చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ | Smriti Mandhana Scripts History Breaks Mithali Raj All Time Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Published Tue, Oct 29 2024 9:25 PM | Last Updated on Tue, Oct 29 2024 9:27 PM

Smriti Mandhana Scripts History Breaks Mithali Raj All Time Record

స్మృతి మంధాన (PC: BCCI X)

భారత స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డేల్లో దిగ్గజ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టింది. కాగా భారత మహిళా జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన గెలవగా.. రెండో వన్డేలో సోఫీ డివైన్‌ బృందం ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.

భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేసి.. 76 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మాబాద్‌లో మంగళవారం సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని.. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్‌ అయింది. 86 పరుగులతో బ్రూక్‌ హాలీడే కివీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

వన్డేల్లో  ఎనిమిదో సెంచరీ
ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన శతకంతో మెరిసింది. తొలి రెండు వన్డేల్లో(5, 0) నిరాశపరిచిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్.. నరేంద్ర మోదీ స్టేడియంలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. కాగా వన్డేల్లో స్మృతికి ఇది ఎనిమిదో సెంచరీ.

ఈ క్రమంలో మిథాలీ రాజ్‌ రికార్డును స్మృతి బ్రేక్‌ చేసింది. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా అవతరించింది. కాగా గతంలో మిథాలీ రాజ్‌ 211 వన్డే ఇన్నింగ్స్‌ ఆడి ఏడు శతకాలు బాదగా.. స్మృతి తన 88వ మ్యాచ్‌లోనే ఎనిమిదో సెంచరీ చేసింది. ఇక ఈ జాబితాలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆరు శతకాలతో మూడో స్థానంలో ఉంది.

2-1తో సిరీస్‌ కైవసం
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. స్మృతితో పాటు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత ఇన్నింగ్స్‌(59 నాటౌట్‌) మెరిసింది. ఫలితంగా భారత్‌ న్యూజిలాండ్‌ విధించిన లక్ష్యాన్ని 44.2 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలో సెంచరీ బాదిన స్మృతికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో 100 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కివీస్‌ పేసర్‌ హన్నా రోవ్‌ బౌలింగ్లో‌ స్మృతి బౌల్డ్‌ అయింది.

వన్డేల్లో అత్యధిక  శతకాలు సాధించిన భారత మహిళా క్రికెటర్లు
స్మృతి మంధాన- 8*
మిథాలీ రాజ్‌- 7
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌- 6*

చదవండి: IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్‌ టైటాన్స్‌ రిటైన్‌ చేసుకునేది వీరినే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement