ఆడొచ్చు...అవాంతరం లేకుండా! | India vs West Indies second one day match | Sakshi
Sakshi News home page

ఆడొచ్చు...అవాంతరం లేకుండా!

Published Sun, Aug 11 2019 5:05 AM | Last Updated on Sun, Aug 11 2019 5:17 AM

India vs West Indies second one day match - Sakshi

ఆట కంటే వర్షమే ఎక్కువ చర్చనీయాంశమైంది తొలి వన్డేలో. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండాలని కోరుకుంటూ రెండో వన్డేకు సిద్ధమయ్యాయి భారత్, వెస్టిండీస్‌. ఇరు జట్లు ఈ మ్యాచ్‌ ద్వారా ప్రపంచ కప్‌ నైరాశ్యం నుంచి బయటపడాలని భావిస్తున్నాయి. కూర్పులో మార్పుల్లేకుండానే బరిలో దిగే ఆలోచనలో ఉన్నాయి. విండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు ఇది 300వ వన్డే కావడం ఆతిథ్య జట్టుకు ప్రత్యేకతగా మారింది.   

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వర్షం కారణంగా రద్దయినప్పటికీ... ఆట సాగినంత సేపు తొలి మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా కనిపించింది. అదే ఉత్సాహంతో కోహ్లి సేన ఆదివారం పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ మైదానంలో జరిగే రెండో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడనుంది. గురువారం నాటి మ్యాచ్‌ పూర్తిగా జరగనందున ఇరు జట్లు మార్పుల్లేకుండానే దిగే వీలుంది. విజయం సాధించిన జట్టు మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోని స్థితిలో నిలుస్తుంది కాబట్టి నేటి మ్యాచ్‌లో ఆసక్తికి లోటు ఉండకపోవచ్చు. అయితే... అందరి కళ్లు క్రిస్‌ గేల్‌పైనే ఉన్నాయి. కొంతకాలంగా అతడిని విండీస్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచే రికార్డు ఊరిస్తోంది. ఒకప్పటి గేల్‌ అయి ఉంటే ఆ రికార్డు ఎప్పుడో అతడి వశం అయ్యేది. కానీ, ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతు న్న అతడు కనీస సంఖ్యలో పరుగులు చేయలేకపోతున్నాడు. ఆదివారం వాటిని అందుకుంటే ఈ మ్యాచ్‌ కొంత విశిష్టత సంతరించుకుంటుంది.
   అటుఇటు వారే...
యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ను ఆడించాలా? లేదా? అనేది ఒక్కటే తుది జట్టుపై టీమిండియాకు ఉన్న సందిగ్ధత. తొలి వన్డేలో అతడు విండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌కు అడ్డంగా దొరికిపోయాడు. పదేపదే లెగ్‌సైడ్‌ బంతులు వేసి లూయిస్‌ ఫామ్‌లోకి వచ్చేలా చేశాడు. ఖలీల్‌ను తప్పించినా, భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చినా నవదీప్‌ సైనీకి అరంగేట్రం అవకాశం దక్కొచ్చు. పిచ్‌ అనుకూలిస్తుందని భావిస్తే మణికట్టు స్పిన్నర్‌ చహల్‌ను తీసుకునే వీలుంది. ఓవరాల్‌గా చూస్తే... మార్పుల్లేని జట్టును దింపడమే మేలని టీం మేనేజ్‌మెంట్‌ ప్రాథమిక ఉద్దేశంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో నంబరు స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ పరుగులు చేస్తే చూడాలనేది అభిమానుల కోరిక.

సొంతగడ్డ పైనే అయినా.. షమీ, భువీ పేస్‌ను తట్టుకోవడం ఎంత కష్టమో తొలి వన్డేలో విండీస్‌కు తెలిసొచ్చింది. ఏడో నంబరు వరకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ప్రత్యర్థిని కట్టడి చేయాలంటే పేసర్లతో పాటు స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌ తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఓపెనర్‌ లూయిస్‌ పరుగులు సాధించ డం విండీస్‌కు ఊరటనిచ్చినా... గేల్‌ ఫామ్‌ ఆందోళన పరుస్తోంది. ఓపెనర్లు విఫలమైనా హోప్, పూరన్, హెట్‌మైర్, చేజ్‌ రూపంలో విండీస్‌కు నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. లోయరార్డర్‌లో కెప్టెన్‌ హోల్డర్, బ్రాత్‌వైట్‌ రాణించగలరు. రోచ్, కాట్రెల్‌కు తోడు మూడో పేసర్‌గానూ వీరు బాధ్యత తీసుకుంటారు. బౌలింగ్‌లో కొంత బలహీనంగా ఉన్న కరీబియన్లు భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరిస్తేనే గెలుపు అవకాశాలుంటాయి.

పిచ్, వాతావరణం
క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ మైదానం స్పిన్నర్లకు సహకరించే వీలుంది. ఇక్కడ 2010 నుంచి స్పిన్నర్ల సగటు 27.40 కాగా, పేసర్ల సగటు 32.12. ఈ మైదానంలో జరిగిన చివరి ఐదు వన్డేల్లో నాలుగు వర్షం ప్రభావానికి గురయ్యాయి. నేటి మ్యాచ్‌కు మాత్రం వాన ముప్పు లేదు. పాక్షికంగా మేఘావృతమై... 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వాతావరణం ఆటకు అన్ని విధాల అనుకూలంగా ఉండనుంది.

గేల్‌ @ 300
విండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ ఈ మ్యాచ్‌తో 300 వన్డేలు ఆడిన 21వ ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాక లారా (299 వన్డేలు)ను అధిగమించి ఆ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌ కానున్నాడు. మరో 9 పరుగులు చేస్తే వన్డేల్లో లారా (10,405) అత్యధిక పరుగుల రికార్డును కూడా అతడు దాటే వీలుంది. గేల్‌ ప్రస్తుతం 10,397 పరుగులతో ఉన్నాడు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి, అయ్యర్, జాదవ్, పంత్, జడేజా, కుల్దీప్, భువనేశ్వర్, షమీ, ఖలీల్‌.
వెస్టిండీస్‌: గేల్, లూయిస్, హోప్, పూరన్, హెట్‌మైర్, చేజ్, హోల్డర్‌ (కెప్టెన్‌), అలెన్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement