ఆసియాను గెలిచాం 'ప్రపంచం' మిగిలింది | India win Asia Cup title for sixth time | Sakshi
Sakshi News home page

ఆసియాను గెలిచాం 'ప్రపంచం' మిగిలింది

Published Mon, Mar 7 2016 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

ఆసియాను గెలిచాం  'ప్రపంచం' మిగిలింది

ఆసియాను గెలిచాం 'ప్రపంచం' మిగిలింది

భారత్‌దే ఆసియాకప్
ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల విజయం
రాణించిన ధావన్, కోహ్లి


అదే జోరు... ఆసియాకప్‌లో తొలి మ్యాచ్ నుంచి ప్రత్యర్థులకు కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా చెలరేగిపోయిన ధోనిసేన... ఫైనల్లోనూ చెలరేగింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో సొంతగడ్డపై ఫైనల్ వరకూ వచ్చిన బంగ్లా పులులను భారత్ అలవోకగా వేటాడింది. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడి ఆసియా   కప్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, యూఏఈ... ఇలా ఈ ఏడాదిఎదురైన ప్రతి ప్రత్యర్థినీ చిత్తు చేసిన ధోనిసేన... ఇక సొంతగడ్డపై ప్రపంచాన్ని గెలవడమే మిగిలింది.
 

మిర్పూర్: ఆసియాకప్ ఆసాంతం నిలకడగా ఆడి, ఓటమి లేకుండా చెలరేగిన భారత్ ఫైనల్లోనూ అదే జోరు చూపించింది. సొంతగడ్డపై, అభిమానుల అండతో సంచలనం సృష్టించాలనుకున్న బంగ్లాదేశ్ ఆశలు నెరవేరలేదు. శిఖర్ ధావన్ (44 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (28 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు)ల సమయోచిత బ్యాటింగ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 15 ఓవర్లకు కుదించారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 120 పరుగులు చేసింది. మహ్మదుల్లా (13 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షబ్బీర్ రెహమాన్ (29 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగి ఆడారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసి నెగ్గింది. ధోని (6 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు.  ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, షబ్బీర్ రెహమాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులు లభించాయి.


ఆఖర్లో హవా
కొత్త బంతిని అశ్విన్ చేతికి ఇచ్చిన ధోని.. బంగ్లా ఓపెనర్లు తమీమ్ (13), సౌమ్య (14)లను కట్టడి చేయగా, తర్వాతి ఓవర్లలో నెహ్రా, బుమ్రాలు ఒత్తిడిని కొనసాగించారు. దీంతో తొలి మూడు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే వచ్చాయి. ఒత్తిడిని అధిగమించేందుకు నాలుగో ఓవర్‌లో సౌమ్య వరుసగా రెండు ఫోర్లు బాదినా... ఆఖరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే బుమ్రా అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో తమీమ్‌ను వెనక్కి పంపాడు. దీంతో బంగ్లా స్కోరు 30/2కు చేరుకుంది. ఈ దశలో షబ్బీర్, షకీబ్ (21)లు నిలకడగా ఆడారు. అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 34 పరుగులు జత చేశాక షకీబ్‌ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఇక 12వ ఓవర్‌లో ముష్ఫికర్ (4), మోర్తజా (0)లు వరుస బంతుల్లో అవుట్‌కావడం బంగ్లా 75 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత షబ్బీర్‌కు జత కలిసిన మహ్మదుల్లా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయి చివరి మూడు ఓవర్లలో 42 పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 20 బంతుల్లోనే 45 పరుగులు జోడించడంతో బంగ్లా మంచి స్కోరు సాధించింది. అశ్విన్, నెహ్రా, బుమ్రా, జడేజా తలా ఓ వికెట్ తీశారు.


రోహిత్ విఫలమైనా...
లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. అమిన్ బంతిని ఆడబోయి రోహిత్ (1) స్లిప్‌లో దొరికిపోయాడు. దీంతో భారత్ 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత ధావన్, కోహ్లిలు కాస్త జాగ్రత్తగా ఆడారు. అయితే ఐదు, ఆరు ఓవర్లలో ఆరు ఫోర్లతో 29 పరుగులు చేసి జోరు పెంచారు. తర్వాత స్పిన్నర్ నాసిర్ హుస్సేన్ కట్టడి చేసినా... మోర్తజా ఓవర్‌లో ధావన్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదడంతో పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 71/1కి చేరింది. ఈ క్రమంలో ధావన్ 11వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 12వ ఓవర్‌లో కోహ్లి... మూడు బౌండరీలతో నాసిర్‌కు చుక్కలు చూపెట్టాడు. ఇక 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో ధావన్ కొట్టిన బలమైన షాట్‌ను పాయింట్‌లో సౌమ్య అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 12 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో ధోని మెరుపులు మెరిపించాడు. అమిన్ వేసి న 14వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. ధోని, కోహ్లి మూడో వికెట్‌కు 7 బంతుల్లో అజేయంగా 23 పరుగులు జత చేశారు.
 
 
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 13; సౌమ్య సర్కార్ (సి) పాండ్యా (బి) నెహ్రా 14; షబ్బీర్ నాటౌట్ 32 ; షకీబ్ (సి) బుమ్రా (బి) అశ్విన్ 21; ముష్ఫికర్ రనౌట్ 4; మోర్తజా (సి) కోహ్లి (బి) జడేజా 0; మహ్మదుల్లా నాటౌట్ 33; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (15 ఓవర్లలో 5 వికెట్లకు) 120.  

వికెట్ల పతనం: 1-27; 2-30; 3-64; 4-75; 5-75.

బౌలింగ్: అశ్విన్ 3-0-14-1; నెహ్రా 3-0-33-1; బుమ్రా 3-0-13-1; జడేజా 3-0-25-1; పాండ్యా 3-0-35-0.

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌమ్య (బి) అల్ అమిన్ 1; ధావన్ (సి) సౌమ్య (బి) తస్కిన్ 60; కోహ్లి నాటౌట్ 41; ధోని నాటౌట్ 20; మొత్తం: (13.5 ఓవర్లలో 2 వికెట్లకు) 122.

వికెట్ల పతనం: 1-5; 2-99.

బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 3-0-14-1; అల్ అమిన్ 2.5-0-30-1; అబు హైదర్ 1-0-14-0; షకీబ్ 2-0-26-0; మోర్తజా 2-0-16-0; నాసిర్ హుస్సేన్ 3-0-22-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement