ఎవరిదో శుభారంభం! | india vs west indies first maitch at chidambaram stadium | Sakshi
Sakshi News home page

ఎవరిదో శుభారంభం!

Published Sun, Dec 15 2019 2:03 AM | Last Updated on Sun, Dec 15 2019 12:51 PM

india vs west indies first maitch at chidambaram stadium - Sakshi

కోహ్లి, నికోలస్‌ పూరన్‌, పొలార్డ్‌

అబ్బురపరిచే బ్యాటింగ్‌ విన్యాసాలు... విస్మయపరిచే బౌలర్ల ప్రదర్శనలు... కళ్లు చెదిరే బౌండరీలు... చుక్కలనంటేలా భారీ సిక్సర్లు... ఓవర్‌ ఓవర్‌కు మారే విజయ సమీకరణాలు.. వెరసి వెస్టిండీస్‌తో టి20 ఫార్మాట్‌ మజామజాగా సాగింది. ఇక రోజంతా క్రికెట్‌ కబుర్లు పంచేందుకు వన్డే ఫార్మాట్‌ సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. ఫామ్‌ దృష్ట్యా వన్డే సిరీస్‌లోనూ టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.   

చెన్నై: పుష్కర కాలంగా వెస్టిండీస్‌పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమైంది. తాజాగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకున్న కోహ్లిసేన అదే ఉత్సాహంతో వన్డే సిరీస్‌ విజయంపై గురి పెట్టింది. మరోవైపు భారత్‌ చేతిలో తమ పరాజయాల పరంపరకు కళ్లెం వేయాలని వెస్టిండీస్‌ పట్టుదలతో ఉంది.

తొలి మ్యాచ్‌లోనే గెలుపొంది భారత్‌ జోరుకు బ్రేకులేసేందుకు విండీస్‌ సేన సిద్ధమైంది. ఇలా ఇరు జట్లు ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతుంటే వరుణుడు నేనున్నానంటూ పలకరించాడు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా తుడిచి పెట్టుకుపోయింది. నేటి మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడే వీలున్న నేపథ్యంలో మ్యాచ్‌ ఏవిధంగా సాగబోతుందోనన్న ఆసక్తి అందరిలో పెరిగింది.  

ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన...
ఏ జట్టుకు అయినా సొంతగడ్డపై భారత్‌ను వన్డేల్లో ఓడించడం శక్తికి మించిన పనే. ఈ విషయం వెస్టిండీస్‌కు తెలిసినంత క్షుణ్ణంగా మరో జట్టుకు తెలిసి ఉండదేమో! ఇంకా చెప్పాలంటే గత కొన్నేళ్లుగా విండీస్‌ పరిస్థితి చూస్తుంటే ఏదో వచ్చామా? వెళ్లామా? అన్నట్లుగానే ఉంది. 2006–07 సీజన్‌ నుంచి ఇప్పటి వరకు భారత్‌లో ఆరుసార్లు పర్యటించిన విండీస్‌ ఖాళీ చేతులతోనే వెళ్లడం దీన్ని నిర్ధారిస్తోంది. ఈసారి కూడా వెస్టిండీస్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడేందుకే భారత్‌ సిద్ధమైంది. దీనికి తగినట్లుగానే కోహ్లి, రోహిత్, రాహుల్‌లతో కూడిన భారత టాపార్డర్‌ దుర్భేద్యంగా ఉంది.

గాయపడిన ధావన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు... వన్డేల్లో అరంగేట్రం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌ సమయంలో ఆందోళన రేకెత్తించిన నాలుగో నంబర్‌ స్థానంలో ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌ కుదురుకుంటున్నట్లే కనబడుతున్నాడు. దూకుడు, నిలకడలేమితో విమర్శలెదుర్కొంటున్న యువ వికెట్‌కీపర్‌ పంత్‌కు ఈ సిరీస్‌ మరో మంచి అవకాశం. టీమ్‌ మేనేజ్‌మెంట్, కెప్టెన్‌ కోహ్లి నమ్మకాన్ని నిలిపేలా అతను మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది.

ఇక బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో చురుగ్గా కదిలే రవీంద్ర జడేజా ఉండటం జట్టుకు పెద్ద సానుకూలాంశం. మనీశ్‌ పాండే కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. భువనేశ్వర్‌ స్థానంలో వచ్చిన శార్దుల్‌ ఠాకూర్, మొహమ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌ పేస్‌ విభాగాన్ని నడపనున్నారు. స్పిన్‌ విభాగంలో ‘కుల్చా’ ద్వయం మరోసారి జోడీ కట్టనుంది. చివరిసారిగా వన్డే ప్రపంచకప్‌లో కలిసి ఆడిన కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌ చెపాక్‌ పిచ్‌పై తమ స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించనున్నారు.  

కడవరకు నిలబడితేనే...  
దూకుడు, పవర్‌హిట్టింగ్‌కు మారుపేరు వెస్టిండీస్‌. వచ్చీరాగానే భారీ షాట్లతో విరుచుకుపడటం, బంతుల్ని బౌండరీలకు తరలించడమే లక్ష్యంగా ఆడతారు విండీస్‌ వీరులు. తాజా టి20 సిరీస్‌లోనూ వారు కురిపించిన సిక్సర్ల వాన అభిమానులను మురిపించింది. అయితే ఈ తరహా ఆట రోజంతా సాగే వన్డే ఫార్మాట్‌కు పనికిరాదు. ప్రస్తుతం దీనిపైనే విండీస్‌ దృష్టి సారించింది. స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ, వికెట్‌ కాపాడుకుంటూ కడవరకు క్రీజులో ఉండటమే లక్ష్యంగా ఆడతామని వెస్టిండీస్‌ సహాయక కోచ్‌ ఎస్ట్‌విక్‌ అన్నారు.

ముంబై మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ గాయడిన భారీ హిట్టర్‌ ఎవిన్‌ లూయిస్‌ నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. కెప్టెన్‌ పొలార్డ్, షై హోప్, హెట్‌మైర్, నికోలస్‌ పూరన్, కింగ్‌లతో పాటు ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ చేజ్‌ కూడా జట్టుతో చేరడంతో విండీస్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా మారింది. పేసర్లు షెల్డన్‌ కాట్రెల్, జాసన్‌ హోల్డర్‌.. స్పిన్నర్‌ జూనియర్‌ వాల్‌‡్ష భారత టాపార్డర్‌ను తొందరగా పెవిలియన్‌ పంపించేందుకు వ్యూహాలతో సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నప్పటికీ అనూహ్యమైన ఆటతీరుకు పెట్టింది పేరైన వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయలేం.

జట్లు (అంచనా)
భారత్‌: విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌/మయాంక్‌ అగర్వాల్, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, కేదార్‌ జాదవ్, శివమ్‌ దూబే, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, మొహమ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌.  
వెస్టిండీస్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), షై హోప్, క్యారీ పియరీ, రోస్టన్‌ చేజ్, రొమారియో షెఫర్డ్, సునీల్‌ ఆంబ్రిస్, నికోలస్‌ పూరన్, హెట్‌మైర్, అల్జారీ జోసెఫ్, వాల్‌‡్ష జూనియర్, కీమో పాల్‌.

పిచ్, వాతావరణం
గత రెండు రోజులు వర్షం పడటంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. చివరిసారి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను 21 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్‌ 9 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడిపోయింది. ఆదివారం ఆకాశం మేఘావృతంగా ఉండటంతోపాటు వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి.  
 

12: చెన్నైలో భారత్‌ ఇప్పటివరకు 12 వన్డేలు ఆడింది. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌ రద్దయింది.  
4: ఈ వేదికపై వెస్టిండీస్‌తో భారత్‌ నాలుగుసార్లు తలపడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొంది (2011లో), మరో రెండు మ్యాచ్‌ల్లో (1994, 2007లో) ఓడిపోయింది. చివరిసారి ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement