భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పర్యటన మూడో దశకు చేరింది. తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా... హోరాహోరీగా సాగిన టి20ల్లోనూ ముందు వెనుకబడ్డా ఆ తర్వాత చెలరేగి విజేతగా నిలిచింది. ఇక వరల్డ్ చాంపియన్‌తో వన్డే సమరంలోనూ గెలిస్తే విజయం సంపూర్ణమవుతుంది. మరోవైపు ఈ ఫార్మాట్‌లోనైనా సిరీస్ అందుకొని గౌరవంగా స్వదేశం వెళ్లాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్, టి20 ప్రపంచకప్ కారణంగా ఈ ఏడాది వన్డేలకు అంత ప్రాధాన్యత కనిపించకపోయినా... రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
పుణే: స్ఫూర్తిదాయక ప్రదర్శనతో టి20 సిరీస్‌ను గెలుచుకున్న మూడు రోజుల విరామం తర్వాత మరో వేదికపై భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. వరుసగా రెండు టెస్టులు, ఐదు టి20ల తర్వాత మ్యాచ్‌లు జరిగే వేదిక మారినా... కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్ నిర్వహించనున్నారు. 2016–17లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో గెలుచుకుంది.
ధావన్‌కు మరో అవకాశం!
టి20 సిరీస్ ఆడిన భారత జట్టే దాదాపుగా వన్డేల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టి20లో విఫలమై ఆ తర్వాత బెంచీకే పరిమితమైన శిఖర్ ధావన్ వన్డేలో ఓపెనర్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఎప్పటిలాగే రోహిత్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని కెప్టెన్ ఇప్పటికే ప్రకటించాడు. చివరి టి20కు దూరమైన కేఎల్ రాహుల్‌కు కూడా మరో చాన్స్ లభించవచ్చు. అయితే అది మిడిలార్డర్‌లోనే. సూర్యకుమార్ లాంటి కొత్త ఆటగాళ్ల నుంచి తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో తన స్థానం నిలబెట్టుకోవాలంటే రాహుల్ సత్తా చాటాల్సిందే. తనకే సొంతమైన మూడో స్థానంలో ఆడే కోహ్లి, అయ్యర్ తర్వాత రాహుల్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగే సమయంలో వ్యూహం మారితే అతనికంటే ముందు పంత్ బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఖాయం కాగా... ముగ్గురు పేసర్లుగా భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్, నటరాజన్ సిద్ధంగా ఉన్నారు. కొత్తగా ఎంపికైన ప్రసిధ్ కృష్ణకు తొలి మ్యాచ్‌లోనే అవకాశం రాకపోవచ్చు. స్పిన్నర్లలో చహల్, కుల్దీప్‌లలో ఒక్కరే బరిలోకి దిగుతారు. రెండో స్పిన్నర్‌గా సుందర్‌ను ఆడించాలని భావిస్తే శార్దుల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది.
లివింగ్‌స్టోన్‌కు చాన్స్!
వన్డేల్లో రెగ్యులర్ ఆటగాళ్లు రూట్, వోక్స్‌లకు సిరీస్ నుంచి ఇంగ్లండ్ విశ్రాంతినివ్వగా... ఆర్చర్ గాయంతో వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కవచ్చు. ఇటీవల ఇంగ్లండ్ దేశవాళీ వన్డేల్లో ఆకట్టుకున్న లివింగ్‌స్టోన్ తన అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. లెగ్‌స్పిన్నర్ పార్కిన్‌సన్ కూడా అవకాశాన్ని ఆశిస్తుండగా, రషీద్‌ను పక్కన పెట్టి ఇంగ్లండ్ ఆ మార్పు చేయగలదా అనేది చూడాలి. ఓపెనర్లుగా రాయ్, బెయిర్‌స్టో బరిలోకి దిగనుండగా, కీపర్ బట్లర్ మిడిలార్డర్‌లో ఆడతాడు. టి20ల్లో ఆకట్టుకోని కెప్టెన్ మోర్గాన్ తనకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో చెలరేగాల్సి ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేల్లోనూ మ్యాచ్‌ను శాసించగలడు. లార్డ్స్‌లో జరిగిన చిరస్మరణీయ 2019 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత అతను ఆడనున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. పేసర్ మార్క్ వుడ్ మరోసారి తన వేగాన్ని నమ్ముకోగా, టాప్లీ కొత్త బంతిని పంచుకుంటాడు. మూడో పేసర్‌గా అన్నదమ్ములు స్యామ్, టామ్ కరన్‌ల మధ్య పోటీ ఉంది.
పిచ్, వాతావరణం
మొదటి నుంచి పుణే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ నాలుగు వన్డేలు జరగ్గా మూడుసార్లు 300కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. వర్షం సమస్య లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, అయ్యర్, పంత్, రాహుల్, హార్దిక్, భువనేశ్వర్, శార్దుల్, చహల్/కుల్దీప్, నటరాజన్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, బిల్లింగ్స్, లివింగ్‌స్టోన్, స్యామ్/టామ్ కరన్, రషీద్, టాప్లీ, వుడ్.
చిన్నారితో...
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి తన రెండు నెలల పాపతో కలిసి మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చాడు. పుణే విమానాశ్రయంలో భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి ఉన్న చిత్రాలు ప్రధాన ఆకర్షణగా మారాయి. అనుష్క చేతుల్లో అమ్మాయి ఉండగా... కోహ్లి చేతుల్లో మొత్తం లగేజీ కనిపించడం కూడా సోషల్ మీడియాలో ‘మీమ్’లకు పని పెట్టాయి!
పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్
Published Tue, Mar 23 2021 5:02 AM | Last Updated on Tue, Mar 23 2021 10:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment