Three one day series
-
India vs Sri Lanka: వన్డేలకు మోగిన విజిల్! లంకకు కష్టమే.. అందరూ అంతంతే!
వన్డే వరల్డ్కప్నామ సంవత్సరమిది... అదీ భారత గడ్డపై... ఈ నేపథ్యంలో అక్టోబరుకు ముందు ఇకపై జరిగే వన్డేలన్నీ భారత్‌కు సన్నాహకాలే... మధ్యలో ఐపీఎల్ రూపంలో టి20లు ఉన్నా, వన్డే జట్టు ఎంపికకు, తుది జట్టు కూర్పు కొరకు ఈ మ్యాచ్‌ల ప్రదర్శనే కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. ఆసియాకప్ కాకుండా టీమిండియా కనీసం 15 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేటినుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంకను భారత్ ఎదుర్కొంటుంది. గువహటి: శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. నేడు జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రాకతో భారత బృందం మరింత పటిష్టంగా మారగా... లంక దాదాపు అదే జట్టుతో మరో పోరాటానికి సిద్ధమైంది. తొలి రెండు టి20లు హోరాహోరీగా సాగినా... చివరి మ్యాచ్‌లో ఏకపక్ష విజయంతో భారత్ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది. అయితే ఆ సిరీస్‌లో చూపిన ప్రదర్శన లంక జట్టులో ఆత్మ విశ్వాసం పెంచింది. 2017 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. ఓపెనర్‌గా గిల్... బంగ్లాదేశ్‌తో చివరి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో ‘డబుల్ సెంచరీ’ సాధించినా... ఇషాన్ కిషన్‌కు ఈ మ్యాచ్‌లో మాత్రం చాన్స్ లేదు. కెప్టెన్ రోహిత్ రాకతో అతనిపై వేటు ఖాయమైంది. ఇషాన్‌కు అవకాశం ఇవ్వలేమని రోహిత్ స్పష్టం చేసేశాడు కూడా. వన్డేల్లో ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకున్న శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. టి20ల్లో ఆడని కోహ్లి తనకు బాగా అచ్చి వచ్చిన ఫార్మాట్లో మళ్లీ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. లంకపై ఏకంగా 8 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేసిన ఘనమైన రికార్డు కోహ్లికి ఉంది. గత ఏడాది 55.69 సగటుతో 724 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్‌కు మిడిలార్డర్లో చోటు ఖాయం కాగా... వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ కూడా బరిలోకి దిగుతాడు. దాంతో టి20ల్లో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్‌కు చోటు కష్టమే. పైగా వన్డేల్లో ఇప్పటి వరకు సూర్య ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. రాహుల్, శ్రేయస్‌లలో ఒకరిని తప్పించి సూర్యను ఆడించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఆరో స్థానంలో ఆల్‌రౌండర్‌గా కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో జట్టు కూర్పు ఉండవచ్చు. అక్షర్ పటేల్ ఖాయం కాగా... రెండో స్పిన్నర్‌గా చహల్, కుల్దీప్ యాదవ్‌ల మధ్య పోటీ ఉంది. సీనియర్ పేసర్ షమీ, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా అర్ష్‌దీప్, ఉమ్రాన్‌లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. బంగ్లా చేతిలో సిరీస్ ఓడినా... ఓవరాల్‌పై లంకపై భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అందరూ అంతంతే... శ్రీలంక జట్టు గత కొంత కాలంగా వన్డేల్లో కాస్త మెరుగైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడం ఆ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన. అయితే సమస్యంతా ఒక్కొక్క ఆటగాడి వన్డే రికార్డుతోనే. ప్రస్తుతం ఉన్న జట్టులో అంతా టి20ల్లో ఆకట్టుకున్నవారే అయినా... వన్డేల్లో రెగ్యులర్‌గా తమను తాను నిరూపించుకున్నవారు ఎవరూ లేరు. టి20లతో పోలిస్తే వన్డేల్లో సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచి ఇన్నింగ్స్‌ను నిర్మించే సమర్థుడైన బ్యాటర్ గానీ... 10 ఓవర్ల పాటు నిలకడగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల బౌలర్ గానీ జట్టులో కనిపించడం లేదు. టి20ల్లో సత్తా చాటిన షనక వన్డే రికార్డు పేలవం. పైగా అతను ఇప్పటి వరకు భారత గడ్డపై వన్డే ఆడనే లేదు. అదే తరహాలో జట్టు ప్రధాన అస్త్రం హసరంగ కూడా వన్డేల్లో అంతంతే. ఇద్దరు పేసర్లు రజిత, కుమారలు ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోగా, మదుషంక వన్డేలో అరంగేట్రం చేయలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌కు లంక ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. ముఖాముఖి పోరులో 162: ఇప్పటి వరకు భారత్, శ్రీలంక జట్ల మధ్య 162 వన్డేలు జరిగాయి. 93 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 57 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా... 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక భారత గడ్డపై ఈ రెండు జట్లు 51 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 36 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా... 12 మ్యాచ్‌ల్లో శ్రీలంక విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. -
షకీబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ జట్టు 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. వెస్టీ మాడివెర్ (56; 5 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. షోరిఫుల్ ఇస్లాం (4/46), షకీబ్ (2/42) జింబాబ్వేను దెబ్బతీశారు. అనంతరం బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబ్ (109 బంతుల్లో 96 నాటౌట్; 8 ఫోర్లు) చివరివరకు క్రీజులో నిలిచాడు. ఎనిమిదో వికెట్‌కు సైఫుద్దీన్ (28 నాటౌట్)తో కలిసి అభేద్యంగా 69 పరుగులు జోడించాడు. -
పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్
భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పర్యటన మూడో దశకు చేరింది. తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా... హోరాహోరీగా సాగిన టి20ల్లోనూ ముందు వెనుకబడ్డా ఆ తర్వాత చెలరేగి విజేతగా నిలిచింది. ఇక వరల్డ్ చాంపియన్‌తో వన్డే సమరంలోనూ గెలిస్తే విజయం సంపూర్ణమవుతుంది. మరోవైపు ఈ ఫార్మాట్లోనైనా సిరీస్ అందుకొని గౌరవంగా స్వదేశం వెళ్లాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్, టి20 ప్రపంచకప్ కారణంగా ఈ ఏడాది వన్డేలకు అంత ప్రాధాన్యత కనిపించకపోయినా... రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. పుణే: స్ఫూర్తిదాయక ప్రదర్శనతో టి20 సిరీస్‌ను గెలుచుకున్న మూడు రోజుల విరామం తర్వాత మరో వేదికపై భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. వరుసగా రెండు టెస్టులు, ఐదు టి20ల తర్వాత మ్యాచ్‌లు జరిగే వేదిక మారినా... కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్ నిర్వహించనున్నారు. 2016–17లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో గెలుచుకుంది. ధావన్‌కు మరో అవకాశం! టి20 సిరీస్ ఆడిన భారత జట్టే దాదాపుగా వన్డేల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టి20లో విఫలమై ఆ తర్వాత బెంచీకే పరిమితమైన శిఖర్ ధావన్ వన్డేలో ఓపెనర్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఎప్పటిలాగే రోహిత్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని కెప్టెన్ ఇప్పటికే ప్రకటించాడు. చివరి టి20కు దూరమైన కేఎల్ రాహుల్‌కు కూడా మరో చాన్స్ లభించవచ్చు. అయితే అది మిడిలార్డర్లోనే. సూర్యకుమార్ లాంటి కొత్త ఆటగాళ్ల నుంచి తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో తన స్థానం నిలబెట్టుకోవాలంటే రాహుల్ సత్తా చాటాల్సిందే. తనకే సొంతమైన మూడో స్థానంలో ఆడే కోహ్లి, అయ్యర్ తర్వాత రాహుల్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగే సమయంలో వ్యూహం మారితే అతనికంటే ముందు పంత్ బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఖాయం కాగా... ముగ్గురు పేసర్లుగా భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్, నటరాజన్ సిద్ధంగా ఉన్నారు. కొత్తగా ఎంపికైన ప్రసిధ్ కృష్ణకు తొలి మ్యాచ్‌లోనే అవకాశం రాకపోవచ్చు. స్పిన్నర్లలో చహల్, కుల్దీప్లలో ఒక్కరే బరిలోకి దిగుతారు. రెండో స్పిన్నర్‌గా సుందర్‌ను ఆడించాలని భావిస్తే శార్దుల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. లివింగ్‌స్టోన్‌కు చాన్స్! వన్డేల్లో రెగ్యులర్ ఆటగాళ్లు రూట్, వోక్స్‌లకు సిరీస్ నుంచి ఇంగ్లండ్ విశ్రాంతినివ్వగా... ఆర్చర్ గాయంతో వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కవచ్చు. ఇటీవల ఇంగ్లండ్ దేశవాళీ వన్డేల్లో ఆకట్టుకున్న లివింగ్‌స్టోన్ తన అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. లెగ్‌స్పిన్నర్ పార్కిన్సన్ కూడా అవకాశాన్ని ఆశిస్తుండగా, రషీద్‌ను పక్కన పెట్టి ఇంగ్లండ్ ఆ మార్పు చేయగలదా అనేది చూడాలి. ఓపెనర్లుగా రాయ్, బెయిర్‌స్టో బరిలోకి దిగనుండగా, కీపర్ బట్లర్ మిడిలార్డర్లో ఆడతాడు. టి20ల్లో ఆకట్టుకోని కెప్టెన్ మోర్గాన్ తనకు అచ్చొచ్చిన ఫార్మాట్లో చెలరేగాల్సి ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేల్లోనూ మ్యాచ్‌ను శాసించగలడు. లార్డ్స్‌లో జరిగిన చిరస్మరణీయ 2019 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత అతను ఆడనున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. పేసర్ మార్క్ వుడ్ మరోసారి తన వేగాన్ని నమ్ముకోగా, టాప్లీ కొత్త బంతిని పంచుకుంటాడు. మూడో పేసర్‌గా అన్నదమ్ములు స్యామ్, టామ్ కరన్‌ల మధ్య పోటీ ఉంది. పిచ్, వాతావరణం మొదటి నుంచి పుణే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ నాలుగు వన్డేలు జరగ్గా మూడుసార్లు 300కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. వర్షం సమస్య లేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, అయ్యర్, పంత్, రాహుల్, హార్దిక్, భువనేశ్వర్, శార్దుల్, చహల్/కుల్దీప్, నటరాజన్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, బిల్లింగ్స్, లివింగ్‌స్టోన్, స్యామ్/టామ్ కరన్, రషీద్, టాప్లీ, వుడ్. చిన్నారితో... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి తన రెండు నెలల పాపతో కలిసి మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చాడు. పుణే విమానాశ్రయంలో భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి ఉన్న చిత్రాలు ప్రధాన ఆకర్షణగా మారాయి. అనుష్క చేతుల్లో అమ్మాయి ఉండగా... కోహ్లి చేతుల్లో మొత్తం లగేజీ కనిపించడం కూడా సోషల్ మీడియాలో ‘మీమ్’లకు పని పెట్టాయి! -
ప్రసిధ్ కృష్ణకు పిలుపు
ముంబై: ఇంగ్లండ్‌తో తలపడే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందంలో ముగ్గురు ఆటగాళ్లకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. కర్ణాటక పేస్ బౌలర్, గతంలో భారత ‘ఎ’ జట్టుకు ఆడిన ప్రసిధ్ కృష్ణ జాతీయ సీనియర్ జట్టులో ఎంపిక కావడం ఇదే తొలిసారి కాగా... ఇప్పటికే టి20లు ఆడిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, తాజా టి20 సిరీస్‌లో ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా అవకాశం దక్కింది. ఐపీఎల్లో కోల్‌కతా జట్టు తరఫున కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసిధ్‌కు దేశవాళీ వన్డేల్లో మంచి రికార్డు ఉంది. 48 వన్డేల్లో అతను 23.07 సగటుతో 81 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున 18 టి20లు ఆడిన కృనాల్ ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్ ప్రదర్శన ఆధారంగా సిరాజ్‌కు మరోసారి వన్డే పిలుపు లభించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్‌లో ఉన్న మయాంక్, మనీశ్ పాండే, సైనీ, సంజూ సామ్సన్ తమ స్థానాలు కోల్పోయారు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు ఈనెల 23, 26, 28వ తేదీల్లో పుణేలో జరుగుతాయి. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, గిల్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, పంత్, రాహుల్, చహల్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, సుందర్, నటరాజన్, భువనేశ్వర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్. -
ఎవరిదో శుభారంభం!
అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసాలు... విస్మయపరిచే బౌలర్ల ప్రదర్శనలు... కళ్లు చెదిరే బౌండరీలు... చుక్కలనంటేలా భారీ సిక్సర్లు... ఓవర్ ఓవర్‌కు మారే విజయ సమీకరణాలు.. వెరసి వెస్టిండీస్‌తో టి20 ఫార్మాట్ మజామజాగా సాగింది. ఇక రోజంతా క్రికెట్ కబుర్లు పంచేందుకు వన్డే ఫార్మాట్ సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఫామ్ దృష్ట్యా వన్డే సిరీస్‌లోనూ టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. చెన్నై: పుష్కర కాలంగా వెస్టిండీస్‌పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమైంది. తాజాగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకున్న కోహ్లిసేన అదే ఉత్సాహంతో వన్డే సిరీస్ విజయంపై గురి పెట్టింది. మరోవైపు భారత్ చేతిలో తమ పరాజయాల పరంపరకు కళ్లెం వేయాలని వెస్టిండీస్ పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే గెలుపొంది భారత్ జోరుకు బ్రేకులేసేందుకు విండీస్ సేన సిద్ధమైంది. ఇలా ఇరు జట్లు ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతుంటే వరుణుడు నేనున్నానంటూ పలకరించాడు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా తుడిచి పెట్టుకుపోయింది. నేటి మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడే వీలున్న నేపథ్యంలో మ్యాచ్ ఏవిధంగా సాగబోతుందోనన్న ఆసక్తి అందరిలో పెరిగింది. ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన... ఏ జట్టుకు అయినా సొంతగడ్డపై భారత్‌ను వన్డేల్లో ఓడించడం శక్తికి మించిన పనే. ఈ విషయం వెస్టిండీస్‌కు తెలిసినంత క్షుణ్ణంగా మరో జట్టుకు తెలిసి ఉండదేమో! ఇంకా చెప్పాలంటే గత కొన్నేళ్లుగా విండీస్ పరిస్థితి చూస్తుంటే ఏదో వచ్చామా? వెళ్లామా? అన్నట్లుగానే ఉంది. 2006–07 సీజన్ నుంచి ఇప్పటి వరకు భారత్‌లో ఆరుసార్లు పర్యటించిన విండీస్ ఖాళీ చేతులతోనే వెళ్లడం దీన్ని నిర్ధారిస్తోంది. ఈసారి కూడా వెస్టిండీస్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడేందుకే భారత్ సిద్ధమైంది. దీనికి తగినట్లుగానే కోహ్లి, రోహిత్, రాహుల్‌లతో కూడిన భారత టాపార్డర్ దుర్భేద్యంగా ఉంది. గాయపడిన ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు... వన్డేల్లో అరంగేట్రం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ సమయంలో ఆందోళన రేకెత్తించిన నాలుగో నంబర్ స్థానంలో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కుదురుకుంటున్నట్లే కనబడుతున్నాడు. దూకుడు, నిలకడలేమితో విమర్శలెదుర్కొంటున్న యువ వికెట్‌కీపర్ పంత్‌కు ఈ సిరీస్ మరో మంచి అవకాశం. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని నిలిపేలా అతను మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో చురుగ్గా కదిలే రవీంద్ర జడేజా ఉండటం జట్టుకు పెద్ద సానుకూలాంశం. మనీశ్ పాండే కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. భువనేశ్వర్ స్థానంలో వచ్చిన శార్దుల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్ పేస్ విభాగాన్ని నడపనున్నారు. స్పిన్ విభాగంలో ‘కుల్చా’ ద్వయం మరోసారి జోడీ కట్టనుంది. చివరిసారిగా వన్డే ప్రపంచకప్‌లో కలిసి ఆడిన కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ చెపాక్ పిచ్‌పై తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించనున్నారు. కడవరకు నిలబడితేనే... దూకుడు, పవర్‌హిట్టింగ్‌కు మారుపేరు వెస్టిండీస్. వచ్చీరాగానే భారీ షాట్లతో విరుచుకుపడటం, బంతుల్ని బౌండరీలకు తరలించడమే లక్ష్యంగా ఆడతారు విండీస్ వీరులు. తాజా టి20 సిరీస్‌లోనూ వారు కురిపించిన సిక్సర్ల వాన అభిమానులను మురిపించింది. అయితే ఈ తరహా ఆట రోజంతా సాగే వన్డే ఫార్మాట్‌కు పనికిరాదు. ప్రస్తుతం దీనిపైనే విండీస్ దృష్టి సారించింది. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, వికెట్ కాపాడుకుంటూ కడవరకు క్రీజులో ఉండటమే లక్ష్యంగా ఆడతామని వెస్టిండీస్ సహాయక కోచ్ ఎస్ట్‌విక్ అన్నారు. ముంబై మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయడిన భారీ హిట్టర్ ఎవిన్ లూయిస్ నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. కెప్టెన్ పొలార్డ్, షై హోప్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, కింగ్‌లతో పాటు ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ కూడా జట్టుతో చేరడంతో విండీస్ బ్యాటింగ్ పటిష్టంగా మారింది. పేసర్లు షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్.. స్పిన్నర్ జూనియర్ వాల్‡్ష భారత టాపార్డర్‌ను తొందరగా పెవిలియన్ పంపించేందుకు వ్యూహాలతో సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నప్పటికీ అనూహ్యమైన ఆటతీరుకు పెట్టింది పేరైన వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. జట్లు (అంచనా) భారత్: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్. వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), షై హోప్, క్యారీ పియరీ, రోస్టన్ చేజ్, రొమారియో షెఫర్డ్, సునీల్ ఆంబ్రిస్, నికోలస్ పూరన్, హెట్‌మైర్, అల్జారీ జోసెఫ్, వాల్‡్ష జూనియర్, కీమో పాల్. పిచ్, వాతావరణం గత రెండు రోజులు వర్షం పడటంతో పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. చివరిసారి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను 21 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 9 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడిపోయింది. ఆదివారం ఆకాశం మేఘావృతంగా ఉండటంతోపాటు వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. 12: చెన్నైలో భారత్ ఇప్పటివరకు 12 వన్డేలు ఆడింది. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. 4: ఈ వేదికపై వెస్టిండీస్‌తో భారత్ నాలుగుసార్లు తలపడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొంది (2011లో), మరో రెండు మ్యాచ్‌ల్లో (1994, 2007లో) ఓడిపోయింది. చివరిసారి ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది. -
టి20లోనూ బంగ్లాదే విజయం
మిర్పూర్: ఫార్మాట్ మారినా పాకిస్తాన్ ఆటతీరులో మార్పు రాలేదు. కెప్టెన్‌గా ఆఫ్రిది వచ్చినా రాత మారలేదు. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్... అదే జోరులో ఏకైక టి20లోనూ పాక్‌ను చిత్తు చేసింది. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో నెగ్గింది. పాక్‌పై టి20ల్లో బంగ్లాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ముక్తార్ అహ్మద్ (30 బంతుల్లో 37; 5 ఫోర్లు; 1 సిక్స్), హరీస్ సోహైల్ (24 బంతుల్లో 30 నాటౌట్; 1 సిక్స్) రాణించారు. రహమాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 16.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 143 పరుగులు చేసి నెగ్గింది. తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు అవుటైనా... షకీబ్ అల్ హసన్ (41 బంతుల్లో 57 నాటౌట్; 9 ఫోర్లు), సబ్బీర్ రహమాన్ (32 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెలరేగి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 105 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ 28 నుంచి ప్రారంభమవుతుంది. -
ఇక కూనలు కాదు
పాక్‌పై బంగ్లా క్లీన్‌స్వీప్ అద్భుతం ప్రపంచకప్ ద్వారా పెరిగిన విశ్వాసం సాక్షి క్రీడావిభాగం మనం ఐపీఎల్ సంబరంలో ఉండి సరిగా పట్టించుకోలేదు కానీ... బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై సాధించింది సామాన్యమైన ఘనత కాదు. పాకిస్తాన్‌ను మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో ఓడించడం చాలా పెద్ద విజయం. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ సాధికారికంగా గెలిచారు. ఏదో అదృష్టవశాత్తూనో లేక ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనతో కాదు. మొత్తం అందరూ సమష్టిగా రాణించి మూడు ఘన విజయాలు సాధించారు. సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ప్రపంచం ఈ ఫలితాన్ని ఊహించలేదు. పెరిగిన ఆత్మవిశ్వాసం ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం, భారత్‌తో అంపైరింగ్ నిర్ణయాలు వ్యతిరేకంగా రాకపోతే సెమీస్‌కు చేరేవాళ్లమనే భావన బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచాయి. దీనికి తోడు స్వదేశం చేరుకున్న తర్వాత జరిగిన సన్మానాలు బంగ్లా క్రికెటర్లకు కొత్త ‘కిక్’ ఇచ్చాయి. దేశం మొత్తం స్టార్స్‌గా ఆరాధించడం మొదలుపెట్టింది. దీంతో పాక్‌తో సిరీస్‌కు కొత్త ఉత్సాహంతో సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల్లోనూ కలిసి టాప్-6 బ్యాట్స్‌మెన్ మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. గుల్, రియాజ్, అజ్మల్ లాంటి స్టార్స్ ఉన్న బౌలింగ్ లైనప్‌పై ఇంత బాగా ఆడటం అభినందనీయం. ముఖ్యంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో అద్భుతమైన నిలకడ చూపించాడు. ముష్ఫికర్, సౌమ్య సర్కార్ చెరో సెంచరీ చేశారు. ఇక షకీబ్ తన ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని కొనసాగిస్తే... బౌలింగ్‌లో అరాఫత్ సన్నీ, రూబెల్ హొస్సేన్ ఆకట్టుకున్నారు. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బంగ్లా... పాక్‌ను చిత్తు చేసింది. ఇకపై జాగ్రత్తగా... ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌లో సిరీస్ ఆడాల్సి ఉంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, కొత్త క్రికెటర్లను బీసీసీఐ గనక పంపితే... ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో బంగ్లా మనకూ షాక్ ఇస్తుంది. కాబట్టి ఇకపై భారత్‌తో పాటు ఏ జట్టయినా సరే బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే చాలా జాగ్రత్తగా ఆడి తీరాల్సిందే. పాక్‌లో ఆగ్రహజ్వాలలు మరోవైపు పాకిస్తాన్లో తమ జట్టు ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ దేశ క్రికెట్ చరిత్రలో ఇది దారుణమైన ఓటమి అని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. కోచ్‌తో పాటు టీమ్ మేనేజ్మెంట్ మొత్తాన్ని మార్చాలని, బోర్డును, సెలక్షన్ కమిటీని కూడా ప్రక్షాళన చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇక పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్ సరిగా లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్‌ఖాన్ మాత్రం దీనిని తేలికగానే తీసుకున్నారు. ‘సిరీస్ ఓటమి బాధాకరమే అయినా ఈ ఓటమి గురించి అంతగా ఆందోళన అనవసరం. అయితే జట్టు తిరిగి వచ్చాక మాత్రం దీనిపై విచారణ చేస్తాం’ అని ఖాన్ వ్యాఖ్యానించారు.