భారత్‌కు తొలి దెబ్బ | india loss the first match | Sakshi
Sakshi News home page

భారత్‌కు తొలి దెబ్బ

Published Wed, Mar 7 2018 1:16 AM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

india loss the first match - Sakshi

ధావన్‌,పెరీరా  

మూడు ఓవర్లకు భారత్‌ స్కోరు 10/2. అదే లంక 3.4 ఓవర్లలోనే 50/1. ఈ ఆరంభమే శ్రీలంకను నిలబెట్టింది. మధ్యలో తడబడినా... విజయం చేజారకుండా చేసింది. మొత్తానికి భారత్‌కు పొట్టి ఫార్మాట్‌లో గట్టిదెబ్బే వేసింది శ్రీలంక. దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన టీమిండియాకు షాకిచ్చింది. గతంలో లంక గడ్డపై ఆడిన మూడు టి20ల్లోనూ గెలిచిన భారత్‌ ఈసారి భంగపడింది. ఆతిథ్య జట్టు జోరు ముందు ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృథా అయ్యింది. కుశాల్‌ పెరీరా ధాటికి భారత బౌలింగ్‌ తేలిపోయింది.   

కొలంబో: భారత్‌ జోరుకు శ్రీలంక కళ్లెం వేసింది. ‘నిదాహస్‌ ట్రోఫీ’ ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో ఆతిథ్య జట్టు శుభారంభం చేసింది. లంక టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ పెరీరా (37 బంతుల్లో 66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు శ్రీలంక విజయానికి గట్టి పునాది వేయగా... ధావన్‌ (49 బంతుల్లో 90; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) ‘హీరో’చిత ఇన్నింగ్స్‌ వృథాగా మారిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (35 బంతుల్లో 37;  3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. చమీరకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి గెలిచింది. తిసారా పెరీరా (22 నాటౌట్‌) మెరుగ్గా ఆడాడు. వాషింగ్టన్‌ సుందర్, చహల్‌ చెరో 2 వికెట్లు తీశారు. విజయ్‌ శంకర్‌ ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ టోర్నీలో గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో భారత్‌... బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.  

రోహిత్‌ విఫలం... రైనా నిర్లక్ష్యం 
ఆట మొదలైందో లేదో... భారత్‌ 2 వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్లో కెప్టెన్‌ రోహిత్‌ (0),  రెండో ఓవర్లో రైనా (1) ఔట్‌. చమీర బౌలింగ్‌లో రోహిత్‌ కొట్టిన భారీ షాట్‌ను జీవన్‌ మెండిస్‌ అద్భుతంగా ఆదుకున్నాడు. రైనా నిర్లక్ష్యంగా వికెట్లను విడిచి ఆడగా... సూటిగా సంధించిన ఫెర్నాండో బంతి వికెట్లను కూల్చింది. దీంతో రైనా క్లీన్‌బౌల్డయ్యాడు. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, మనీశ్‌ పాండే ఆదుకున్నారు.  

శివమెత్తిన ధావన్‌... 
ఇద్దరు ముందుగా నిలదొక్కుకొని తర్వాత మెరుపుల ధాటిని కొనసాగించారు. జీవన్‌ మెండిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో ధావన్‌ ఎల్బీని ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. దీంతో లంక రివ్యూకు వెళ్లింది. అక్కడా నిరాశే ఎదురైంది. అదే ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. పాండే భారీ సిక్స్‌ బాదాడు. నువాన్‌ ప్రదీప్‌ వేసిన మరుసటి ఓవర్లో ధావన్‌ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. 11వ ఓవర్లో బౌండరీతో శిఖర్‌ ఫిఫ్టీ (30 బంతుల్లో; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధావన్‌ వేగం పెంచాడు. భారీ సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో 12వ ఓవర్లో జట్టు స్కోరు వంద పరుగులకు చేరుకుంది. అయితే  కాసేపటికే జీవన్‌ మెండిస్‌ బౌలింగ్‌లో గుణతిలకకు క్యాచ్‌ ఇచ్చి మనీశ్‌ పాండే వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత ధావన్‌కు రిషభ్‌ పంత్‌ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) జతయ్యాడు. ఇద్దరు మరో వికెట్‌ పడకుండా వేగంగా పరుగులు జతచేశారు. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన ధావన్‌... గుణ తిలక బౌలింగ్‌లో పెరీరాకు క్యాచ్‌ ఇచ్చి ‘నెర్వస్‌ నైన్టీస్‌’లోనే వెనుదిరిగాడు. కార్తీక్‌ (13 నాటౌట్‌), రిషభ్‌ పంత్‌లు చివర్లో ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో భారత్‌ 180 పరుగులైనా చేయలేకపోయింది. 

చితక్కొట్టిన పెరీరా  
లంక లక్ష్యం 175 పరుగులు. టి20ల్లో ఇదేమంత సులభం కాదు. కానీ ఒకే ఒక్కడి వేగం జట్టు గమనాన్ని శాసించింది. ఆ ఒక్కడు కుశాల్‌ పెరీరా. కుశాల్‌ మెండిస్‌ (11)తో శుభారంభం దక్కకపోయినా... గుణతిలక (19)తో కలిసి వాయువేగంతో విజయబాట పరిచాడు. ముఖ్యంగా శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో పెరీరా చెలరేగాడు. 4, 4, 4, 6, 4+నోబ్, 4, 0తో మొత్తం 27 పరుగులు బాదేశాడు. రెండో ఓవర్‌ ముగిసేసరికి 19/1 స్కోరుగా ఉన్న లంక... అతని ధాటికి ఓవర్‌ వ్యవధిలో 46/1చేరుకుంది. దీంతో 3.4 ఓవర్లలోనే జట్టు స్కోరు ఫిఫ్టీ దాటింది. పవర్‌ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి 75/2. పది ఓవర్లు పూర్తయ్యేసరికి 101/3. ఇవన్నీ పెరీరా ధాటికి నిదర్శనం. సుందర్‌ (2/28), చహల్‌ (2/37) కాస్త ఇబ్బంది పెట్టినా... శ్రీలంక విజయతీరాన్ని మాత్రం ఆపలేకపోయారు. గుణతిలక, మెండిస్, చండిమాల్‌ (14), షనక (15 నాటౌట్‌) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయినా... కుశాల్‌ పెరీరా వేగానికి తోడుగా నిలిచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement