ఏదైనా జరగొచ్చు: కరుణ్ నాయర్
ముంబై:ఇటీవల ఇంగ్లండ్తో చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించి, భారత్ తరపున ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దాంతో ఇంగ్లండ్ తో వన్డే, ట్వంటీ 20 సిరీస్ల్లో ఆ యువ క్రికెటర్ కు స్థానం దక్కుతుందని భావించారు. అయితే ఇంగ్లండ్ తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ కు నాయర్ ఎంపిక కాలేదు. ఇదిలా ఉంచితే త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్కు నాయర్కు ప్రాబబుల్స్ లో చోటు దక్కినా, తుది జట్టులో ఉంటాడా?లేదా?అనేది మాత్రం ప్రశ్నార్థకమే.
అజింక్యా రహానే ఫిట్ నెస్ నిరూపించుకుని జట్టులోకి వచ్చిన నేపథ్యంలో నాయర్ స్థానంపై పూర్తిస్థాయి భరోసా లేకుండా పో్యింది. ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏమిటని అడిగిన ప్రశ్నకు నాయర్ తనదైన శైలిలో స్పందించాడు. 'నా స్థానం గురించి పదే పదే ఆలోచించి ఆందోళన చెందడం అనవసరం. నాకు ఎప్పుడైతై అవకాశం వస్తుందో అప్పుడే నన్ను నిరూపించుకుంటా. ప్రస్తుతం నా ఆటపరంగా నాకు ఎటువంటి ఇబ్బందీలేదు. వచ్చే సిరీస్ ల్లో తుది జట్టులో ఉంటానా?లేదా?అనే దానిపై అస్సలు ఆలోచించడం లేదు. క్రికెట్లో ఏదైనా జరగొచ్చు' అని నాయర్ తెలిపాడు. 'వచ్చే గురువారం బంగ్లాదేశ్ తో హైదరాబాద్లో జరిగే టెస్టు మ్యాచ్ను భారత్ గెలుచుకుంటుందని నాయర్ ధీమా వ్యక్తం చేశాడు. పూర్తి ఫామ్లో ఉన్న తమ జట్టు బంగ్లాపై విజయం సాధించడం ఖాయమన్నాడు.