
ముంబై: ఇంగ్లండ్‌తో తలపడే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందంలో ముగ్గురు ఆటగాళ్లకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. కర్ణాటక పేస్ బౌలర్, గతంలో భారత ‘ఎ’ జట్టుకు ఆడిన ప్రసిధ్ కృష్ణ జాతీయ సీనియర్ జట్టులో ఎంపిక కావడం ఇదే తొలిసారి కాగా... ఇప్పటికే టి20లు ఆడిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, తాజా టి20 సిరీస్‌లో ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా అవకాశం దక్కింది.
ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టు తరఫున కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసిధ్‌కు దేశవాళీ వన్డేల్లో మంచి రికార్డు ఉంది. 48 వన్డేల్లో అతను 23.07 సగటుతో 81 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున 18 టి20లు ఆడిన కృనాల్ ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్ ప్రదర్శన ఆధారంగా సిరాజ్‌కు మరోసారి వన్డే పిలుపు లభించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్‌లో ఉన్న మయాంక్, మనీశ్ పాండే, సైనీ, సంజూ సామ్సన్ తమ స్థానాలు కోల్పోయారు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు ఈనెల 23, 26, 28వ తేదీల్లో పుణేలో జరుగుతాయి.
జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, గిల్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, పంత్, రాహుల్, చహల్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, సుందర్, నటరాజన్, భువనేశ్వర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్.
Comments
Please login to add a commentAdd a comment