
మా రెండో పెళ్లి రోజున చేసిన ఈ ద్విశతకం నా శ్రీమతి రితికా సజ్దేకు అంకితం. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమె ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆమే నా బలం. నా కోసం ఎప్పుడూ అక్కడే ఉండాలి. ఈ ఒత్తిడి ఆటలో అది ప్రత్యేకంగా నిలుస్తుంది. మ్యాచ్‌లో ఎలా వ్యవహరించాలనేదానిపై గట్టిగా నిర్ణయించుకున్నాం. దానినే చివరి వరకు అమలు చేశాం. ఇప్పుడిక విశాఖపట్నం మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. నా ద్విశతకాల్లో మూడూ కీలక సమయాల్లోనే చేశా. ఏదో ఒకదానిని ఎంచుకోమంటే మాత్రం చెప్పలేను. గాయం నుంచి కోలుకుని కోల్‌కతాలో చేసిన 264ను కొంచెం ఎక్కువ గుర్తుంచుకుంటా. ధర్మశాలలో ఓడిపోయి జట్టుగా పై చేయి సాధించాల్సిన స్థితిలో చేసిన ప్రస్తుత డబుల్ సెంచరీ కూడా ప్రత్యేకమైనదే. ఈ మ్యాచ్‌లో తొలి వంద పరుగులను వేగంగా చేసినా... వికెట్ ఇచ్చేవాడిని కాదు. నా గత డబుల్ సెంచరీలను కూడా నిదానంగానే ప్రారంభించి చేశాను.
– రోహిత్ శర్మ, భారత కెప్టెన్
మూడూ (ముద్దూ) ముచ్చట...
49వ ఓవర్ ముగిసేసరికి రోహిత్ స్కోరు 191 పరుగులు... అతను డబుల్ పూర్తి చేయగలడా అని అందరిలో ఉత్సుకత. గ్యాలరీలో కూర్చున్న అతని భార్య రితిక మొహంలో ఎంతో ఆందోళన కనిపిస్తోంది. అయితే పెరీరా వేసిన తొలి బంతినే రోహిత్ సిక్స్ సాయంతో 197కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసే ప్రయత్నంలో రనౌటయ్యే ప్రమాదం కనిపించింది. ఈ సమయంలోనైతే రితిక చూడలేక కళ్లు మూసుకుంది. అనంతరం మూడో బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడి డబుల్ పూర్తి చేసుకున్న రోహిత్ గాల్లోకి ఎగిరి గర్జన చేశాడు. అతనితో పాటు రితిక కూడా భావోద్వేగాలు దాచుకోలేక కంట తడి పెట్టింది. డిసెంబర్ 13 వీరిద్దరి పెళ్లి రోజు కూడా కావడంతో రోహిత్ తన ఉంగరం వేలిని చుంబిస్తూ రితిక వైపు ముద్దులు విసిరి సంబరం జరుపుకోవడం స్టేడియంలోని అభిమానుల మోముపై చిరునవ్వులు పూయించేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment