ఆఖరి బంతికి  ముగించారు | India beat West Indies by 6 wickets in 3rd T20 | Sakshi
Sakshi News home page

ఆఖరి బంతికి  ముగించారు

Published Mon, Nov 12 2018 1:20 AM | Last Updated on Mon, Nov 12 2018 12:51 PM

India beat West Indies by 6 wickets in 3rd T20 - Sakshi

అలవోకగా గెలిచేస్తోందనుకున్న మ్యాచ్‌లో ఫలితం కోసం ఆఖరి బంతి దాకా ఆగాల్సి వచ్చింది. విండీస్‌ ఫీల్డింగ్‌ వైఫల్యంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది కానీ లేదంటే ‘టై’తో మ్యాచ్‌ ముగించాల్సి వచ్చేది. ఇద్దరు దూకుడైన బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో ఉండి 18 బంతుల్లో చేయాల్సింది 19 పరుగులే... కానీ 17 బంతులు ముగిసేసరికి రెండు వికెట్లు చేజార్చుకొని వచ్చింది 18 పరుగులే! చివరి బంతికి మనీశ్‌ పాండే ఆడిన షాట్‌కు బంతిని ఆపి రనౌట్‌ చేయడంలో విండీస్‌ బౌలర్‌ అలెన్‌ విఫలమయ్యాడు. ఫలితంగా అతి కష్టమ్మీద సింగిల్‌ పూర్తి చేయడంతో భారత్‌ క్లీన్‌స్వీప్‌ సాధ్యమైంది. సొంతగడ్డపై ఆధిపత్యంతో మూడు ఫార్మాట్‌లలోనూ భారత్‌ సిరీస్‌లు గెలుచుకోగా... పర్యటన మొత్తంలో ఏకైక వన్డే మ్యాచ్‌ విజయంతో విండీస్‌ వెనుదిరిగింది. ఈ పోరుతో 2018లో  స్వదేశంలో భారత్‌ ఆట ముగిసింది.   

చెన్నై: వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత్‌ టి20ల్లోనూ తమకు ఎదురు లేదని నిరూపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్‌ సాధించింది. ఆదివారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. నికొలస్‌ పూరన్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, డారెన్‌ బ్రేవో (37 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.

అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (62 బంతుల్లో 92; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అంతర్జాతీయ టి20ల్లో తన అత్యధిక స్కోరు నమోదు చేయగా, రిషభ్‌ పంత్‌ (38 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించి భారత్‌ విజయాన్ని సునాయాసం చేశారు. కుల్దీప్‌ యాదవ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.  



పూరన్‌ దూకుడు... 
ఓపెనర్లు హెట్‌మైర్‌ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హోప్‌ (22 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) విండీస్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరూ దూకుడైన ఆటను ప్రదర్శిస్తూ బౌండరీలతో చెలరేగారు. సుందర్‌ ఓవర్లో హెట్‌మైర్‌ రెండు ఫోర్లు కొట్టగా, కృనాల్‌ పాండ్యా తొలి ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్‌ బాదారు. పవర్‌ ప్లే ముగిసేసరికి విండీస్‌ 36 బంతుల్లో 51 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్‌ వేసిన చహల్‌ తొలి బంతికే హోప్‌ను ఔట్‌ చేయడంతో మొదటి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత తడబడిన విండీస్‌ 25 బంతుల పాటు ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయింది. ఈ క్రమంలో హెట్‌మైర్‌ వికెట్‌ కూడా కోల్పోయింది. సుందర్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టిన రామ్‌దిన్‌ (15) అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో పూరన్‌ జోరు విండీస్‌కు చెప్పుకోదగ్గ స్కోరు అందించింది. పాండ్యా ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టిన బ్రేవో సహచరుడికి అండగా నిలిచాడు. భువనేశ్వర్‌ ఓవర్లో వరుస బంతుల్లో రెండు సిక్సర్లతో చెలరేగిన పూరన్‌... చహల్‌ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్స్‌ బాదాడు.

అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ విండీస్‌కు బాగా కలిసొచ్చింది. అప్పటి వరకు వేసిన మూడు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చిన ఖలీల్‌... ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతికి బ్రేవో సిక్స్‌ కొట్టగా... అదే ఓవర్లో పూరన్‌ వరుసగా 4, 6, 4తో ధాటిని ప్రదర్శించాడు. 24 బంతుల్లోనే పూరన్‌ అర్ధసెంచరీ పూర్తి కాగా, చివరి 5 ఓవర్లలో విండీస్‌ 64 పరుగులు సాధించింది. భారత్‌ 16 వైడ్‌లు సహా ఏకంగా 20 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం విశేషం!  
 



