విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్
ఏసీఏ–వీడీసీఏ స్టేడియానికి 2019లో అరుదైన అవకాశం లభించింది. ఒకే ఏడాది మూడు వేర్వేరు ఫార్మాట్‌లలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఈ మైదానం వేదికైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టి20లో తలపడిన భారత్... అక్టోబరులో దక్షిణాఫ్రికాను టెస్టు మ్యాచ్‌లో ఎదుర్కొంది. ఇప్పుడు వెస్టిండీస్‌తో వన్డే సమరానికి కోహ్లి సేన సన్నద్ధమైంది. మ్యాచ్‌లు కేటాయించే బీసీసీఐ రొటేషన్ విధానాన్ని బట్టి చూస్తే ఒకే సంవత్సరం ఇలా మూడు మ్యాచ్‌లు దక్కడం పెద్ద విశేషంగానే చెప్పవచ్చు.
2005లో మొదటి మ్యాచ్ జరిగిన నాటి నుంచి బాగా అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో భారత్‌ను ఒకే ఒక పరాజయం పలకరించింది. ధోని విధ్వంసక రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నాటి నుంచి కోహ్లి 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న చిరస్మరణీయ క్షణం వరకు వైజాగ్ ఎన్నో అపురూప క్షణాలకు వేదికైంది. ఇక్కడ ఆడిన ఎనిమిది వన్డేల్లో భారత్ 6 గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడగా, మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. రేపు భారత్, విండీస్ పోరు నేపథ్యంలో ఇక్కడ జరిగిన వన్డేల విశేషాలను చూస్తే....
5 ఏప్రిల్, 2005
ఫలితం: పాక్‌పై 58 పరుగులతో భారత్ గెలుపు.
విశేషాలు: కెరీర్ ఐదో వన్డే బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోని (123 బంతుల్లో 148; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. ధోనితో పాటు సెహ్వాగ్ (74), ద్రవిడ్ (52) అర్ధ సెంచరీలతో భారత్ 9 వికెట్లకు 356 పరుగులు చేయగా, పాక్ 298 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ గంగూలీ అండతో మూడో స్థానంలో ఆడే అవకాశం దక్కించుకున్న ధోని అద్భుత ప్రదర్శన అతని సత్తాను బయటపెట్టడంతో పాటు కొత్త హీరోను భారత క్రికెట్‌కు అందించింది.
17 ఫిబ్రవరి, 2007
ఫలితం: శ్రీలంకపై 7 వికెట్లతో భారత్ విజయం.
విశేషాలు: చమర సిల్వా (107 నాటౌట్) సహాయంతో శ్రీలంక 7 వికెట్లకు 259 పరుగులు చేయగా, భారత్ 41 ఓవర్లలోనే 3 వికెట్లకు 263 పరుగులు చేసి విజయాన్నందుకుంది. యువరాజ్ సింగ్ (83 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, గంగూలీ (58 నాటౌట్), ఉతప్ప (52) రాణించారు. మహరూఫ్ వేసిన చివరి ఓవర్లో యవీ వరుసగా 4, 4, 0, 6, 4, 4 బాది మ్యాచ్‌ను ముగించడం విశేషం.
29 అక్టోబరు, 2010
ఫలితం: ఆస్ట్రేలియాపై 5 వికెట్లతో భారత్ విజయం.
విశేషాలు: మైకేల్ క్లార్క్ (111) సెంచరీతో పాటు కామెరాన్ వైట్ (89 నాటౌట్), మైక్ హస్సీ (69) రాణించడంతో ఆసీస్ 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. అయితే విరాట్ కోహ్లి (121 బంతుల్లో 118; 11 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి బ్యాటింగ్‌కు సురేశ్ రైనా (71 నాటౌట్), యువరాజ్ సింగ్ (58) అండగా నిలవడంతో భారత్ 5 వికెట్లకు 292 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, మిషెల్ స్టార్క్‌లకు ఇదే తొలి వన్డే.
2 డిసెంబర్, 2011
ఫలితం: వెస్టిండీస్‌పై 5 వికెట్లతో భారత్ విజయం.
విశేషాలు: విశాఖ మైదానంలో విరాట్ కోహ్లి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీలతో మెరిశాడు. రవి రామ్‌పాల్ (86), లెండిల్ సిమన్స్ (78) అర్ధ సెంచరీలతో వెస్టిండీస్ 9 వికెట్లకు 269 పరుగులు చేయగా, కోహ్లి (113 బంతుల్లో 117; 14 ఫోర్లు), రోహిత్ శర్మ (90 నాటౌట్) భాగస్వామ్యంతో భారత్ 5 వికెట్లకు 270 పరుగులు చేసి నెగ్గింది.
24 నవంబర్, 2013
ఫలితం: భారత్‌పై 2 వికెట్లతో వెస్టిండీస్ విజయం.
విశేషాలు: నగరంలో టీమిండియాకు ఎదురైన ఓటమి ఇదొక్కటే. కోహ్లి (99) మరో సెంచరీ చేజార్చుకోగా, ధోని (51) అర్ధ సెంచరీ చేయడంతో భారత్ 7 వికెట్లకు 288 పరుగులు నమోదు చేసింది. అనంతరం విండీస్ 8 వికెట్లకు 289 పరుగులు సాధించింది. జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు చేయడం విశేషం. డారెన్ స్యామీ (63 నాటౌట్), సిమన్స్ (62), పావెల్ (59), డారెన్ బ్రేవో (50) ఆకట్టుకున్నారు.
29 అక్టోబరు, 2016
ఫలితం: న్యూజిలాండ్‌పై 190 పరుగులతో భారత్ విజయం.
విశేషాలు: అమిత్ మిశ్రా (5/18) మ్యాజిక్ బౌలింగ్‌తో గెలిపించిన మ్యాచ్ ఇది. రోహిత్ శర్మ (70), విరాట్ కోహ్లి (65) అర్ధ శతకాలతో భారత్ 6 వికెట్లకు 269 పరుగులు చేయగా, కివీస్ 23.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. భారత ఆటగాళ్లంతా సొంత పేర్లు కాకుండా తమ జెర్సీలపై తమ తల్లుల పేర్లు ముద్రించుకొని బరిలోకి దిగడం విశేషం.
17 డిసెంబర్, 2017
ఫలితం: శ్రీలంకపై 8 వికెట్లతో భారత్ విజయం.
విశేషాలు: ఉపుల్ తరంగ (95) మినహా అంతా విఫలం కావడంతో శ్రీలంక 215 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (85 బంతుల్లో 100 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ, శ్రేయస్ అయ్యర్ (65) అర్ధ సెంచరీ కలిసి భారత్‌కు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ వరుసగా ఎనిమిదో సిరీస్ విజయాన్ని సాధించింది.
ఏడాది క్రితం వీరిద్దరే...
చెన్నైలో తొలి వన్డేలో సెంచరీలతో చెలరేగి భారత్ ఓటమికి కారణమైన హెట్‌మైర్, షై హోప్‌లు మరో అద్భుత ప్రదర్శన కనబర్చాలని పట్టుదలగా ఉన్నారు. రెండో మ్యాచ్ వేదిక వైజాగ్ కావడం వారిలో ఉత్సాహాన్ని పెంచింది. గత ఏడాది అక్టోబర్ 24న విశాఖ మైదానంలో భారత్–విండీస్ మధ్య వన్డే ‘టై’ కావడంలో వీరిదే కీలక పాత్ర కావడం విశేషం. ముందుగా విరాట్ కోహ్లి (129 బంతుల్లో 157 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత శతకానికి రాయుడు (73) అండగా నిలవడంతో భారత్ 6 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఆ తర్వాత షై హోప్ (134 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్‌మైర్ (64 బంతుల్లో 94; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో విండీస్ కూడా 7 వికెట్లకు 321 పరుగులే చేసింది. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 9 పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా, హోప్ ఫోర్ కొట్టగలిగాడు. కోహ్లి ఈ మ్యాచ్‌లోనే 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు.
కోహ్లి సూపర్ రికార్డు...
విశాఖపట్నంలో ఆడిన ఐదు వన్డేల్లో కోహ్లి వరుసగా 118, 117, 99, 65, 157 నాటౌట్ పరుగులు చేశాడు. సెంచరీలు చేసిన మూడు సందర్భాల్లోనూ అతనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కావడం విశేషం.
అంతకుముందు ఐదు వన్డేలు... విశాఖపట్నంలో ప్రస్తుత స్టేడియం నిర్మించక ముందు కూడా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 1988–2001 మధ్య ఐదు వన్డేలు జరిగాయి. న్యూజిలాండ్, వెస్టిండీస్‌లపై ఒక్కో మ్యాచ్ గెలిచిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. మిగతా రెండు వన్డేలు ఆస్ట్రేలియా–కెన్యా, పాకిస్తాన్–శ్రీలంక మధ్య జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment