టీమిండియా
పేస్ బౌలింగ్‌లో పూర్తిగా కొత్త కూర్పు... స్పిన్ దళంలోనూ కొంత మార్పు... బ్యాటింగ్‌లో దూకుడు మేళవింపు... సత్తా పరీక్షకు సిద్ధమైన ఆల్‌రౌండర్లు... వెరసి ముక్కోణపు టి20 టోర్నీలో నయా టీమిండియాప్రధాన ఆటగాళ్ల విశ్రాంతి నేపథ్యంలో ఒక ప్రయోగం! నేటి నుంచే సమరం ప్రారంభం.
కొలంబో: శ్రీలంక స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లవుతున్న సందర్భంగా తలపెట్టిన ‘నిదాహస్’ ముక్కోణపు టి20 టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య శ్రీలంకను ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఎదుర్కోనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఆరుగురు రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగుతున్నందున టీమిండియా కొత్తకొత్తగా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లో కూర్పు మారనుంది. ఈ నేపథ్యంలో అలవాటైన ఉపఖండ పరిస్థితుల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని మన జట్టు ఎలా ఆడుతుందోననే ఆసక్తి నెలకొంది.
అందరికీ అవకాశం...
బ్యాటింగ్‌లో మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా, విజయ్ శంకర్, స్పిన్‌లో వాషింగ్టన్ సుందర్, పేస్‌లో మొహమ్మద్ సిరాజ్, ఉనాద్కట్, శార్దూల్ ఠాకూర్... ఇలా జట్టులోని ఎక్కువ శాతం ఆటగాళ్లు తమని తాము నిరూపించుకునేందుకు ఈ టోర్నీ చక్కని వేదిక. సమీకరణాల రీత్యా ఒకరిద్దరు తప్ప వీరిలో అందరూ తుది జట్టులో ఉండేవారే. ఇక్కడ రాణిస్తే వీరికిది అదనపు ప్రయోజనంగా మారుతుంది. అన్నిటికీ మించి దక్షిణాఫ్రికా పర్యటనలో పూర్తిగా విఫలమైన రోహిత్ శర్మ ముందు మరో అవకాశం. ఈ ‘హిట్ మ్యాన్’ ఇప్పుడు బ్యాటింగ్ బాధ్యత నెరవేర్చడంతో పాటు సారథ్య సామర్థ్యమూ చాటుకోవాలి. ఇష్టమైన ప్రత్యర్థి లంకపై చెలరేగితే ఫూర్వ ఫామ్‌ను అందుకుంటాడు. వైస్ కెప్టెన్ హోదా దక్కిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇందుకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. సఫారీలపై టి20ల్లో వన్‌డౌన్‌లో మెరుపులు మెరిపించిన రైనా మరోసారి ఆకట్టుకుంటే స్థానం పదిలం చేసుకుంటాడు. కేఎల్ రాహుల్, పాండేలను 4, 5 స్థానాల్లో పంపాలనుకుంటే... వికెట్ కీపర్‌గా కార్తీక్, పంత్‌లలో ఎవరుండాలో తేల్చుకోవాల్సి ఉంటుంది. స్పిన్ ఆల్‌రౌండర్ స్థానానికి సుందర్, హుడా మధ్య పోటీ ఉంది. చహల్‌కు తోడుగా అక్షర్ పటేల్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. శార్దూల్, ఉనాద్కట్, సిరాజ్‌లతో పేస్ కూర్పు మొత్తం కొత్తగా కనిపిస్తోంది. మూడో పేసర్ కావాలనుకుంటేనే సిరాజ్‌కు అవకాశం ఉంటుంది.
లంక మెరుగైనా..?
గతేడాది వరుస పరాజయాలతో డీలాపడిన శ్రీలంక... ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే టోర్నీ, టెస్టు సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. జట్టులోకి తిరిగొచ్చిన యువ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ చక్కగా రాణించాడు. అయితే కీలక ఆటగాళ్లు గుణరత్నే, మాథ్యూస్ దూరమవడం లంకకు లోటుగా మారనుంది. కెప్టెన్ చండిమాల్, ఓపెనర్ ఉపుల్ తరంగాలతో పాటు తిసారా పెరీరా వంటి ఆల్‌రౌండర్లున్న బ్యాటింగ్ ఆర్డర్ ప్రత్యర్థికి సవాల్ విసిరేదే. పేసర్ లక్మల్, స్పిన్నర్ అఖిల ధనంజయ ఇటీవలి సిరీస్‌లలో భారత్‌ను ఇబ్బందిపెట్టారు. సొంతగడ్డపై వీరిని ఎదుర్కొనడంలో జాగ్రత్తగా ఉండాలి. రెండో పేసర్‌గా చమీర, షనక, నువాన్ ప్రదీప్‌లలో ఎవరిని ఆడిస్తారో చూడాలి.
పిచ్, వాతావరణం
వికెట్ నెమ్మదిగా ఉంటుంది. ఆరంభంలో పేసర్లకు సహకరిస్తుంది. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్ తిరగొచ్చు. సాయంత్రం వేళ వాతావరణం కొంత మేఘావృతంగా ఉండనుంది.
టోర్నీ ఫేవరెట్లమా? కాదా? పూర్తి స్థాయి జట్టుతో ఆడుతున్నామా..? లేదా..? అనే విషయాలు నేను ఆలోచించడం లేదు. జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం అదృష్టం. దానిని ఓ గౌరవంగా భావిస్తా. తీరికలేని క్రికెట్ నుంచి కొంత విశ్రాంతి అవసరం. కుర్రాళ్లు ఎంతోకాలంగా స్థిరంగా రాణిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వారెలా ఆడతారో చూడాలనుకుంటున్నాం. ఒక్క ఓవర్‌తో అంతా మారిపోయే టి20ల్లో తమదైన రోజున ఏ జట్టైనా గెలవగలదు.’
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్/రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్/దీపక్ హుడా, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, జైదేవ్ ఉనాద్కట్.
శ్రీలంక: కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, చండిమాల్ (కెప్టెన్), ఉపుల్ తరంగ, షనక, తిసారా పెరీరా, ధనంజయ, అపొన్సొ, లక్మల్, చమీర.
►278 గత 11 ఇన్నింగ్స్‌లలో లంకపై రోహిత్ చేసిన పరుగులు. వీటిలో డిసెంబర్‌లో 43 బంతుల్లో చేసిన సెంచరీ కూడా ఉంది. స్ట్రైక్ రేట్ 146.31.
► 3 శ్రీలంకలో శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే నెగ్గింది. ఓవరాల్‌గా రెండు జట్ల మధ్య 14 టి20 మ్యాచ్‌లు జరిగాయి. పదింటిలో భారత్, నాలుగింటిలో శ్రీలంక గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment