో 7 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.   

వీర విరాట్‌...
విరాట్‌ కోహ్లి సెంచరీల మోత మోగించడం కొత్త కాదు. ప్రతీ మ్యాచ్‌కు ఒక్కో కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకోవడం కూడా కొత్త కాదు. అదే జోరు, అదే శైలి, షాట్లు ఆడేటప్పుడు ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం, సాధికారత... తనకు మాత్రమే సాధ్యం అనిపించేలా సాగుతున్న ఆట. కోల్‌కతా టెస్టులో సహచరుల అండ కరువైన కఠిన పరిస్థితుల్లో సెంచరీ చేయగలిగిన అతను... 216/2 స్కోరుతో అప్పటికే ఆధిక్యం కూడా లభించేసి అంతా బాగున్న స్థితిలో బరిలోకి దిగి స్కోరు చేయకుంటే ఆశ్చర్యపడాలి కానీ ఈ తరహాలో పరుగుల వరద పారించడం అనూహ్యం ఏమీ కాదు! అయితే ఇక్కడ కూడా అతను తనదైన క్లాస్‌ను చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, అప్పటికే కుంగిపోయిన లంకన్లను మరింత చావు దెబ్బ కొట్టేలా నిర్దాక్షిణ్యంగా సాగింది. చెత్త బంతులను బౌండరీకి తరలించడమే కాదు... ఫీల్డర్ల మధ్య ఖాళీలను సరిగ్గా అంచనా వేస్తూ డీప్‌లోకి కొట్టి సింగిల్స్, డబుల్స్‌ కూడా అతను చురుగ్గా తీస్తూ పోయాడు. పెరీరా బౌలింగ్‌లో 111 వద్ద వెనక్కి జరిగి మిడాఫ్‌ మీదుగా కొట్టిన ఫోర్, 188 వద్ద అతని బౌలింగ్‌లోనే ముందుకొచ్చి మిడ్‌ వికెట్‌ మీదుగా బాదిన బౌండరీ ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దాదాపు 80 స్ట్రైక్‌రేట్‌తో సాగిన కోహ్లి ఇన్నింగ్స్‌ అతని ప్రత్యేకతను మరోసారి చూపించింది.

 కోహ్లి క్రీజ్‌లో ఉన్న సమయంలో మరో ఎండ్‌లో ఇతర బ్యాట్స్‌మెన్‌ ప్లస్‌ ఎక్స్‌ట్రాలు కలిపి చూస్తే 299 బంతుల్లో 51.51 స్ట్రైక్‌రేట్‌తో 154 పరుగులే వచ్చాయంటే కోహ్లి ఎంత దూకుడుగా ఆడాడో అర్థమవుతుంది. చివరకు నన్ను అవుట్‌ చేయడం మీ వల్ల ఏం అవుతుందిలే, నేనే వికెట్‌ ఇస్తాను అన్నట్లుగా బంతిని గాల్లోకి లేపి క్యాచ్‌ ఇస్తే గానీ కోహ్లిని ఆపడం లంక వల్ల కాలేదు.  
పరుగులు చేయడం మాత్రమే కాదు... అవి గెలుపు కోసం ఉపయోగపడాలన్నదే కోహ్లి మంత్రం. జట్టుకు దూకుడు నేర్పిన అతని నాయకత్వంలో భారత్‌ గత 27 టెస్టుల్లో 20 గెలవగలిగింది. వీటిలో 2201 పరుగులతో కెప్టెన్‌గా కోహ్లినే అగ్రస్థానంలో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా అనిపించినా... దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ 34 సెంచరీల్లో కేవలం 6 మాత్రమే జట్టుకు విజయానికి ఉపయోగపడ్డాయి! గత ఏడాది జులైకి ముందు విరాట్‌ కోహ్లి ఖాతాలో 11 సెంచరీలు ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే 150 పరుగుల స్కోరు దాటగలిగాడు.

 కానీ వెస్టిండీస్‌తో నార్త్‌ సౌండ్‌లో జరిగిన టెస్టునుంచి కోహ్లి కొత్త రూపం కనిపించింది. అప్పటి నుంచి చేసిన 8 సెంచరీల్లో 5 డబుల్‌ సెంచరీలు ఉండటం కోహ్లి గొప్పతనం ఏమిటో చెబుతుంది. గత నాలుగు డబుల్‌ సెంచరీల్లో భారత్‌ గెలవగా... ఈసారి కూడా విజయానికి చేరువలో ఉంది. కెరీర్‌ ఆరంభంలో వివాదాస్పద ప్రవర్తనతో కోహ్లిని చాలా మంది ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌తో పోల్చారు. ఇప్పుడు జట్టును ముందుం డి నడిపించడంలో అతనికి పాంటింగ్‌తో పోలిక సరిగ్గా సరిపోతుంది. తమ కెప్టెన్సీ కెరీర్‌లో ఎక్కువ భాగం బ్రియాన్‌ లారాకు తన స్థాయి బ్యాట్స్‌మెన్‌ సహచరులు గానీ, సరైన బౌలింగ్‌ వనరులు గానీ లేకపోగా... సచిన్‌కు అద్భుతమైన బ్యాటింగ్‌ అండగా ఉన్నా, బౌలర్లు ఉపయోగపడలేకపోయారు. భవిష్యత్తు సంగతి చెప్పలేకపోయినా, ప్రస్తుతానికి కోహ్లికి మాత్రం ఈ రెండు వనరులు అందుబాటులో ఉండటంతో ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా కోహ్లి జైత్రయాత్ర కొనసాగుతోంది. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ అతను ఇదే ఫామ్‌ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. 

10 టెస్టులు, వన్డేలు కలిపి కోహ్లి 2017లో సాధించిన సెంచరీలు. ఒకే ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా గతంలో పాంటింగ్‌ (9), గ్రేమ్‌ స్మిత్‌ (9) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు.  

12  కెప్టెన్‌గా టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. గావస్కర్‌ (11)ను విరాట్‌ 
అధిగమించాడు.  

5  కోహ్లి కెరీర్‌లో సాధించిన డబుల్‌ సెంచరీలు. భారత్‌ ఆటగాళ్ళలో సచిన్‌ (6), సెహ్వాగ్‌ (6) మాత్రమే అతనికంటే ముందున్నారు. ఓవరాల్‌గా కెప్టెన్‌ హోదాలో ఐదు డబుల్‌ సెంచరీలు చేసిన కోహ్లి, బ్రియాన్‌ లారా (5)తో సమంగా నిలిచాడు.  

3  ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం 
ఇది మూడో సారి.  

కోహ్లి ప్రతీ మ్యాచ్‌కు రాటుదేలుతున్నాడు. గావస్కర్, సచిన్‌ల తర్వాత ఈ తరంలో కోహ్లిదే ఆ స్థానం. విరాట్‌ ఆస్ట్రేలియా గడ్డపై వరుస సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికాలో కూడా శతకం నమోదు చేశాడు. ఇంగ్లండ్‌లో విఫలమైన సమయంలో అతను పాత కోహ్లి మాత్రమే. ఈసారి అక్కడ కూడా చెలరేగి తన పరుగుల దాహం తీర్చుకుంటాడని ఆశిస్తున్నా.
 – సౌరవ్‌ గంగూలీ, భారత మాజీ కెప్టెన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement