హామిల్టన్ : ‘అబ్బా.. బాగానే ఆడినా అమ్మాయిలు ఓడారు కదా.. దురదృష్టం వెంటాడితే అంతేలే!’ అని న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 అనంతరం ప్రతి అభిమాని మనస్సులోని భావన. ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఓడినా తమ పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. చివరి ఓవర్లో భారత విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. క్రీజులో వెటరన్ బ్యాటర్ మిథాలీ రాజ్, దీప్తిశర్మలున్నారు. తొలి బంతిని మిథాలీ బౌండరీ బాదగా విజయంపై ఆశలు రేకెత్తాయి. మరుసటి బంతి సింగిల్ రాగా.. స్ట్రైకింగ్ దీప్తికి వచ్చింది. దీప్తి కూడా బౌండరీ బాదడంతో భారత విజయం కాయం అని అందరూ భావించారు. కానీ కాస్పెరెక్ తెలివిగా బౌలింగ్ చేసి పరుగులకు రాకుండా అడ్డుకుంది. చివరి బంతికి ఫోర్ బాదితే మ్యాచ్ భారత్ వశం అయ్యేది. కానీ మిథాలీ సింగిల్‌తో సరిపెట్టడంతో ఊరించిన విజయం చేజారింది.
భారత మహిళలు తమ సాయశక్తులా పోరాడినా విజయం రెండు పరుగులతో ఆతిథ్య జట్టును వరించిది. ఈ గెలుపుతో కివీస్ మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. ఓపెనర్ సోఫి డెవిన్ (72: 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్ అమీ సట్టెర్‌వైట్ (31), సుజీ బెట్స్(23)లు రాణించడంతో 162 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
మెరిసిన స్మృతి మంధాన
అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్‌కు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన ఫామ్‌ను కొనసాగిస్తూ మంచి శుభారంభాన్ని అందించింది. మరో ఓపెనర్ ప్రియా పూనియా(1) తీవ్రంగా నిరాశ పరిచినప్పటికి.. జెమీమా(21)తో మంధాన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ దశలో 33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో మంధాన కెరీర్‌లో 8వ అర్ధసెంచరీ సాధించింది. అయితే ఆ వెంటనే జెమీమా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్(2) తన వైఫల్యాన్ని కొనసాగించింది. త్వరగా వెనుదిరిగి తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వెటరన్ బ్యాటర్ మిథాలీ రాజ్.. మంధానకు మద్దతుగా నిలిచింది. ఇక సెంచరీ దిశగా దూసెకెళ్తున్న మంధానకు డెవిన్ బ్రేక్‌లు వేసింది. భారీ షాట్‌కు ప్రయత్నించిన మంధాన క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. చివర్లో దీప్తి శర్మ(21 నాటౌట్), మిథాలీరాజ్ (24 నాటౌట్)లు పోరాడినప్పటికి విజయం ఆతిథ్య జట్టునే వరించింది.
Comments
Please login to add a commentAdd a comment