Mithali Raj on Women's T20 World Cup debacle: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమణకు ప్రధాన కారణం గత మూడేళ్లుగా జట్టులో పురోగతే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దుబాయ్‌లో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలపై, క్రికెటర్లలో కొరవడిన పట్టుదలపై తన అభిప్రాయాలను పంచుకుంది.
‘ప్రపంచకప్‌కు సన్నాహంగా ఆడిన ఆసియా కప్‌లో చిన్న జట్లతో ఆడేటప్పుడు రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసేందుకు వారికి అవకాశాలివ్వాలి. పురుషుల జట్టు చేస్తోంది అదే. మెగా ఈవెంట్లు, పెద్ద టోర్నీలకు ముందు ఈ కసరత్తు చాలా అవసరం.
కానీ మన మహిళల జట్టు విషయంలో అలాంటిదేదీ ఉండదు. రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వరు. ఇది జట్టు నిర్మాణానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది’ అని వివరించింది.
పలు ప్రశ్నలకు మిథాలీ ఇచ్చిన సమాధానాలు...
టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై మీ విశ్లేషణ?
దీనిపై మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో మ్యాచే గురించే! తప్పక గెలవాల్సిన పోరు అది. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించినా... మళ్లీ కంగారే. మరో పాత కథే! గత రెండు, మూడేళ్లుగా జట్టు సాధించిన పురోగతి నాకైతే కనపించట్లేదు. గట్టి జట్లను ‘ఢీ’కొట్టేముందు చేసే కసరత్తు, ఆటలో ఎత్తుగడలేవీ మెప్పించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో కొన్ని జట్లు క్రమంగా పుంజుకున్నాయి. దక్షిణాఫ్రికానే దానికి సరైన ఉదాహరణ.
ఆస్ట్రేలియా కంటే కూడా న్యూజిలాండ్‌తో ఎదురైనా పరాజయమే భారత్ నిష్క్రమణకు కారణమని భావిస్తున్నారా?
ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మనం పరిస్థితులకు తగ్గట్లుగా వెంటనే మారకపోవడమే ఆ మ్యాచ్ ఓటమికి కారణం. మందకొడి వికెట్‌పై వన్డే ప్రపంచకప్‌లో అయితే ముందు నింపాదిగా ఆడి తర్వాత పుంజుకొని ఆడే సౌలభ్యం వుంటుంది. కానీ టీ20 ఫార్మాట్‌లో అలాంటి అవకాశం ఉండదు. త్వరితగతిన సందర్భాన్ని బట్టి ఆటతీరు మార్చుకోవాలి. సోఫీ డివైన్ చేసింది అదే. కానీ మనం మాత్రం అలా ఆడలేకపోయాం.
తరుచూ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వల్ల ఆయా స్థానాల్లో స్పష్టత కొరవడిందా?
జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు తరచూ 3, 4 స్థానాలు మార్చుకోవడం కారణమని నేననుకోను. బ్యాటింగ్‌లో ఓపెనర్ల శుభారంభమే అత్యంత కీలకం. షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ అలా జరగలేదు. ఓపెనర్లిద్దరు బాగా ఆడిఉంటే మిడిల్ ఓవర్లలో యథేచ్ఛగా ఆడే అవకాశముంటుంది.
మొదట పవర్ ప్లే, ఆఖర్లో డెత్ ఓవర్లు మంచి స్కోరుకు బాట వేస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలోని కీలక మ్యాచ్‌ల్లో అలాంటి శుభారంభాలు, చివర్లో దూకుడు కరువయ్యాయి. ఆసియా కప్‌లో కనిపించిన లోపాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ అలా ఏమీ జరగలేదు.
ప్రపంచకప్ ముంగిట ఫీల్డింగ్ విభాగంపై దృష్టి సారించకపోవడం పెద్ద తప్పిదమని మీరు అంగీకరిస్తారా?
ఈ విషయంలో ఆస్ట్రేలితో జరిగిన మ్యాచ్ నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ తప్ప 11 మందిలో మిగతా వారంతా మైదానంలో చురుగ్గా కనిపించలేదు. కీలకమైన మ్యాచ్‌లో ఇద్దరితో కట్టడి ఎలా సాధ్యమవుతుంది.
ఫిట్‌నెస్ అతిముఖ్యం. దీనిపై మనం ఒక బెంచ్‌మార్క్‌ను పెట్టుకోవాల్సిందే. నిజాయితీగా అడుగుతున్నా ఏడాదంతా ఎంత మంది మన క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నారో చెప్పగలరా! ఆ శ్రద్ధలేకే మైదానంలో ఫీల్డింగ్ విభాగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
హర్మన్‌ప్రీత్ 2018 నుంచి కెప్టెన్ ఉన్నా... ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సారథ్య మార్పు అవసరమా?
ఒకవేళ సెలక్టర్లు కెప్టెన్‌ను మార్చాలనుకుంటే మాత్రం నేను యువ క్రికెటర్‌కు పగ్గాలివ్వాలని కోరుకుంటాను. సారథ్య మార్పునకు ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేస్తే... మనం ఇంకో ప్రపంచకప్‌కూ దూరమవుతాం. చేస్తే ఇప్పుడే కొత్త సారథిని ఎంపిక చేయాలి. మరీ ప్రపంచకప్ సమీపంలో చేస్తే ఒరిగే ప్రయోజనం కూడా ఉండదు.
స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే..
వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ 24 ఏళ్ల జెమీమాకు పగ్గాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువకాలం సారథిగా కొనసాగే వీలుంటుంది. పైగా మైదానంలో చురుకుదనం, ఫీల్డింగ్‌లో అందరిలో ఉత్తేజం నింపే శక్తి ఆమెకుంది.
ఈ టోర్నీ ఆసాంతం ఆమె కనబరిచిన చురుకుదనం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి జెమీమాకు పగ్గాలిస్తే జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లవుతుంది.
చదవండి: W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్
Comments
Please login to add a commentAdd a comment