వన్డే వరల్డ్‌కప్‌నామ సంవత్సరమిది... అదీ భారత గడ్డపై... ఈ నేపథ్యంలో అక్టోబరుకు ముందు ఇకపై జరిగే వన్డేలన్నీ భారత్‌కు సన్నాహకాలే... మధ్యలో ఐపీఎల్ రూపంలో టి20లు ఉన్నా, వన్డే జట్టు ఎంపికకు, తుది జట్టు కూర్పు కొరకు ఈ మ్యాచ్‌ల ప్రదర్శనే కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. ఆసియాకప్ కాకుండా టీమిండియా కనీసం 15 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేటినుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంకను భారత్ ఎదుర్కొంటుంది.
గువహటి: శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. నేడు జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రాకతో భారత బృందం మరింత పటిష్టంగా మారగా... లంక దాదాపు అదే జట్టుతో మరో పోరాటానికి సిద్ధమైంది. తొలి రెండు టి20లు హోరాహోరీగా సాగినా... చివరి మ్యాచ్‌లో ఏకపక్ష విజయంతో భారత్ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది. అయితే ఆ సిరీస్‌లో చూపిన ప్రదర్శన లంక జట్టులో ఆత్మ విశ్వాసం పెంచింది. 2017 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది.
ఓపెనర్‌గా గిల్...
బంగ్లాదేశ్‌తో చివరి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో ‘డబుల్ సెంచరీ’ సాధించినా... ఇషాన్ కిషన్‌కు ఈ మ్యాచ్‌లో మాత్రం చాన్స్ లేదు. కెప్టెన్ రోహిత్ రాకతో అతనిపై వేటు ఖాయమైంది. ఇషాన్‌కు అవకాశం ఇవ్వలేమని రోహిత్ స్పష్టం చేసేశాడు కూడా. వన్డేల్లో ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకున్న శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. టి20ల్లో ఆడని కోహ్లి తనకు బాగా అచ్చి వచ్చిన ఫార్మాట్‌లో మళ్లీ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు.
లంకపై ఏకంగా 8 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేసిన ఘనమైన రికార్డు కోహ్లికి ఉంది. గత ఏడాది 55.69 సగటుతో 724 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్‌కు మిడిలార్డర్‌లో చోటు ఖాయం కాగా... వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ కూడా బరిలోకి దిగుతాడు.
దాంతో టి20ల్లో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్‌కు చోటు కష్టమే. పైగా వన్డేల్లో ఇప్పటి వరకు సూర్య ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. రాహుల్, శ్రేయస్‌లలో ఒకరిని తప్పించి సూర్యను ఆడించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఆరో స్థానంలో ఆల్‌రౌండర్‌గా కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో జట్టు కూర్పు ఉండవచ్చు.
అక్షర్ పటేల్ ఖాయం కాగా... రెండో స్పిన్నర్‌గా చహల్, కుల్దీప్ యాదవ్‌ల మధ్య పోటీ ఉంది. సీనియర్ పేసర్ షమీ, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా అర్ష్‌దీప్, ఉమ్రాన్‌లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. బంగ్లా చేతిలో సిరీస్ ఓడినా... ఓవరాల్‌పై లంకపై భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది.
అందరూ అంతంతే...
శ్రీలంక జట్టు గత కొంత కాలంగా వన్డేల్లో కాస్త మెరుగైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడం ఆ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన. అయితే సమస్యంతా ఒక్కొక్క ఆటగాడి వన్డే రికార్డుతోనే. ప్రస్తుతం ఉన్న జట్టులో అంతా టి20ల్లో ఆకట్టుకున్నవారే అయినా... వన్డేల్లో రెగ్యులర్‌గా తమను తాను నిరూపించుకున్నవారు ఎవరూ లేరు.
టి20లతో పోలిస్తే వన్డేల్లో సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచి ఇన్నింగ్స్‌ను నిర్మించే సమర్థుడైన బ్యాటర్ గానీ... 10 ఓవర్ల పాటు నిలకడగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల బౌలర్ గానీ జట్టులో కనిపించడం లేదు. టి20ల్లో సత్తా చాటిన షనక వన్డే రికార్డు పేలవం. పైగా అతను ఇప్పటి వరకు భారత గడ్డపై వన్డే ఆడనే లేదు. అదే తరహాలో జట్టు ప్రధాన అస్త్రం హసరంగ కూడా వన్డేల్లో అంతంతే.
ఇద్దరు పేసర్లు రజిత, కుమారలు ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోగా, మదుషంక వన్డేలో అరంగేట్రం చేయలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌కు లంక ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి.
ముఖాముఖి పోరులో
162: ఇప్పటి వరకు భారత్, శ్రీలంక జట్ల మధ్య 162 వన్డేలు జరిగాయి. 93 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. 57 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా... 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక భారత గడ్డపై ఈ రెండు జట్లు 51 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 36 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా... 12 మ్యాచ్‌ల్లో శ్రీలంక విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment