second oneday
-
ఆసీస్ మహిళలదే సిరీస్
బ్రిస్బేన్: అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా అత్యధిక వన్డేలు (21) గెలిచిన తమ పురుషుల జట్టు రికార్డును సమం చేసేందుకు ఆస్ట్రేలియా మహిళల టీమ్ మరింత చేరువైంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ మహిళల టీమ్‌పై విజయం సాధించింది. ఆసీస్‌కు ఇది వరుసగా 20వ వన్డే విజయం కావడం విశేషం. 2003లో రికీ పాంటింగ్ నాయకత్వంలోని కంగారూ జట్టు వరుసగా 21 వన్డేలు గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (115 బంతుల్లో 79; 7 ఫోర్లు), అమేలీ సాటర్‌వైట్ (73 బంతుల్లో 69; 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. జెస్ జొనాసెన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆసీస్ 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 255 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (96 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అజేయ శతకం సాధించగా, రాచెల్ హేన్స్ (89 బంతుల్లో 82; 13 ఫోర్లు, 1 సిక్స్) సహకరించింది. లానింగ్‌కు ఇది 14వ వన్డే సెంచరీ కావడం విశేషం. ఈ గెలుపుతో ఆసీస్ మహిళల జట్టు మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది. -
ఆడొచ్చు...అవాంతరం లేకుండా!
ఆట కంటే వర్షమే ఎక్కువ చర్చనీయాంశమైంది తొలి వన్డేలో. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండాలని కోరుకుంటూ రెండో వన్డేకు సిద్ధమయ్యాయి భారత్, వెస్టిండీస్. ఇరు జట్లు ఈ మ్యాచ్ ద్వారా ప్రపంచ కప్ నైరాశ్యం నుంచి బయటపడాలని భావిస్తున్నాయి. కూర్పులో మార్పుల్లేకుండానే బరిలో దిగే ఆలోచనలో ఉన్నాయి. విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఇది 300వ వన్డే కావడం ఆతిథ్య జట్టుకు ప్రత్యేకతగా మారింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వర్షం కారణంగా రద్దయినప్పటికీ... ఆట సాగినంత సేపు తొలి మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా కనిపించింది. అదే ఉత్సాహంతో కోహ్లి సేన ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానంలో జరిగే రెండో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడనుంది. గురువారం నాటి మ్యాచ్ పూర్తిగా జరగనందున ఇరు జట్లు మార్పుల్లేకుండానే దిగే వీలుంది. విజయం సాధించిన జట్టు మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోని స్థితిలో నిలుస్తుంది కాబట్టి నేటి మ్యాచ్‌లో ఆసక్తికి లోటు ఉండకపోవచ్చు. అయితే... అందరి కళ్లు క్రిస్ గేల్‌పైనే ఉన్నాయి. కొంతకాలంగా అతడిని విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచే రికార్డు ఊరిస్తోంది. ఒకప్పటి గేల్ అయి ఉంటే ఆ రికార్డు ఎప్పుడో అతడి వశం అయ్యేది. కానీ, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతు న్న అతడు కనీస సంఖ్యలో పరుగులు చేయలేకపోతున్నాడు. ఆదివారం వాటిని అందుకుంటే ఈ మ్యాచ్ కొంత విశిష్టత సంతరించుకుంటుంది. అటుఇటు వారే... యువ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను ఆడించాలా? లేదా? అనేది ఒక్కటే తుది జట్టుపై టీమిండియాకు ఉన్న సందిగ్ధత. తొలి వన్డేలో అతడు విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్‌కు అడ్డంగా దొరికిపోయాడు. పదేపదే లెగ్‌సైడ్ బంతులు వేసి లూయిస్ ఫామ్‌లోకి వచ్చేలా చేశాడు. ఖలీల్‌ను తప్పించినా, భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చినా నవదీప్ సైనీకి అరంగేట్రం అవకాశం దక్కొచ్చు. పిచ్ అనుకూలిస్తుందని భావిస్తే మణికట్టు స్పిన్నర్ చహల్‌ను తీసుకునే వీలుంది. ఓవరాల్‌గా చూస్తే... మార్పుల్లేని జట్టును దింపడమే మేలని టీం మేనేజ్మెంట్ ప్రాథమిక ఉద్దేశంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో నంబరు స్థానంలో శ్రేయస్ అయ్యర్ పరుగులు చేస్తే చూడాలనేది అభిమానుల కోరిక. సొంతగడ్డ పైనే అయినా.. షమీ, భువీ పేస్‌ను తట్టుకోవడం ఎంత కష్టమో తొలి వన్డేలో విండీస్‌కు తెలిసొచ్చింది. ఏడో నంబరు వరకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ప్రత్యర్థిని కట్టడి చేయాలంటే పేసర్లతో పాటు స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఓపెనర్ లూయిస్ పరుగులు సాధించ డం విండీస్‌కు ఊరటనిచ్చినా... గేల్ ఫామ్ ఆందోళన పరుస్తోంది. ఓపెనర్లు విఫలమైనా హోప్, పూరన్, హెట్‌మైర్, చేజ్ రూపంలో విండీస్‌కు నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. లోయరార్డర్లో కెప్టెన్ హోల్డర్, బ్రాత్‌వైట్ రాణించగలరు. రోచ్, కాట్రెల్‌కు తోడు మూడో పేసర్‌గానూ వీరు బాధ్యత తీసుకుంటారు. బౌలింగ్‌లో కొంత బలహీనంగా ఉన్న కరీబియన్లు భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరిస్తేనే గెలుపు అవకాశాలుంటాయి. పిచ్, వాతావరణం క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానం స్పిన్నర్లకు సహకరించే వీలుంది. ఇక్కడ 2010 నుంచి స్పిన్నర్ల సగటు 27.40 కాగా, పేసర్ల సగటు 32.12. ఈ మైదానంలో జరిగిన చివరి ఐదు వన్డేల్లో నాలుగు వర్షం ప్రభావానికి గురయ్యాయి. నేటి మ్యాచ్‌కు మాత్రం వాన ముప్పు లేదు. పాక్షికంగా మేఘావృతమై... 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణం ఆటకు అన్ని విధాల అనుకూలంగా ఉండనుంది. గేల్ @ 300 విండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌తో 300 వన్డేలు ఆడిన 21వ ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాక లారా (299 వన్డేలు)ను అధిగమించి ఆ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ కానున్నాడు. మరో 9 పరుగులు చేస్తే వన్డేల్లో లారా (10,405) అత్యధిక పరుగుల రికార్డును కూడా అతడు దాటే వీలుంది. గేల్ ప్రస్తుతం 10,397 పరుగులతో ఉన్నాడు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, కోహ్లి, అయ్యర్, జాదవ్, పంత్, జడేజా, కుల్దీప్, భువనేశ్వర్, షమీ, ఖలీల్. వెస్టిండీస్: గేల్, లూయిస్, హోప్, పూరన్, హెట్‌మైర్, చేజ్, హోల్డర్ (కెప్టెన్), అలెన్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్. -
శ్రీమతికి బహుమతి
మా రెండో పెళ్లి రోజున చేసిన ఈ ద్విశతకం నా శ్రీమతి రితికా సజ్దేకు అంకితం. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమె ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆమే నా బలం. నా కోసం ఎప్పుడూ అక్కడే ఉండాలి. ఈ ఒత్తిడి ఆటలో అది ప్రత్యేకంగా నిలుస్తుంది. మ్యాచ్‌లో ఎలా వ్యవహరించాలనేదానిపై గట్టిగా నిర్ణయించుకున్నాం. దానినే చివరి వరకు అమలు చేశాం. ఇప్పుడిక విశాఖపట్నం మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. నా ద్విశతకాల్లో మూడూ కీలక సమయాల్లోనే చేశా. ఏదో ఒకదానిని ఎంచుకోమంటే మాత్రం చెప్పలేను. గాయం నుంచి కోలుకుని కోల్‌కతాలో చేసిన 264ను కొంచెం ఎక్కువ గుర్తుంచుకుంటా. ధర్మశాలలో ఓడిపోయి జట్టుగా పై చేయి సాధించాల్సిన స్థితిలో చేసిన ప్రస్తుత డబుల్ సెంచరీ కూడా ప్రత్యేకమైనదే. ఈ మ్యాచ్‌లో తొలి వంద పరుగులను వేగంగా చేసినా... వికెట్ ఇచ్చేవాడిని కాదు. నా గత డబుల్ సెంచరీలను కూడా నిదానంగానే ప్రారంభించి చేశాను. – రోహిత్ శర్మ, భారత కెప్టెన్ మూడూ (ముద్దూ) ముచ్చట... 49వ ఓవర్ ముగిసేసరికి రోహిత్ స్కోరు 191 పరుగులు... అతను డబుల్ పూర్తి చేయగలడా అని అందరిలో ఉత్సుకత. గ్యాలరీలో కూర్చున్న అతని భార్య రితిక మొహంలో ఎంతో ఆందోళన కనిపిస్తోంది. అయితే పెరీరా వేసిన తొలి బంతినే రోహిత్ సిక్స్ సాయంతో 197కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసే ప్రయత్నంలో రనౌటయ్యే ప్రమాదం కనిపించింది. ఈ సమయంలోనైతే రితిక చూడలేక కళ్లు మూసుకుంది. అనంతరం మూడో బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడి డబుల్ పూర్తి చేసుకున్న రోహిత్ గాల్లోకి ఎగిరి గర్జన చేశాడు. అతనితో పాటు రితిక కూడా భావోద్వేగాలు దాచుకోలేక కంట తడి పెట్టింది. డిసెంబర్ 13 వీరిద్దరి పెళ్లి రోజు కూడా కావడంతో రోహిత్ తన ఉంగరం వేలిని చుంబిస్తూ రితిక వైపు ముద్దులు విసిరి సంబరం జరుపుకోవడం స్టేడియంలోని అభిమానుల మోముపై చిరునవ్వులు పూయించేలా చేసింది. -
'డబుల్' ట్రిపుల్
రోహిత్ శర్మ కొడితే అలా ఇలా ఉండదు... ఎలా ఉంటుందంటే శ్రీలంకను అడిగితే చెబుతుంది. అటు క్లాస్, ఇటు మాస్ కలగలిపి సాగిన రోహిత్ బాదుడుకు క్రికెట్ ప్రపంచం కొత్త రికార్డులతో స్వాగతం పలికింది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం అంటే ఎవరెస్ట్‌ను ఎక్కినంత సంబరంగా భావించే సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డబుల్ సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు ఈ ముంబైకర్. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇంతకు ముందే రెండో ద్విశతకంతో మురిపించిన అతను మరో హీరోచిత ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. వన్డేల్లో ఏడు డబుల్ సెంచరీలు నమోదైతే మూడు రోహిత్‌వే ఉండటం అతని స్థాయిని చూపిస్తోంది. గతంలోనే ఒకసారి రోహిత్ దెబ్బ రుచి చూసిన శ్రీలంకను భారత హిట్‌మ్యాన్ మళ్లీ ఆడుకున్నాడు. బంతి వేస్తే చాలు రాకెట్ వేగంతో గాల్లో తేలుతూ అలా సిక్సర్‌గా మారుతుంటే లంక ఆటగాళ్లు నిస్సహాయంగా మారిపోయి ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. 13 ఫోర్లు, 12 సిక్సర్లు... 124 పరుగులు బౌండరీల రూపంలోనే రాబట్టి రోహిత్ వీర విధ్వంసం సృష్టించాడు. అతడిని అవుట్ చేయడం తమ వల్ల కాదంటూ లంక చేతులెత్తేసిన వేళ ఈ భారత బ్యాట్స్‌మన్ తనకు సుస్థిర స్థానాన్ని తనే స్వయంగా లిఖించుకున్నాడు. తన చండ ప్రచండ బ్యాటింగ్‌తో కెప్టెన్‌గా కూడా తొలి విజయాన్ని అందుకున్నాడు. మొహాలీ: తొలి మ్యాచ్‌లో పరాజయానికి భారత్ అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది. బలమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని కుదేలు చేసి గట్టిగా బదులిచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ముందుండి గెలిపించాడు. బుధవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 141 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (153 బంతుల్లో 208 నాటౌట్; 13 ఫోర్లు, 12 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 88; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (67 బంతుల్లో 68; 9 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులే చేయగలిగింది. మాథ్యూస్ (132 బంతుల్లో 111 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం చేసినా లాభం లేకపోయింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది. రాణించిన ధావన్, అయ్యర్... టాస్ గెలిచిన శ్రీలంక గత మ్యాచ్‌లాగే పిచ్‌పై తేమను నమ్ముకొని భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టు ఆశించిన విధంగానే తొలి పది ఓవర్ల పాటు లంకదే ఆధిపత్యం సాగింది. కానీ ఆ తర్వాత రోహిత్ వీర విజృంభణకు తోడు అయ్యర్, ధావన్ ఆట మొత్తం సీన్‌ను మార్చేసింది. ఆరంభంలో బంతి బాగా స్వింగ్ కావడంతో పాటు భారత ఓపెనర్లు కూడా జాగ్రత్తగా ఆడటంతో పరుగులు పెద్దగా రాలేదు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 33 పరుగులే చేయగలిగింది. అయితే 11వ ఓవర్లో ధావన్ వరుసగా రెండు ఫోర్లతో దూకుడు మొదలు పెట్టిన తర్వాత జట్టు దూసుకుపోయింది. అనంతరం ప్రదీప్ ఓవర్లో ధావన్ మరో 3 బౌండరీలతో జోరు పెంచి 47 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే పతిరాణా బౌలింగ్‌లో ధావన్ అవుట్ కావడంతో 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ధాటిగా ఆడుతూ రోహిత్‌కు సహకారం అందించాడు. చూడచక్కటి షాట్లతో సరిగ్గా 50 బంతుల్లోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేశాడు. లక్మల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి సెంచరీ దిశగా వెళ్లిన అయ్యర్ దురదృష్టవశాత్తూ ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. రోహిత్, అయ్యర్ రెండో వికెట్‌కు 213 పరుగులు జోడించారు. ధోని (7), పాండ్యా (8) విఫలమైనా... రోహిత్ జోరుతో చివరి 10 ఓవర్లలో భారత్ 147 పరుగులు సాధించింది. మాథ్యూస్ మినహా... దాదాపు అసాధ్యంగా కనిపించిన లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు పూర్తిగా తడబడింది. మాథ్యూస్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్లో తరంగ (7) వెనుదిరగ్గా, గుణతిలక (16) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. తొలి మ్యాచ్ ఆడుతున్న∙వాషింగ్టన్ సుందర్... తిరిమన్నె(21)ను అవుట్ చేయడంతో కెరీర్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. «డిక్వెలా (22)ను చహల్ పెవిలియన్ చేర్చాడు. మాథ్యూస్, డిక్వెలా నాలుగో వికెట్‌కు జోడించిన 53 పరుగులే ఆ జట్టులో అత్యధిక భాగస్వామ్యం. ఆ తర్వాత గుణరత్నే (34; 5 ఫోర్లు) కొద్ది సేపు మాథ్యూస్‌కు సహకరించాడు. చివరకు 122 బంతుల్లో మాథ్యూస్ తన కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నా... జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. పరుగులు పోటెత్తాయిలా... తొలి వంద పరుగులు పూర్తి చేసేందుకు 115 బంతులు పడితే... తర్వాతి వందకు రోహిత్‌కు 36 బంతులే సరిపోయాయి. ఆట సాగిన కొద్దీ అతని ఇన్నింగ్స్ ఎంత భీకరంగా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. ఎప్పటిలాగే రోహిత్ తనదైన శైలిలో నెమ్మదిగా ప్రారంభించి... తర్వాత మెల్లగా వేగం పెంచి చివర్లో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ గత రెండు డబుల్ సెంచరీల సమయంలో కూడా దాదాపు ఇదే తరహాలో పరుగులు చేశాడు. ఈ సారి మొహాలీలో పెద్ద బౌండరీలు కూడా ఈ హిట్‌మ్యాన్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. మాథ్యూస్ వేసిన తొలి ఓవర్‌ను రోహిత్ మెయిడిన్‌గా ఆడాడు. చివరకు 9వ బంతికి అతను ఖాతా తెరిచాడు. గత మ్యాచ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యతనివ్వడంతో పవర్‌ప్లేలో అతని స్కోరు 32 బంతుల్లో 15 మాత్రమే. పతిరాణా వేసిన ఓవర్లో రెండు ఫోర్లతో మొదటి సారి రోహిత్ బ్యాటింగ్‌లో చమక్కు కనిపించింది. 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత అతను మెల్లగా గేర్లు మార్చాడు. ప్రదీప్ వేసిన 27వ ఓవర్లో తన ట్రేడ్‌మార్క్ స్టయిల్లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్సర్ డజనులో మొదటిది. ఆ తర్వాత పతిరాణా బౌలింగ్‌లో సింగిల్‌తో రోహిత్ కెరీర్లో 16వ సెంచరీ పూర్తయింది. శతకం దాటినా కూడా అప్పటిదాకా ఆడింది సాధారణ ఇన్నింగ్స్‌లాగే కనిపించింది. 43వ ఓవర్ ముగిసే సరికి రోహిత్ స్కోరు 126 బంతుల్లో 116 పరుగులే. ఆ తర్వాత మొదలైంది అసలు ప్రభంజనం. ధర్మశాల హీరో లక్మల్ వేసిన 44వ ఓవర్ రెండో బంతిని మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఆ వెంటనే పట్టు తప్పి లక్మల్ వైడ్ వేశాడు. ఆ తర్వాతి మూడు బంతులను 6, 6, 6 లుగా బాది అతనికి రోహిత్ తనేమిటో చూపించాడు. ప్రదీప్ వేసిన మరుసటి ఓవర్లో కూడా వరుసగా రెండు సిక్సర్లతో రోహిత్ 150కు చేరుకున్నాడు. అదే ప్రదీప్‌కు తర్వాతి ఓవర్లో వరుసగా 4,4,6తో మళ్లీ రోహిత్ చేతిలో శిక్ష పడింది. రోహిత్ ఈ ఇన్నింగ్స్‌లో తాను ఆడిన చివరి 27 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 92 పరుగులు సాధించగా... ప్రదీప్ పరుగులు ఇవ్వడంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం రోహిత్ చేతిలోనే చావుదెబ్బ తిన్న శ్రీలంకకు ఈసారి మళ్లీ అలాంటి అనుభవమే ఎదురైంది. ►153 బంతుల్లో 208 నాటౌట్ ►13 ఫోర్లు ►12 సిక్స్‌లు ►3 రోహిత్ వన్డే కెరీర్లో డబుల్ సెంచరీల సంఖ్య. గతంలో ఆస్ట్రేలియాపై (209; 2013లో బెంగళూరులో), శ్రీలంకపై (264; 2014లో కోల్‌కతాలో) డబుల్ సెంచరీలు చేశాడు. సచిన్, సెహ్వాగ్, గేల్, గప్టిల్ ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు. ►220 భారత్ తరఫున వన్డేల్లో బరిలోకి దిగిన 220వ క్రికెటర్‌గా 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ గుర్తింపు పొందాడు. ►100 వన్డేల్లో 300 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం భారత్‌కిది 100వ సారి. ఆస్ట్రేలియా (96 సార్లు) రెండో స్థానంలో ఉంది. ►1 ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ (45) నిలిచాడు. సచిన్ 1998లో 40 సిక్స్‌లు కొట్టాడు. -
ప్రతీకారంతో రగులుతున్న ఇంగ్లండ్..
కటక్: ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో వన్డేలో నెగ్గి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని విరాట్ కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలివన్డే (పుణే) ఓటమికి కటక్ వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ టీమ్ భావిస్తోంది. ఏ విధంగా చూసినా కటక్ టీమిండియాకు కలిసొస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పటివరకూ భారత్ 15 వన్డేలు ఆడగా అందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, నాలుగింట్లో ఓటమి పాలైంది. అయితే ఇక్కడ జరిగిన గత 5 మ్యాచుల్లో ఓటమనేది లేకుండా టీమిండియా దూసుకుపోతుండటం.. ఇంగ్లండ్ ఆటగాళ్లను కలవరపెడుతుంది. ఇంగ్లండ్ గత 5 మ్యాచుల్లో మూడింటిని నెగ్గింది. రూమ్స్ అడ్జస్ట్ మెంట్ అవకపోవడంతో తొలి వన్డే పూర్తయినా పుణేలోనే ఉన్న ఇరుజట్ల ఆటగాళ్లు బుధవారం కటక్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కటక్‌లోని బరాబతి స్డేడియంలో గురువారం జరగనున్న రెండో వన్డేలో టాస్ కీలకం కానుంది. ఎందుకంటే ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్లకే అనుకూల ఫలితాలు వస్తాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఛేజింగ్ స్టార్ కోహ్లీ తొలి వన్డే తరహాలో రెండో వన్డేలోనూ మరోసారి విజృంభిస్తే సిరీస్ భారత్ వశమవుతుంది. ఇరు జట్లలోనూ చేజింగ్ బ్యాటింగ్‌లో 64.30 సగటుతో కోహ్లీ అందరికంటే ముందున్నాడు. ధోనీ తరహాలోనే కోహ్లీ ఈ స్డేడియంలో విజయాలను కొనసాగిస్తాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా సరే ఈ వన్డేలో గెలిచి సిరీస్ 1-1తో సమయం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
-
ఫార్మాట్ మారింది... పూనకమొచ్చింది!
వీళ్లేనా... మొన్నటిదాకా పరుగులు చేయడానికి వణికిన బ్యాట్స్‌మెన్..! వీళ్లేనా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఆపడానికి ఆపసోపాలు పడ్డ బౌలర్లు..! వీళ్లేనా... ఘోరమైన ఆటతో ఇంటా బయటా తిట్లు తిన్న క్రికెటర్లు..! టెస్టుల్లో ఘోర ఓటమితో కసి పెరిగిందో... లేక ప్రపంచకప్ ఆడాలంటే నిలబడాలని గుర్తొచ్చిందో... కారణం ఏదైనా... ఫార్మాట్ మారగానే భారత క్రికెటర్లు పూనకం వచ్చినట్లు చెలరేగిపోయారు. అటు బ్యాట్స్‌మెన్ కసిదీరా ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడితే... ఇటు బౌలర్లు ప్రత్యర్థిని చుట్టిపారేశారు. ఫలితంగా రెండో వన్డేలో భారత్ 133 పరుగులతో ఘన విజయం సాధించింది. ►ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ ►133 పరుగులతో నెగ్గిన ధోనిసేన ►రైనా సూపర్ సెంచరీ ►రాణించిన ధోని, రోహిత్ ►ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం ►మూడో వన్డే శనివారం కార్డిఫ్: ఇంగ్లండ్ గడ్డపై గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఐదు విజయాలతో భారత్ సత్తా చాటింది. నాటి రికార్డును ఇప్పుడు కొనసాగిస్తూ భారత్ మరోసారి అదే తరహా స్ఫూర్తిదాయక ఆటతీరును కనబర్చింది. అప్పటిలాగే జట్టు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. బుధవారం ఇక్కడ సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 133 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సురేశ్ రైనా (75 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించగా... కెప్టెన్ ధోని (51 బంతుల్లో 52; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (87 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రైనా, ధోని ఐదో వికెట్‌కు 16.5 ఓవర్లలోనే 144 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఇంగ్లండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఆ జట్టు 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ హేల్స్ (63 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జడేజా 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. ఆదుకున్న రోహిత్ ఆరంభంలో ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తన మూడో ఓవర్ తొలి బంతికి ధావన్ (11)ను అవుట్ చేసిన వోక్స్, మరో రెండు బంతులకే కోహ్లి (0)ని డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఎదుర్కొన్న మూడో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన విరాట్, తన టెస్టు సిరీస్ వైఫల్యాన్ని కొనసాగించడంతో స్కోరు 19/2 వద్ద నిలిచింది. అయితే రోహిత్ శర్మ, రహానే (47 బంతుల్లో 41; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. రోహిత్ 82 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరు ట్రెడ్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. భారీ భాగస్వామ్యం ఈ దశలో రైనా, ధోనిల భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. మొదట్లో నెమ్మదిగానే ఆడిన రైనా, ఆ తర్వాత చెలరేగిపోయాడు. 49 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. తర్వాత జోరు మరింత పెంచి 74 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు కెప్టెన్ కూడా తనదైన శైలిలో షాట్లు ఆడి 49 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోరుతో భారత్ రెండో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసింది. తొలి 37 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేస్తే... చివరి 13 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయడం విశేషం. బౌలర్ల జోరు భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ వేగంగా ఆడలేదు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన హేల్స్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ కుక్ (19), బెల్ (1)లను ఒకే ఓవర్లో అవుట్ చేసి షమీ ప్రత్యర్థి జట్టును నియంత్రించాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో రూట్ (4), హేల్స్, బట్లర్ (2) వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) ట్రెడ్‌వెల్ 52; ధావన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 11; కోహ్లి (సి) కుక్ (బి) వోక్స్ 0; రహానే (స్టం) బట్లర్ (బి) ట్రెడ్‌వెల్ 41; రైనా (సి) అండర్సన్ (బి) వోక్స్ 100; ధోని (బి) వోక్స్ 52; జడేజా నాటౌట్ 9; అశ్విన్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 304. వికెట్ల పతనం: 1-19; 2-19; 3-110; 4-132; 5-276; 6-288. బౌలింగ్: అండర్సన్ 10-1-57-0; వోక్స్ 10-1-52-4; జోర్డాన్ 10-0-73-0; స్టోక్స్ 7-0-54-0; రూట్ 3-0-14-0; ట్రెడ్‌వెల్ 10-1-42-2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (ఎల్బీ) (బి) షమీ 19; హేల్స్ (సి) అశ్విన్ (బి) జడేజా 40; బెల్ (బి) షమీ 1; రూట్ (బి) భువనేశ్వర్ 4; మోర్గాన్ (సి) షమీ (బి) అశ్విన్ 28; బట్లర్ (సి) కోహ్లి (బి) జడేజా 2; స్టోక్స్ (సి) రహానే (బి) జడేజా 23; వోక్స్ (స్టం) ధోని (బి) జడేజా 20; జోర్డాన్ (ఎల్బీ) (బి) రైనా 0; ట్రెడ్‌వెల్ (సి) జడేజా (బి) అశ్విన్ 10; అండర్సన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (38.1 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1-54; 2-56; 3-63; 4-81; 5-85; 6-119; 7-126; 8-128; 9-143; 10-161 బౌలింగ్: భువనేశ్వర్ 7-0-30-1; మోహిత్ శర్మ 6-1-18-0; షమీ 6-0-32-2; అశ్విన్ 9.1-0-38-2; జడేజా 7-0-28-4; రైనా 3-0-12-1. అదే వేదిక... అవే పరుగులు మూడేళ్ల క్రితం...ఇదే వేదికపై భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే...ఇరు జట్ల కెప్టెన్లు ధోని, కుక్... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌కు ముందు ఇంగ్లండ్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. ఆ తర్వాత మళ్లీ లక్ష్యం మారి డక్‌వర్త్ లూయీస్ ప్రకారం ఇంగ్లండ్ గెలిచింది. ఇప్పుడూ అదే మైదానం...నాయకులూ వారే. భారత్ సరిగ్గా అదే స్కోరు చేసింది. నాడు కోహ్లి సెంచరీ చేస్తే నేడు రైనా శతకం బాదాడు. ఇంగ్లండ్ లక్ష్యం కూడా సరిగ్గా అదే. ఈ సారి మాత్రం ఫలితం మారింది. 11 బంతుల ఓవర్... ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ ఇంగ్లండ్ కెప్టెన్‌కు అసహనాన్ని మిగల్చగా, భారత్‌కు 13 పరుగులు అందించింది. ఏ మాత్రం నియంత్రణ లేకుండా సాగిన బౌలింగ్‌తో జోర్డాన్ ఆ ఓవర్లో ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. ధోని ఒక ఫోర్ కొట్టగా, మరో నాలుగు సింగిల్స్ వచ్చాయి. మ్యాచ్‌లో మొత్తంగా జోర్డాన్ ఒక్కడే 12 వైడ్లు విసరగా, ఇంగ్లండ్ ఎక్స్‌ట్రాల రూపంలోనే 29 పరుగులు ఇచ్చింది. 1 ఉపఖండం వెలుపల రైనాకు ఇదే తొలి సెంచరీ 4 రైనా కెరీర్లో ఇది నాలుగో సెంచరీ. 2010 జనవరిలో తన మూడో సెంచరీ నమోదు చేసిన రైనా... 95 ఇన్నింగ్స్‌ల తర్వాత మరో సెంచరీ సాధించాడు. 1 వన్డేల చరిత్రలో ఐదో వికెట్‌కు 2000కు పైగా పరుగులు జోడించిన తొలి జోడి ధోని, రైనా.