భారీ భాగస్వామ్యం... 
ఛేదనలో ఆరంభంలోనే భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (4) వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన కేఎల్‌ రాహుల్‌ (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే ఈ దశలో ధావన్‌ తన సత్తాను ప్రదర్శించాడు. అతనికి యువ పంత్‌ దూకుడు తోడైంది. థామస్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ధావన్, ఆ తర్వాత బ్రాత్‌వైట్‌ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత పంత్‌ ఏడు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టి జోరును ప్రదర్శించాడు.

థామస్‌ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్‌ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. పొలార్డ్‌ ఓవర్లో కూడా భారత్‌ 2 ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో 36 బంతుల్లో ధావన్, ఆ తర్వాత 30 బంతుల్లోనే పంత్‌ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇదే ఊపులో భారత జట్టు గెలుపునకు చేరువైంది. విజయానికి 11 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన దశలో పంత్‌ బౌల్డ్‌ కాగా... మరో పరుగు చేయాల్సి ఉండగా ధావన్‌ కూడా వెనుదిరిగాడు. అయితే పాండే సింగిల్‌తో చివరి బంతికి భారత్‌ గట్టెక్కింది.  

9 భారత్‌ గెలిచిన టి20 ద్వైపాక్షిక సిరీస్‌లు (మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్నవి). పాకిస్తాన్‌ కూడా 9 గెలిచింది. అయితే భారత్‌ ఒక్కటి కూడా ఓడలేదు. 

3 భారత్‌ చివరి బంతికి టి20 మ్యాచ్‌ గెలవడం ఇది మూడోసారి. గతంలో ఆస్ట్రేలియాపై (సిడ్నీలో 2016; లక్ష్యం 198), బంగ్లాదేశ్‌పై (కొలంబోలో 2018; లక్ష్యం 167) భారత్‌ ఆఖరి బంతికి గెలిచింది.  

3 రెండేళ్ల క్రితం భారత గడ్డపై టి20 ప్రపంచ కప్‌ సాధించిన తర్వాత విండీస్‌ ఉపఖండంలో ఆడిన మూడు సిరీస్‌లు కూడా 0–3తోనే ఓడిపోయింది. మూడు సిరీస్‌లు ఇలా ఓడిన ఏకైక జట్టు విండీస్‌.
 

  
 

స్కోరు వివరాలు 
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హోప్‌ (సి) సుందర్‌ (బి) చహల్‌ 24; హెట్‌మైర్‌ (సి) కృనాల్‌ పాండ్యా (బి) చహల్‌ 26; డారెన్‌ బ్రేవో (నాటౌట్‌) 43; రామ్‌దిన్‌ (బి) వాషింగ్టన్‌ సుందర్‌ 15; పూరన్‌ (నాటౌట్‌) 53; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 181.  
వికెట్ల పతనం: 1–51; 2–62; 3–94. 
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–37–0; వాషింగ్టన్‌ సుందర్‌ 4–0–33–1; భువనేశ్వర్‌ కుమార్‌ 4–0–39–0; కృనాల్‌ పాండ్యా 4–0–40–0; యజువేంద్ర చహల్‌ 4–0–28–2.  
భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) పొలార్డ్‌ (బి) అలెన్‌ 92; రోహిత్‌ (సి) బ్రాత్‌వైట్‌ (బి) కీమో పాల్‌ 4; రాహుల్‌ (సి) రామ్‌దిన్‌ (బి) థామస్‌ 17; పంత్‌ (బి) కీమో పాల్‌ 58; మనీశ్‌ పాండే (నాటౌట్‌) 4; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182.  
వికెట్ల పతనం: 1–13; 2–45; 3–175; 4–181. 
బౌలింగ్‌: పియర్‌ 2–0–13–0; థామస్‌ 4–0–43–1; కీమో పాల్‌ 4–0–32–2; బ్రాత్‌వైట్‌ 4–0–41–0; కీరన్‌ పొలార్డ్‌ 3–0–29–0; అలెన్‌ 3–0–23–1.  


(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement