
రోహిత్ శర్మ కొడితే అలా ఇలా ఉండదు... ఎలా ఉంటుందంటే శ్రీలంకను అడిగితే చెబుతుంది. అటు క్లాస్, ఇటు మాస్ కలగలిపి సాగిన రోహిత్ బాదుడుకు క్రికెట్ ప్రపంచం కొత్త రికార్డులతో స్వాగతం పలికింది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం అంటే ఎవరెస్ట్‌ను ఎక్కినంత సంబరంగా భావించే సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డబుల్ సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు ఈ ముంబైకర్. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇంతకు ముందే రెండో ద్విశతకంతో మురిపించిన అతను మరో హీరోచిత ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. వన్డేల్లో ఏడు డబుల్ సెంచరీలు నమోదైతే మూడు రోహిత్‌వే ఉండటం అతని స్థాయిని చూపిస్తోంది.
గతంలోనే ఒకసారి రోహిత్ దెబ్బ రుచి చూసిన శ్రీలంకను భారత హిట్‌మ్యాన్ మళ్లీ ఆడుకున్నాడు. బంతి వేస్తే చాలు రాకెట్ వేగంతో గాల్లో తేలుతూ అలా సిక్సర్‌గా మారుతుంటే లంక ఆటగాళ్లు నిస్సహాయంగా మారిపోయి ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. 13 ఫోర్లు, 12 సిక్సర్లు... 124 పరుగులు బౌండరీల రూపంలోనే రాబట్టి రోహిత్ వీర విధ్వంసం సృష్టించాడు. అతడిని అవుట్ చేయడం తమ వల్ల కాదంటూ లంక చేతులెత్తేసిన వేళ ఈ భారత బ్యాట్స్‌మన్ తనకు సుస్థిర స్థానాన్ని తనే స్వయంగా లిఖించుకున్నాడు. తన చండ ప్రచండ బ్యాటింగ్‌తో కెప్టెన్‌గా కూడా తొలి విజయాన్ని అందుకున్నాడు.
మొహాలీ: తొలి మ్యాచ్‌లో పరాజయానికి భారత్ అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది. బలమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని కుదేలు చేసి గట్టిగా బదులిచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ముందుండి గెలిపించాడు. బుధవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 141 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (153 బంతుల్లో 208 నాటౌట్; 13 ఫోర్లు, 12 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 88; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (67 బంతుల్లో 68; 9 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులే చేయగలిగింది. మాథ్యూస్ (132 బంతుల్లో 111 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం చేసినా లాభం లేకపోయింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది.
రాణించిన ధావన్, అయ్యర్...
టాస్ గెలిచిన శ్రీలంక గత మ్యాచ్‌లాగే పిచ్‌పై తేమను నమ్ముకొని భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టు ఆశించిన విధంగానే తొలి పది ఓవర్ల పాటు లంకదే ఆధిపత్యం సాగింది. కానీ ఆ తర్వాత రోహిత్ వీర విజృంభణకు తోడు అయ్యర్, ధావన్ ఆట మొత్తం సీన్‌ను మార్చేసింది. ఆరంభంలో బంతి బాగా స్వింగ్ కావడంతో పాటు భారత ఓపెనర్లు కూడా జాగ్రత్తగా ఆడటంతో పరుగులు పెద్దగా రాలేదు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 33 పరుగులే చేయగలిగింది. అయితే 11వ ఓవర్లో ధావన్ వరుసగా రెండు ఫోర్లతో దూకుడు మొదలు పెట్టిన తర్వాత జట్టు దూసుకుపోయింది. అనంతరం ప్రదీప్ ఓవర్లో ధావన్ మరో 3 బౌండరీలతో జోరు పెంచి 47 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే పతిరాణా బౌలింగ్‌లో ధావన్ అవుట్ కావడంతో 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ధాటిగా ఆడుతూ రోహిత్‌కు సహకారం అందించాడు. చూడచక్కటి షాట్లతో సరిగ్గా 50 బంతుల్లోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేశాడు. లక్మల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి సెంచరీ దిశగా వెళ్లిన అయ్యర్ దురదృష్టవశాత్తూ ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. రోహిత్, అయ్యర్ రెండో వికెట్‌కు 213 పరుగులు జోడించారు. ధోని (7), పాండ్యా (8) విఫలమైనా... రోహిత్ జోరుతో చివరి 10 ఓవర్లలో భారత్ 147 పరుగులు సాధించింది.
మాథ్యూస్ మినహా...
దాదాపు అసాధ్యంగా కనిపించిన లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు పూర్తిగా తడబడింది. మాథ్యూస్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్లో తరంగ (7) వెనుదిరగ్గా, గుణతిలక (16) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. తొలి మ్యాచ్ ఆడుతున్న∙వాషింగ్టన్ సుందర్... తిరిమన్నె(21)ను అవుట్ చేయడంతో కెరీర్‌లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. «డిక్‌వెలా (22)ను చహల్ పెవిలియన్ చేర్చాడు. మాథ్యూస్, డిక్‌వెలా నాలుగో వికెట్‌కు జోడించిన 53 పరుగులే ఆ జట్టులో అత్యధిక భాగస్వామ్యం. ఆ తర్వాత గుణరత్నే (34; 5 ఫోర్లు) కొద్ది సేపు మాథ్యూస్‌కు సహకరించాడు. చివరకు 122 బంతుల్లో మాథ్యూస్ తన కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నా... జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు.
పరుగులు పోటెత్తాయిలా...
తొలి వంద పరుగులు పూర్తి చేసేందుకు 115 బంతులు పడితే... తర్వాతి వందకు రోహిత్‌కు 36 బంతులే సరిపోయాయి. ఆట సాగిన కొద్దీ అతని ఇన్నింగ్స్ ఎంత భీకరంగా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. ఎప్పటిలాగే రోహిత్ తనదైన శైలిలో నెమ్మదిగా ప్రారంభించి... తర్వాత మెల్లగా వేగం పెంచి చివర్లో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ గత రెండు డబుల్ సెంచరీల సమయంలో కూడా దాదాపు ఇదే తరహాలో పరుగులు చేశాడు. ఈ సారి మొహాలీలో పెద్ద బౌండరీలు కూడా ఈ హిట్‌మ్యాన్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. మాథ్యూస్ వేసిన తొలి ఓవర్‌ను రోహిత్ మెయిడిన్‌గా ఆడాడు. చివరకు 9వ బంతికి అతను ఖాతా తెరిచాడు. గత మ్యాచ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యతనివ్వడంతో పవర్‌ప్లేలో అతని స్కోరు 32 బంతుల్లో 15 మాత్రమే. పతిరాణా వేసిన ఓవర్లో రెండు ఫోర్లతో మొదటి సారి రోహిత్ బ్యాటింగ్‌లో చమక్కు కనిపించింది. 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత అతను మెల్లగా గేర్లు మార్చాడు. ప్రదీప్ వేసిన 27వ ఓవర్లో తన ట్రేడ్‌మార్క్ స్టయిల్‌లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్సర్ డజనులో మొదటిది. ఆ తర్వాత పతిరాణా బౌలింగ్‌లో సింగిల్‌తో రోహిత్ కెరీర్‌లో 16వ సెంచరీ పూర్తయింది.
శతకం దాటినా కూడా అప్పటిదాకా ఆడింది సాధారణ ఇన్నింగ్స్‌లాగే కనిపించింది. 43వ ఓవర్ ముగిసే సరికి రోహిత్ స్కోరు 126 బంతుల్లో 116 పరుగులే. ఆ తర్వాత మొదలైంది అసలు ప్రభంజనం. ధర్మశాల హీరో లక్మల్ వేసిన 44వ ఓవర్ రెండో బంతిని మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఆ వెంటనే పట్టు తప్పి లక్మల్ వైడ్ వేశాడు. ఆ తర్వాతి మూడు బంతులను 6, 6, 6 లుగా బాది అతనికి రోహిత్ తనేమిటో చూపించాడు. ప్రదీప్ వేసిన మరుసటి ఓవర్లో కూడా వరుసగా రెండు సిక్సర్లతో రోహిత్ 150కు చేరుకున్నాడు. అదే ప్రదీప్‌కు తర్వాతి ఓవర్లో వరుసగా 4,4,6తో మళ్లీ రోహిత్ చేతిలో శిక్ష పడింది. రోహిత్ ఈ ఇన్నింగ్స్‌లో తాను ఆడిన చివరి 27 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 92 పరుగులు సాధించగా... ప్రదీప్ పరుగులు ఇవ్వడంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం రోహిత్ చేతిలోనే చావుదెబ్బ తిన్న శ్రీలంకకు ఈసారి మళ్లీ అలాంటి అనుభవమే ఎదురైంది.
►153 బంతుల్లో 208 నాటౌట్
►13 ఫోర్లు
►12 సిక్స్‌లు
►3 రోహిత్ వన్డే కెరీర్‌లో డబుల్ సెంచరీల సంఖ్య. గతంలో ఆస్ట్రేలియాపై (209; 2013లో బెంగళూరులో), శ్రీలంకపై (264; 2014లో కోల్‌కతాలో) డబుల్ సెంచరీలు చేశాడు. సచిన్, సెహ్వాగ్, గేల్, గప్టిల్ ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు.
►220 భారత్ తరఫున వన్డేల్లో బరిలోకి దిగిన 220వ క్రికెటర్‌గా 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ గుర్తింపు పొందాడు.
►100 వన్డేల్లో 300 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం భారత్‌కిది 100వ సారి. ఆస్ట్రేలియా (96 సార్లు) రెండో స్థానంలో ఉంది.
►1 ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ (45) నిలిచాడు. సచిన్ 1998లో 40 సిక్స్‌లు కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment