భారత్ ఎందుకు ఫేవరెట్ అంటే...
ప్రపంచకప్‌కు ముందు భారత్ సాధించిన విజయాలు, సొంతగడ్డపై చెలరేగే నిపుణులతో నిండిన భారత జట్టును ప్రతి ఒక్కరూ ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. మాజీ క్రికెటర్లు, ప్రత్యర్థులు, అభిమానులు... ఇలా అందరి దృష్టిలో ధోనిసేన ఎందుకు ఫేవరెట్ అయ్యింది..? ఈ ప్రశ్నకు సమాధానాలు చాలానే ఉన్నాయి. దూకుడుగా ఆడటంలో ఒకరిని మించిన వారు మరొకరు... సత్తా ఉన్న స్పిన్నర్లు... సమర్థులైన పేసర్లు... నాయకత్వ పటిమ, అద్భుత ఫామ్... అన్నింటికీ మించి సొంతగడ్డపై ఆడుతుండటం... ఇలా భారత్‌ను ఫేవరెట్‌గా మార్చిన అంశాలు చాలానే ఉన్నాయి.
ఇతర జట్లు ఎంత సన్నద్ధమై వచ్చినా, భారత్‌లో ధోని సేనను ఓడించడం ఆషామాషీ కాదు. రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, ధోని ఇలా వరుసగా ప్రతీ ఆటగాడికి ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సామర్థ్యం ఉంది. ఫటాఫట్‌గా ముగిసిపోయే ఈ ఫార్మాట్‌లో ఏ ఇద్దరు రాణించినా ఆ రోజు జట్టుకు తిరుగుండదు. మనోళ్ల అంతర్జాతీయ, ఐపీఎల్ అనుభవం జత కలిస్తే ప్రత్యర్థి జట్లలో దేనికీ ఇంత బలమైన లైనప్ లేదు. సీనియర్ నెహ్రా, జూనియర్ బుమ్రాలతో పేస్ విభాగం మెరుగ్గా కనిపిస్తుండగా... ఇప్పుడు షమీ జత కలవడంతో పేస్ గురించి ఎలాంటి ఆందోళనా లేదు. ఇక మన పిచ్‌లపై అశ్విన్, జడేజాలను ఎదుర్కోవడం అవతలి బ్యాట్స్‌మెన్‌కు శక్తికి మించిన పనే.
సహజంగానే స్పిన్ పిచ్‌లకు అవకాశం ఉంది కాబట్టి మన స్పిన్నర్ల బలం రెట్టింపు కావడం ఖాయం. సాధారణంగా గొప్పలు చెప్పుకునేందుకు ఇష్టపడని ధోని కూడా ‘మాలో ఏ లోపాలూ లేవు’ అని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాడంటే తన జట్టుపై అతనికి ఎలాంటి నమ్మకం ఉందో అర్థమవుతుంది. భారత్ తమ గ్రూప్ నుంచి సునాయాసంగా సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియాలను కూడా చిత్తు చేసిన మన జట్టుకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై కూడా పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు.